మీ ముఖం మిలమిల మెరవాలంటే.. ఇదిగో బియ్యం పిండిని ఇలా వాడండి..!


 గాజులాంటి చర్మం లేదా కాంతివంతమైన ముఖం అనగానే తరచుగా కొరియన్ స్కిన్ కేర్ గుర్తుకు వస్తుంది. బియ్యాన్ని వందల సంవత్సరాల నుండి  కేవలం ఆహారంగానే కాకుండా చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా , కాంతివంతంగా ఉంచడానికి అమ్మమ్మల చర్మ సంరక్షణలో బియ్యపు పిండి,  బియ్యపు నీరు  ఉండేవి.

బియ్యంలోని పిండిపదార్థం, అమైనో ఆమ్లాలు , కొన్ని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఉపరితలాన్ని శుభ్రపరచి, చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.  ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులకు బదులుగా, సులభంగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో టిప్స్  పాటిస్తే చర్మాన్ని కొరియన్ ల కంటే అందంగా మార్చుకోవచ్చు.
 అందులో  భాగంగానే చర్మం అందంగా, మిలమిల మెరవాలంటే..  ఇంట్లోనే బియ్యం పిండిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే..

ఫేస్ టోనర్..

బియ్యం కడిగిన తర్వాత మిగిలిన నీటిని పారేయకుండా, 20-30 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత, దానిని వడకట్టి ఒక స్ప్రే బాటిల్‌లో పోయాలి.


ఎలా ఉపయోగించాలి?
 

ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత, దూది లేదా స్ప్రే సహాయంతో దీనిని అప్లై  చర్మం పై అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి. లేదా  చర్మానికి సరిపడితే కొద్దిగా ఆరనివ్వాలి.

ప్రయోజనాలు:

చర్మం తాజాగా , తేలికపాటి తేమతో ఉన్నట్లు అనిపిస్తుంది.  పొడి చర్మానికి తేమను అందించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఫేస్ స్క్రైబ్..

బియ్యపు పిండి చర్మం ఉపరితలం నుండి మృత కణాలను తొలగించడానికి సహాయపడుతుంది.


కావలసిన పదార్థాలు..

2 టీస్పూన్ల బియ్యం పిండి

1 టీస్పూన్ పెరుగు

1 టీస్పూన్ తేనె


ఎలా  చేయాలి?

పై పదార్థాలను అన్నీ కలిపి స్క్రబ్ మిశ్రమంగా తయారు చేయాలి.  దీన్ని 1–2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి, ఆ తర్వాత నీటితో కడగాలి. మరీ గట్టిగా రుద్దకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా  సున్నితమైన చర్మం అయితే ఈ స్క్రబ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

బియ్యం పిండి, కలబంద ఫేస్ ప్యాక్..

చర్మం నిర్జీవంగా కనిపిస్తే, బియ్యపు పిండి , కలబంద జెల్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.

ఎలా తయారు చేయాలి?

రెండు టీస్పూన్ల బియ్యపు పిండి తీసుకోవాలి. దీనికి 1-2 టీస్పూన్ల తాజా కలబంద జెల్ కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ముఖం మీద ఉంచుకుని, ఆ తర్వాత కడిగేయాలి.

బియ్యం పిండి, పాలు ఫేస్ ప్యాక్..

పాలు, బియ్యప్పిండి కలిపి మెత్తని పేస్ట్ లా చేయాలి.

ఎలా ఉపయోగించాలి?

15 నిమిషాల పాటు ముఖంపై ఉంచుకుని, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది చర్మం మృదువుగా మారడానికి సహాయపడుతుంది.

బియ్యం పిండి,  శనగపిండి ఫేస్ ప్యాక్..

శనగ పిండి ఫేస్ ప్యాక్

చర్మంపై అధిక జిడ్డు ఉన్నట్లు  అనిపిస్తే, బియ్యప్పిండి, శనగపిండి , రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు..

1 టీస్పూన్ బియ్యం పిండి,
1 టీస్పూన్ శనగపిండి
అవసరమైనంత రోజ్ వాటర్
 
ప్యాక్‌ను ఎలా అప్లై చేయాలి?

శనగపిండి, రోజ్ వాటర్,  బియ్యపు పిండిని కలిపి ముద్దలా చేయాలి.  దీనిని ముఖానికి రాసుకుని వదిలేయాలి. 10-15 నిమిషాల తర్వాత కడిగేయాలి.


స్కిన్ కేర్ లో బియ్యం వాడేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు..

ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.  చర్మంపై మంట, దురద లేదా ఎరుపు వంటివి కనిపిస్తే, వెంటనే వాడటాన్నిఆపివేయాలి.

 గాయాలు, ఇన్ఫెక్షన్లు లేదా తీవ్రమైన చర్మ సమస్యలు ఉన్నప్పుడు  ఇంటి చికిత్సలను ఉపయోగించకుండా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి.

స్క్రబ్ చేసుకొనేటప్పుడు  మరీ గట్టిగా రుద్దకూడదు.

ఇంటి చిట్కాలతో పాటు, సన్‌స్క్రీన్ కూడా వాడాలి.

                                    *రూపశ్రీ.