పట్టుచీరలు ఐరన్ చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి!
posted on Feb 5, 2024
పట్టుచీరలు ఐరన్ చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి!
భారతీయ సాంప్రదాయానికి మెరుగులు దిద్దేవి పట్టుచీరలు. పట్టుచీరలలో అమ్మాయిలు ముస్తాబైతే వారిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. నిజానికి భారతీయత అంతా పట్టుచీరలలోనే తిష్ట వేసుకుందేమో అనిపిస్తుంది. ఇకపోతే ప్రతి మహిళ దగ్గరా పట్టుచీరలు ఉండటం కామన్. పండుగ, శుభకార్యాల సమయాలలో సందర్బానుసారంగా పట్టుచీరలు కట్టి పండుగకు మరింత అందం తెస్తారు. అయితే పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం లుక్ రెట్టింపు అవుతుంది. దుస్తులు కూడా సురక్షితంగా ఉంటాయి. ఇంతకీ పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
ముందు జాగ్రత్త..
పట్టుచీరలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే దానికి చెయ్యాల్సిన మొదటి పని కొనుగోలు చేసేటప్పుడే ఆ చీరలను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం తెలుసుకోవడం. ఒకవేళ పెద్ద షాప్స్ లో కొంటూ ఉంటే ఆ పట్టు రకం, దాని ఖరీదు మొదలైనవాటితో పాటూ సదరు చీరను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం కూడా అందులో పొందుపరిచి ఉంటారు. అవి చూసుకోవాలి.
కవరింగ్..
పట్టుచీరలను ఎప్పుడూ నేరుగా ఐరన్ చెయ్యకూడదు. పట్టుచీర మీద ఐరన్ బాక్స్ నేరుగా పెట్టకూడదు. దానిబదులు మొదట చీరను జాగ్రత్తగా ఒక పెద్ద టేబుల్ మీద ఉంచి, చీర మీద కాటన్ క్లాత్ లేదా కాటన్ టవల్ వంటివి ఉంచాలి.పైన క్లాత్ ఐరన్ చేస్తుంటే కింద చీర ఐరన్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేస్తే చీర దారప్పోగులు, రంగు దెబ్బతినవు.
సెట్ చేయాలి..
ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసేటప్పుడు ప్రతి ఫ్యాబ్రిక్ కు తగినట్టు టెంపరేచర్ సెట్ చేసే సౌకర్యం ఉంటుంది. దాన్ని అనుసరించి పట్టుచీరల కోసం సిల్క్ సెట్టింగ్ చేయాలి. ఇలా చేస్తే పట్టుబట్టలకు తగినంత మాత్రమే ఉష్ణోగ్రత ప్రసారం అవుతుంది.
మొదలు ఇక్కడే..
పట్టుచీరలను మొదట అంచు నుండి ఐరన్ మొదలుపెట్టాలి. తరువాత చీరల మధ్యలో ఐరన్ చెయ్యాలి. ఇలా చేస్తే ముడతలు ఉండవు. కానీ చీరలు పాడవకుండా ఉండాలన్నా, ఏమాత్రం నష్టం జరగకూడదు అన్నా ఐరన్ బాక్స్ ను చీరమీద ఒకేచోట ఎక్కువ సేపు ఉంచకూడదు.
ఫైనల్ స్టెప్ మిస్టేక్..
చీరలు ఐరన్ చేశాక జాగ్రత్తగా మడతేసి బీరువాలో పెట్టడం మగువలకు అలవాటు. అలా కాకుండా ఐరన్ చేసిన చీరలను హ్యాంగర్ కు పెట్టి దాన్ని వార్డ్ రోబ్ లో వేలాడదీయాలి. కవర్లలో పెట్టడం ఇరుకైన డ్రాయర్లలో పెట్టడం చెయ్యకూడదు.
*నిశ్శబ్ద.