ప్రపంచ తల్లిపాల వారోత్సవం.. బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యం.!

పుట్టిన వెంటనే ప్రతి బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం జరుగుతుంది.  ముఖ్యంగా భారతదేశంలో తల్లిపాల గురించి చాలా సెంటిమెంట్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటారు. తల్లిపాలు వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం. దీనికోసం ప్రతి సంవత్సరం ఒక థీమ్ ను కూడా ఎంచుకుంటారు.  "జీవితంలో సుస్థిరమైన ఆరంభం కోసం తల్లిపాలు: పనిచేసే వాటిని బలోపేతం చేయండి ". అనే థీమ్ ను 2026 సంవత్సరానికి ఎంచుకున్నారు.  తల్లిపాలు పట్టడాన్ని పెంచడంలో ఇప్పటికే విజయవంతమైన పద్ధతులను మరింత మెరుగుపరచడమే దీని లక్ష్యంగా చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

తల్లిపాలు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలల పాటు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఈ సమయంలో శిశువుకు నీరు, తేనె, ఆవు పాలు లేదా మరే ఇతర పదార్థాలు అవసరం లేదు. ఎందుకంటే తల్లిపాలు మాత్రమే శిశువుకు కావలసిన అన్ని అవసరాలను తీరుస్తాయి. పుట్టిన వెంటనే విడుదలయ్యే చిక్కటి, పసుపు రంగు పాలను కొలోస్ట్రమ్ అంటారు, ఇది శిశువుకు చాలా ముఖ్యం. ఇందులో నవజాత శిశువును ఇన్ఫెక్షన్లు , వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే యాంటీబాడీలు పుష్కలంగా ఉంటాయి. అందుకే, పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలు పట్టడం చాలా అవసరమని వైద్యులు ఎల్లప్పుడూ చెబుతారు.

తల్లిపాలలో  పోషక విలువలు..

శిశువుకు సుమారు ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరేమీ తినిపించకూడదని చెబుతారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహార వనరు. ఒక నివేదిక ప్రకారం, శిశువు శారీరక, మానసిక వికాసానికి అవసరమైన ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు సరైన మోతాదులో తల్లిపాలలోనే  ఉంటాయి. తల్లిపాలలో ఉండే కొవ్వు శిశువు మెదడు అభివృద్ధికి సహాయపడగా, ప్రోటీన్ శరీర కణాల నిర్మాణానికి తోడ్పడుతుంది. ఇందులో లాక్టోస్ అనే చక్కెర కూడా ఉంటుంది, ఇది శక్తిని అందిస్తుంది.

అన్నింటికన్నా ముఖ్యంగా..

తల్లిపాలలో ఉండే యాంటీబాడీలు , తెల్ల రక్త కణాలు పిల్లల రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. అందుకే తల్లిపాలు తాగే పిల్లలకు విరేచనాలు, న్యుమోనియా, చెవి ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) , యూనిసెఫ్ సిఫార్సుల ప్రకారం, 6 నెలల తర్వాత అనుబంధ ఆహారాలు ప్రవేశపెట్టినప్పటికీ, పిల్లలకు కనీసం 2 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు తల్లిపాలు పట్టాలని చెబుతున్నారు.

                                 *రూపశ్రీ.