బొజ్జలో బుజ్జాయికి బోలెడు కబుర్లు చెప్పండి!
posted on Mar 5, 2024
బొజ్జలో బుజ్జాయికి బోలెడు కబుర్లు చెప్పండి!
ప్రహ్లాదుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే నారదుడు చెప్పినవన్నీ విన్నాడంటే, అభిమన్యుడు పద్మవ్యూహం మెళకువలు అమ్మ కడుపులో ఉన్నప్పుడే విని నేర్చుకున్నాడంటే అవి పురాణ కథలు అనుకుంటాం. కానీ, బొజ్జలో పాపాయి కదలికల్ని కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తుంటే, మన అనుభూతులకి, మాటలకి పాపాయి స్పందనని చూస్తుంటే అవన్నీ నిజమని నమ్మక తప్పదు. బుజ్జి పాపాయి పుట్టాక మాత్రమే భయం, ఆనందం వంటివి తెలుస్తాయని అనుకుంటాం కదా మనం. కానీ, అమ్మ బొజ్జలో ఉన్న పాపాయి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తే ఉలిక్కిపడుతుందట. భయంతో అటూ ఇటూ తిరుగుతుందట. ఈమధ్యకాలంలో శిశువు గర్భంలో వున్నప్పుడు తన స్పందన తీరుని పరిశీలించే ప్రయోగాలు ఎన్నో జరుగుతున్నాయి.
అమ్మ భావావేశాలు కడుపులో బిడ్డకి ఎంచక్కా అర్థమవుతాయిట. అమ్మ కోపంగా వున్నా, బాధగా వున్నా ఇట్టే తెలిసిపోతుందట. అందుకేనేమో మన పెద్దవాళ్ళు కడుపుతో వున్నవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా వుండాలని చెప్తారు. సరే, కేవలం ఆ ఎమోషన్స్.ని అర్థం చేసుకోవడమే కాదు, వాటి ప్రభావం ఆ బిడ్డపై వుండటం కూడా గమనించారు శాస్త్రవేత్తలు. బిడ్డ ఎదుగుదల, తన ఎమోషన్స్ కూడా ప్రభావితమవడం గుర్తించారు. ఓ విషయం తెలుసా? కడుపుతో వున్న తల్లి ఇష్టాయిష్టాలు బిడ్డపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఓ వ్యక్తిని ఆమె ఎక్కువగా ద్వేషించినా, కోపగించుకున్నా, భయపడినా కడుపులో వున్న బిడ్డ ఆ వ్యక్తి గొంతు గుర్తుపెట్టుకుంటాడట. పుట్టాక తిరిగి ఆ వ్యక్తి గొంతు విన్నప్పుడు గుర్తించి ఏడుస్తాడట. ఇది ప్రయోగాత్మకంగా నిపుణులు గుర్తించిన సత్యం.
ఇష్టమైన మ్యూజిక్ వినడం, మంచి పుస్తకాలు చదవడం, ఇష్టమైన ప్రదేశాలలో గడపటం, ఎప్పుడూ ఆనందంగా వుండటం ఇవన్నీ కడుపుతో వున్నవారికి అందరూ సాధారణంగా చెప్పే విషయాలు. దీనివెనుక కారణం, అమ్మ సంతోషంగా వుంటే ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతాడని. ఈ విషయంలో ఎందుకు? ఎలా? అన్న అనుమానాలతో కొందరు శాస్త్రవేత్తలు కొందరు గర్భిణులని తొమ్మిది నెలలపాటు గమనించినప్పుడు తల్లి ఆనందంగా వున్నప్పుడు గర్భసంచి చుట్టూ రక్త ప్రసరణ చక్కగా జరగడం గమనించారు. తల్లి ఆనందం ఆమె శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపిస్తే అవి బిడ్డ ఎదుగుదలకి తోడ్పడే హార్మోన్లని ప్రేరేపించడం గుర్తించారు. దాంతో ఎప్పుడూ సంతోషంగా వుండే తల్లి ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనిస్తుంది అని నిరూపించబడినట్టే.
పిల్లలకి కథలంటే ఇష్టం కదా. ఓ మూడు నాలుగేళ్ళు వచ్చినప్పటి నుంచి పిల్లలకి కథలు చెబుతాం.. అవునా? కానీ, అమ్మకి మూడో నెల దాటిన దగ్గర్నుంచి బొజ్జలో పాపాయికి కమ్మని కథలు చెప్పాలట. రోజూ ఓ నిర్దిష్ట సమయం పెట్టుకుని బిడ్డతో మాట్లాడ్డం, కథలు చెప్పడం, లాలిపాటలు పాడటం చెయ్యాలిట. కొన్ని రోజులకి ఆ సమయానికల్లా బిడ్డ మన కబుర్ల కోసం ఎదురుచూస్తాడట. బిడ్డ కదలికలతో అమ్మ ఈ విషయాన్ని గుర్తించవచ్చు అంటున్నారు ఈ విషయంపై అధ్యయనం చేసినవారు. అంతేకాదు ఏ కథలు, పాటలు అయితే వీరు కడుపులో వున్న బిడ్డకి వినిపించారో, బిడ్డ పుట్టాక వాటిని విన్నప్పుడు అవేవో తనకి ముందే తెలిసినవి అన్నట్టు ఆనందంతో స్పందించడం గుర్తించారు ఆ అధ్యయనంలో. చూశారా పాపాయి పారాడే వయసు దాకా అక్కరలేదు. కడుపులో పడినప్పటి నుంచి తనతో అనుబంధానికి దారులు వేయొచ్చు అమ్మ.
కడుపులో బిడ్డ ఊపిరి పోసుకున్న క్షణం నుంచి అమ్మ తనతో అనుబంధానికి ప్రయత్నించవచ్చు అని చెప్పుకున్నాం కదా! ఇక్కడో విషయం చెప్పాలి. ఆరోగ్యవంతమైన బిడ్డ కావాలన్నా, ఆ తర్వాత పెరిగి పెద్దయి మంచి వ్యక్తిత్వంతో మెలగాలన్నా అందుకు పునాది అమ్మ కడుపులో వున్నప్పుడే పడుతుంది అని గట్టిగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మరి ఈ విషయంలో కాబోయే అమ్మలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాల్సిందే. చిట్టిపొట్టి కథలు, లాలిపాటలు, కమ్మటి కబుర్లు కడుపులోని పాపాయితో పంచుకోవాల్సిందే.. ఏమంటారు?
- రమ ఇరగవరపు