విడాకులు తీసుకోవడానికి సిద్దపడ్డారా..ఈ ఐదు విషయాల గురించి స్పష్టత ఉందా !


విడాకులు తీసుకోవడానికి సిద్దపడ్డారా..ఈ ఐదు విషయాల గురించి స్పష్టత ఉందా !

స్నేహితులు, బంధుమిత్రుల సమక్షంలో  ఒక్కటై జీవితాంతం కలసి ఉండాలనే ఆలోచనతో పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఇక ఇద్దరూ కలసి ఉండటం అసాధ్యమని, ఇద్దరూ ఒక చోట ఉంటే అక్కడ పెద్ద గొడవకే దారి తీస్తుందనే పరిస్థితి వచ్చాక చట్టప్రకారంగా విడాకులు తీసుకుని విడిపోతారు. ఈ మధ్యకాలంలో విడాకులు కూడా చాలా సాధారణం అయిపోయింది.  నిజానికి భార్యాభర్తలు కష్టంగా కలసి ఉండటం కంటే ఇద్దరూ మాట్లాడుకుని ఆరోగ్యకరంగానే విడిపోవడం మంచిది. దీనివల్ల కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే విడాకులు తీసుకోవడానికి సిద్దమయ్యక కొన్ని విషయాల మీద స్పష్టత అవసరం అవుతుంది. ఆ విషయాల గురించి పూర్తీగా క్లారిటీ వచ్చిందన్నాకే విడాకులు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మహిళల జీవితంలో విడాకులు పెద్ద కుదుపుకే కారణం అవుతాయి. అప్పటికే పిల్లలున్నా, కుటుంబాలు కాస్త సాంప్రదాయంగానూ, పెద్దవిగానూ అయినా చాలా ఇబ్బందులే ఎదుర్కొంటారు. అందుకే ఈ ఐదు విషయాల మీద స్పష్టత ఉండటం ఎంతో అవసరం అవుతుంది.

విడాకుల ప్రక్రియ..

విడాకులు తీసుకోవాలని  నిర్ణయించుకోవడం వేరు దాన్ని చట్టప్రకారంగా అమలు దిశగా తీసుకెళ్లడం వేరు. విడాకులు తీసుకోవాలని  నిర్ణయించుకున్నాక అనుభవజ్ఞులైన న్యాయవాదుల దగ్గరకే వెళ్లాలి. వారు విడాకుల నిర్ణయం ఎంతవరకు సరైనదో కూడా చెబుతారు. దీనివల్ల ఆవేశం మీద చీలిపోయే బంధాలు కూడా నిలబడే అవకాశం ఉంటుంది. చట్టప్రకారంగా విడాకులు తీసుకుంటే ఆ తరువాత హక్కులు, బాధ్యతలు వంటి విషయాల గురించి కూడా న్యాయవాదులు స్పష్టత ఇస్తారు.

ఆర్థిక పరిస్థితి..

భర్త సంపాదిస్తున్నాడు కదా ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటే అదే సంతోషం అనుకుని చాలామంది మహిళలు పెళ్లయ్యాక ఉద్యోగాలు మానేస్తుంటారు. దీనివల్ల విడాకుల తరువాత ఇబ్బందులు తలెత్తుతాయి. భర్త నుండి భరణం లభించినా అది నేటి ఖరీదైన జీవనానికి ఎంతవరకు సరిపోతుందో చెప్పలేం. ఇకపోతే మగవారు విడాకులు తీసుకోవాలి అనుకుంటే ముందుగా తమ ఆర్థిక పరిస్థితి గమనించుకోవాలి. తమ సంపాదనలో భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించి ముందడుగు వెయ్యాలి.

పిల్లల గురించి ఆలోచన..

చాలా కేసులలో భార్యాభర్తల గొడవల కారణంగా పిల్లలు తల్లిదండ్రుల  ప్రేమను కోల్పోతారు. తల్లిదండ్రుల విడాకుల తరువాత ఇద్దరి ప్రేమను ఉమ్మడిగా పొందే అవకాశం పిల్లలకు ఉండదు. పైపెచ్చు పిల్లలు ఎవరో ఒకరి దగ్గరున్నా, వారి సంరక్షణ విషయంలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఎదురవుతాయి. నిజానికి విడిపోయిన తల్లిదండ్రుల కారణంగా పిల్లలు కూడా సమాజం నుండి చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటి గురించి ఆలోచించాలి.

విడాకులు తీసుకోవడం అంత ఈజీ కాదు..

సినిమాల్లోనూ, సీరియళ్లలోనూ చూపించినంత ఈజీగా విడాకుల వ్యవహారం ముగిసిపోదు. దానికి చాలా పెద్ద తతంగమే నడుస్తుంది. విడాకుల గోల నడుస్తుండగానే ఆ ఒత్తిడి భరించలేక చాలా సార్లు డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఎదురుకావచ్చు. అందుకే విడాకుల విషయం పూర్తీగా స్పష్టత వచ్చాకనే ముందుకు వెళ్లాలి. ఆ తరువాత కూడా కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలుస్తూ గతం తాలూకు విషయాలు చాలా వరకు అధిగమించాలి.

భాగస్వామ్యం అవసరం..

విడాకులు కావాలంటే ఓ లాయర్ ను నియమించుకోవాలి. కేవలం లాయర్ ను నియమించుకుంటేనే కాదు.. విడాకులకు గల కారణాలను ఆధారాలతో సహా కోర్టు వారి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కోర్టు అడిగే ప్రతి విషయంలో చురుగ్గా స్పందించాలి. విడాకుల చట్టంలో నియమాలు, సందేహాలు తప్పని సరిగా తెలుసుకోవాలి. లీగల్ ప్రోసీడింగ్ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా భవిష్యత్తు గురించి ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి.

                                                 *నిశ్శబ్ద.