Yoga for eyecare...!

 

కంటి సంరక్షణకై యోగ

Yoga exercises to keep eyes healthy


                                     శరీర భాగాలన్నింటిలో కళ్ళు చాలా సున్నితమైనవి, మరియు ముఖ్యమైనవి. కళ్ళలో చిన్న నలక పడ్డ కళ్ళు తెరుచుకోలేనంతగా ఇబ్బంది పడతాం, కళ్ళు లేకపోతే మనిషి జీవితమే అంధకారం అయిపోతుంది. అందుకే అన్నారు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని. కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యత. ముఖ్యంగా కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేసేవారు, అధిక వెలుతురు వంక చూస్తూ పని చేసేవారు కళ్ళకు విశ్రాంతితో పాటు, సరైన వ్యాయామాన్ని కూడా చేస్తుండాలి.

 

కంటి సంరక్షణకై చేసే యోగా పద్ధతులు :

  • ముందుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రిలాక్స్ డ్ గా కూర్చోవాలి. ఆ తరవాత కళ్ళను రెండు నిమిషాల పాటు గట్టిగా మూయండి, ఆ తరవాత తెరవండి, మళ్ళీ మూయండి, తరవాత తెరవండి. ఇలా రెండు మూడు సార్లు చేయండి.

  • మీ రెండు కళ్ళను కాసేపటి వరకు మూసుకోవాలి. మనసులో ఎటువంటి భయాందోళనలు కలిగించే ఆలోచనలు కానీ, ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. గట్టిగా గాలిని లోపలికి పీల్చాలి. ఆ తరవాత మెల్లిగా కళ్ళను తెరవాలి. ఇప్పుడు తలను కదల్చకుండానే కుడి పక్కకు చూడాలి, అదే విధంగా ఎడమ ప్రక్కకు చూడాలి, మళ్ళీ కుడిప్రక్కకు తరవాత ఎడమ ప్రక్కకు ఇలా రెండు మూడు సార్లు చేసి కళ్ళను మూసి రిలాక్స్ అవ్వాలి.
  • ఆ తరవాత కళ్ళను తెరచి తలను కదలనీయకుండానే పైకి చూడాలి, ఆ తరవాత కిందికి చూడాలి. మళ్ళీ పైకి తరవాత కిందికి ఇలా రెండు మూడు సార్లు చేయాలి. ఆ తరవాత యధావిధిగా కాసేపు కళ్ళను మూసి రిలాక్స్ అవ్వాలి.
  • ఆ తరవాత మెల్లిగా కళ్ళను తెరిచి కనుగుడ్లు కుడి వైపుకు వచ్చేలా పైకి చూడాలి, అలాగే ఎడమ దిగువ భాగానికి ఉండేలా కిందికి చూడాలి. మళ్ళీ పైకి కుడి వైపుకు చూడాలి, తరవాత ఎడమ కింది వైపుకు చూడాలి.

  •  తర్వాత మెల్లిగా కళ్ళను తెరిచి కనుగుడ్లు ఎడమ వైపుకు వచ్చేలా పైకి చూడాలి, అలాగే ఎడమ దిగువ  భాగానికి ఉండేలా కిందికి చూడాలి. మళ్ళీ పైకి ఎడమ వైపుకి చూడాలి. తరవాత కుడి కింది వైపుకి చూడాలి. ఆ తర్వాత కళ్ళను మూసుకుని రిలాక్స్ అవ్వాలి.

  • మెల్లిగా కళ్ళను తెరిచి రివర్స్ క్లాక్ వైజ్ లో కనుగుడ్లను గుండ్రంగా తిప్పాలి. ఇలా 5 సార్లు చేశాక రివర్స్ క్లాక్ వైజ్ లో 5 సార్లు తిప్పాలి. ఆ తరవాత కళ్ళను మూసుకుని రిలాక్స్ అవ్వాలి.

  • కుడి చేతిని ముందుకు చాచి, పిడికిలి బిగించి బొటన వేలిని పైకి ఉంచాలి. మెల్లిగా కళ్ళను తెరిచి ఆ బొటన వేలి వంక తీక్షణంగా చూడాలి. ఆ తర్వాత గదిలో దూరంగా ఉన్న ఏ వస్తువు వంకైనా చూడాలి, తరవాత మీ ముక్కు కొనను చూడాలి. ఆ తర్వాత, బొటనవేలిని, దూరంగా ఉన్న వస్తువుని, ముక్కు కొనని ఇలా త్వరత్వరగా 5, 6 సార్లు చేయాలి. ఇలా చేసిన తరవాత కళ్ళను మూసుకుని రిలాక్స్ అవ్వండి.

  • మెల్లిగా కళ్ళను తెరిచి మీ అరచేతులను వెచ్చబడేంత వరకు రుద్ది, మీ కళ్ళపై మృదువుగా ఉంచుకోండి. కళ్ళపై ఎటువంటి ప్రెజర్ పెట్టకూడదు. అలా మీ అరచేతులను కళ్ళపై పెట్టుకున్నప్పుడు మీ చేతివేళ్ళ మధ్యగా ఎలుతురు కళ్ళపై పడకూడదు. మూసి ఉన్న కళ్ళలో పూర్తిగా చీకటి అలుముకోవడం మీరు గమనిస్తారు. ఇలా ఒక నిమిషం వరకు ఉంచి చేతులను తీసివేసి మెల్లిగా కళ్ళను తెరవండి. ఇలా రెండు మూడు సార్లు చేసి కళ్ళను మూసుకుని రిలాక్స్ అవ్వండి.

  • మెల్లిగా కళ్ళను తెరిచి మీ రెండు చూపుడు వేళ్ళను కళ్ళకు ఎదురుగా పెట్టాలి, మీ రెండు కళ్ళ దృష్టి పూర్తిగా ఆ రెండు వేళ్ళపై కేంద్రీకరించాలి. ఆ తరవాత ఆ రెండు వేళ్ళను మీ దృష్టి మరల్చకుండా కంటికి కాస్త దగ్గరగా తీసుకు రావాలి. ఆ తరువాత దూరంగా వెళ్ళాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి.
                     
    ఇలా చేయడం వల్ల కళ్ళకు విశ్రాంతితో పాటు, వాటి కండరాలకు బలం చేకూరుతుంది. పై ప్రక్రియలను చేయడానికి రోజుకు 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మనం ప్రపంచాన్ని చూడటానికి దోహదపడే కళ్ళను జాగ్రత్తగా కాపాడుకుందాం.