బి.పి. తగ్గాలా? ఇదిగో చిట్కా!

బి.పి. తగ్గాలా? ఇదిగో చిట్కా!

 


రక్తపోటు కంట్రోల్లో లేకపోతే ఎన్నోరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. శారీరక వ్యాయామంతోపాటు, టైమ్‌కి మందులు వేసుకోవడం, ప్రశాంతంగా వుండటం, రక్తపోటుని అందుపులో వుంచే మార్గాలు. అయితే మానసిక ప్రశాంతతకి మెడిటేషన్, యోగా వంటివే కాక సముద్రపు అలల సవ్వడి వినడం కూడా సహాయపడుతుందని ఈమధ్య ఒక అధ్యయనంలో తేలింది.

సముద్రపు అలలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ చేసే అటజడి, అవి చేసే సవ్వడి వినడానికి ఎంతో హాయిగా వుంటుంది. ఆ శబ్దం వింటుంటే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఇది సముద్రం దగ్గర అలవాటుగా సమయాన్ని గడిపే అందరికీ అనుభవమే. అయితే ఇలా సముద్ర అలల సవ్వడి వినేవారిలో రక్తపోటు తగ్గడం శాస్త్రవేత్తలు గమనించారు. వారానికి ఓ మూడుసార్లయినా ఓ పావుగంట సముద్రపు ఒడ్డున కూర్చుని ఆ అలల సవ్వడి వింటేచాలు.. నెమ్మదిగా రక్తపోటు అదుపులోకి వచ్చేస్తుందట.

మరి దగ్గరలో సముద్రం లేకపోతే ఎలా?  నిపుణులు దీనికీ పరిష్కారం చెబుతున్నారు. ఆ అలల సవ్వడిని రికార్డు చేసి విన్నా చాలుట. రోజూ ఓ పావుగంట ఈ సముద్రపు అలల సవ్వడిని వింటూ వుంటే చాలు రక్తపోటు తగ్గడం ఖాయం అంటున్నారు ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ వారు. అలల శబ్దాలు మెదడులోని ఆల్ఫా తరంగాల్ని నియంత్రిస్తాయని, దానివల్ల నిశ్శబ్ద వాతావరణం ఏర్పడి, ఏకాగ్రత కుదురుతుందని చెబుతున్నారు ఆ పరిశోధకులు.

చిన్న చిట్కా పెద్ద అనారోగ్యాల నుంచి కాపాడుతుందంటే పాటించకుండా వుంటామా చెప్పండి.. అర్జెంటుగా ఇంటర్నెట్లోంచి ఆ అలల సవ్వడులను డౌన్‌లోడ్ చేసేయండి మరి..
       
                     

   - రమ