యోగ నిద్ర మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుంది
posted on Jan 20, 2023
యోగ నిద్ర మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుంది
మానసిక ప్రశాంతతను, రక్త ప్రసరణకు కావాల్సిన ఆక్సిజన్ సరఫరా పెంచడమే కాకుండా మనకు కలిగే ఇన్ ఫెక్షన్ల నుండి కాపాడేది, మన శరీరానికి కావాల్సిన ఫ్లేక్సిబిలిటీ మరియు శక్తినీ కూడా అందిచేది ఒక యోగానిద్ర మాత్రమే ! మరి ఆలాంటి యోగనిద్ర ఎలా చేయాలో తెలుసుకుంటే మంచిదే కదా !
* యోగనిద్ర చేయలనుకున్నప్పుడు సులువుగా వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. ఒంటిమీద ఎక్కడ బిగ్గరగా ఉండకుండా చూసుకోవాలి. వాచ్, నడుముకి పెట్టుకొనే బెల్ట్‌లాంటి లేకుండా చూసుకోవాలి. ఆ తరువాత వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లు కొద్దిగా దూరంగా ఉంచి.. రెండు చేతులు ఆకాశంవైపు ఉంచాలి. తలని కొద్దిగా ఎడమవైపు గానీ, కుడివైపు గానీ తిప్పాలి. శ్వాస నెమ్మదిగా పీల్చుకుంటూ శరీరాన్ని భూమిమీద రిలాక్స్‌డ్‌గా వదిలివేయాలి. మనసులో ఆలోచనలు లేకుండా ధ్యాస పూర్తిగా శరీరం మీద పెట్టాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా గాలి పీలుస్తూ, వదులుతూ ఉదర కండరాలను పరిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు పరిసరాల వైపు మన ధ్యాసను మళ్లించాలి.
* యోగనిద్ర చేయడం వల్ల ఆందోళనలు తగ్గుతాయి. తలనొప్పి రాకుండా ఉంటుంది. బీపీ వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. సిస్టోలిక్ బీపీ, డయాస్టోలిక్ బీపీని 10 నుంచి 15మి.మీ వరకు అదుపు కూడా చేయడంలో ఉపయోగపడుతుంది. యోగనిద్ర చేయడం వలన అన్నీ ఉపయోగాలే తప్ప ఇబ్బందులు, సమస్యలు రావు. ప్రతిరోజు యోగానిద్ర చేస్తే చాలు మనకు కలిగే చిన్న చిన్న నొప్పులకు డాక్టర్ గారిని సంప్రదించవలసిన అవసరం ఉండకపోవచ్చు.
* మొదటగా కుడి అరచేతి నుంచి మొదలుపెట్టి కుడిచేతివేళ్లను, కుడి అరచేతిని, మణికట్టుని, మోచేతిని, భుజాలను, శరీరపక్క భాగాలను, నడుము జాయింట్స్, తొడ కండరాలు, మోకాళ్లు, పిక్కలు, కాలి మడమలు, అరికాళ్లు, పాదం కాలి వేళ్లు ... ఇలా ఒక్కో భాగాన్ని గమనిస్తూ నెమ్మదిగా రిలాక్స్ చేస్తూ మొత్తం కుడిపక్కన శరీర భాగాలన్నింటి బరువునంతా భూమిమీద వదిలేయాలి. ఇదే విధంగా ఎడమ అరచేతి నుంచి మొదలుపెట్టి, ఎడమ కాలి వేళ్ల వరకు శరీర భాగాలన్నింటిని చేయాలి.
* ఇప్పుడు శరీరం వెనుక భాగంలో ధ్యాస ఉంచాలి. మొదట కుడి తుంటి భాగం, తరువాత ఎడమ తుంటిభాగం, వెన్నెముక కింది భాగం, మధ్య భాగం, భుజాల కీలు భాగాలు... ఇలా వరుసగా ధ్యాస ఉంచి వాటిని రిలాక్స్ చేస్తూ రావాలి. ఇప్పుడు శరీరం ముందు వైపు ధ్యాస కేంద్రీకరించాలి. తల, నుదుటి భాగం, కుడి కన్ను, ఎడమకన్ను, ముక్కు, ముక్కు కొనభాగం, కుడిచెంప, ఎడమ చెంప, పై పెదవి, కింది పెదవి, చుబుకం, కుడివైపు కాలర్‌బోన్, ఎడమవైపు కాలర్‌బోన్, కుడి ఛాతి భాగం, ఎడమ ఛాతి భాగం, బొడ్డు చుట్టుపక్కల, పొత్తికడుపు ఇలా... మొత్తం శరీరం మీద ధ్యాస ఉంచి... తరువాత శరీరాన్ని రిలాక్స్ చేయాలి.