వేసవి చెమట కారణంగా జుట్టు జిగటగా అనిపిస్తోందా? ఈ చిట్కాలు ఫాలో అయి చూడండి!
posted on Apr 30, 2024
వేసవి చెమట కారణంగా జుట్టు జిగటగా అనిపిస్తోందా? ఈ చిట్కాలు ఫాలో అయి చూడండి!
సమ్మర్ సీజన్‌లో ఎన్ని అందమైన టాప్స్, కుర్తాలు, డ్రెస్సులు వేసుకున్నా జుట్టు తలకు అతుక్కుపోయి విపరీతంగా జిడ్డుగా ఉంటే లుక్ మొత్తం చెడిపోతుంది. భరించలేని ఎండ, దాన్నుండి పుట్టే చెమట జుట్టు మెరుపును చాలా వేగంగా తగ్గించేస్తాయి. ఈ సమస్య తగ్గించుకోవాలి అంటే జుట్టు సంరక్షణ చిట్కాలు తప్పకుండా పాటించాలి. చెమట కారణంగా జుట్టు జిగటగా మారుతూ ఉంటే దాన్నుండి జుట్టును రక్షించుకోవడానికి ఈ కింది చిట్కాలు పాటించాలి..
హీటింగ్ టూల్స్ వద్దు..
హెయిర్ స్టైల్ చేయడానికి హీటింగ్ టూల్స్ ఉపయోగిస్తుంటారు. కానీ సమ్మర్ సీజన్‌లో హీటింగ్ టూల్స్ వాడటం వల్ల హెయిర్ డ్యామేజ్ పెరిగి, జుట్టు ఫ్రీగా ఉండటానికి బదులుగా తలపై అతుక్కున్నట్టు అనిపిస్తుంది. తలలో పుట్టే చెమట దీనికి ప్రధాన కారణం అవుతుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. జుట్టులో ఉండే తేమను హీటింగ్ టూల్స్ లాగేస్తాయి. ఈ కారణంగా జుట్టు నిర్జీవంగా మారి చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది.
గుడ్డు వాడాలి..
వారానికి ఒకసారి జుట్టుకు గుడ్డు హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు జిగట నుండి ఉపశమనం లభిస్తుంది. గుడ్డు జుట్టుకు హైడ్రేషన్ ఇస్తుంది. గుడ్డులో పెరుగు కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు. అంతే కాకుండా పెరుగు, తేనె కలిపి జుట్టుకు రాసుకోవచ్చు.
నూనె రాయాలి..
పగటిపూట జుట్టుకు నూనె రాసినట్లయితే తల జిగటగా కనిపిస్తుంది. వేసవిలో చెమట అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ చెమటతో పాటు నూనె కూడా తల మీద నుండి ప్రవహిస్తుంది. అందుకే ఉదయానికి బదులు రాత్రి సమయంలో తలకు నూనె రాసుకోవాలి. నూనెను రాత్రిపూట తలకు పట్టించి మసాజ్ చేసి మరుసటి రోజు జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా, ఫ్రీగా ఉంటుంది.
కండీషనర్..
చాలా మంది మహిళలకు కండీషనర్‌ని ఉపయోగించడం సరిగ్గా తెలియదు. దీని కారణంగా కండీషనర్ రాసినా సరే.. జుట్టు జిగటగా కనిపిస్తుంది. షాంపూతో జుట్టును శుభ్రం చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించాలి. కండీషనర్ జుట్టు పొడవునా అప్లై చేయాలి. కానీ చాలామంది కేవలం తలపై మాత్రమే రాస్తుంటారు. కండీషనర్‌ను తలపై లేదా స్కాల్ప్‌పై రాసుకుంటే జుట్టు జిడ్డుగా మారుతుంది, బరువుగా కనిపిస్తుంది. అదనంగా ఇది తలపై జిడ్డు ఏర్పడటానికి కారణమవుతుంది.
డ్రై షాంపూ..
ఎంత వేడిగా ఉన్నా ప్రతి రోజూ తలస్నానం చెయ్యాలంటే ఇబ్బందే. హెయిర్ ఫాల్ పెరుగుతుందని చాలా భయం. అందుకే ప్రతిరోజు జుట్టును నీటితో కడగకుండా డ్రై షాంపూను జుట్టు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. జుట్టు జిగటగా కనిపించినప్పుడు డ్రై షాంపూని అప్లై చేసిన తర్వాత జుట్టులో వెంటనే బౌన్స్ కనిపిస్తుంది. జుట్టు పొడిగా, ఫ్రీగా ఉంటుంది.
*రూపశ్రీ.