తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాల్సింది ఏంటి?
posted on Sep 12, 2024
తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాల్సింది ఏంటి?
"చిన్నపిల్లల ప్రపంచం చాలా చిన్నది. వాళ్ళ చిన్న ప్రపంచం వారికి ఎంతో ఆనందమైనది, అద్భుతమైంది. తల్లితండ్రులు పిల్లల ప్రపంచంలో అడుగు పెట్టి వారి అనుభూతులను పంచుకొని వారిలో ఒకరిలా కలిసిపోవాలి. అలా పిల్లలను మెల్లమెల్లగా వారి చిన్న ప్రపంచం నుండి మన ప్రపంచంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి" అంటారు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్.
ప్రతీ తల్లితండ్రి తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆశించడం సహజం. కానీ పిల్లల శక్తి సామర్థ్యాలను అంచనా వేయకుండా ఆశల ఒరవడిలో కొట్టుకుపోయి వారిని ఒత్తిడికి గురిచేయడం సమంజసం కాదు. సాధారణంగా తల్లితండ్రుల్లో మూడు రకాల మనస్తత్వాలవారు ఉంటారు. మొదటి కోవకు చెందినవారు - మనం ఎలాగూ కష్టపడ్డాం కదా! పిల్లలైనా సుఖంగా ఉండాలని వారు అడిగినవన్నీ సమకూర్చే తల్లితండ్రులు.
రెండవ కోవకు చెందినవారు తాము ఎంతో క్రమశిక్షణతో పెరిగామని భావించి, పిల్లల పట్ల క్రమశిక్షణ పేరుతో కఠినమైన ఆంక్షల్ని విధించే తల్లితండ్రులు. ఇలా ఒకరు 'అతివృష్టి'కి మరొకరు 'అనావృష్టికి' తార్కాణాలుగా నిలిచే రెండు రకాల మనస్తత్వాలు గల తల్లితండ్రులు.
ఇక మూడవ కోవకు చెందిన తల్లితండ్రులు - తమ పిల్లలు వారిలాగే మూస పోసినట్లుగా ఉండాలని ఆశించే తల్లితండ్రులు. ఈ కోవకు చెందినవారు చాలా ప్రమాదకరమైనవారు, అత్యాశాపరులు అని చెప్పవచ్చు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన
తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ తెలివైన విద్యార్థి గణితంలో ఎప్పుడూ 90 మార్కులకు పైనే సాధించేవాడు. కానీ హఠాత్తుగా ఆ విద్యార్థికి గణితంలో 0 మార్కులు వచ్చాయి. అందుకు కారణం విచారించగా ఆ విద్యార్థి తల్లి 'నీకు గణితంలో నూటికి నూరు మార్కులు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను' అని బెదిరించిందని తెలిసింది. దానితో ఒత్తిడికి గురైన ఆ విద్యార్థి పరీక్షలు రాయలేకపోయాడు. ఆ విద్యార్థి తల్లి గణిత శాస్త్రంలో స్వర్ణపతకం సాధించిన మేధావి. తనలాగే తన కుమారుడు కూడా గణితంలో స్వర్ణపతకం సాధించాలనే ఆమె అత్యాశ ఆ విద్యార్థి మతిస్థిమితం కోల్పోయే స్థితికి దిగజార్చింది.
తల్లితండ్రులు అతివృష్టి, అనావృష్టి, అత్యాశ - ఈ 'అ'త్రయం బారిన పడకుండా పరిపక్వతతో వ్యవహరించాలి. అందుకు ఈ సూచనలను పాటించండి.
1. పిల్లలను ఇతరులతో పోల్చకుండా ఉండడం.
2. పిల్లల తెలివితేటలను అంచనావేయడం.
3. పిల్లల అభిరుచులను అవగాహన చేసుకోవడం.
4. ఇంట్లో చదువుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం.
5. పిల్లలతో సన్నిహితంగా స్నేహితునిలా మెలగడం.
6. పిల్లల్లో ఒత్తిడి పారద్రోలే ఓదార్పును ఇవ్వడం.
7. అసహనాన్ని చూపకుండా వారు చెప్పిన విషయాన్ని వినడం.
8. పిల్లలను అవమానించకుండా వారిని అభినందించడం.
9. పిల్లల్లో అభద్రతాభావం కలగకుండా శ్రద్ధ వహించడం.
10. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే సంఘటనలను వివరించడం.
మూడు స్థాయిల్లో ఉన్న విద్యార్థులకు మనం అందించాల్సిన విషయాలు వేరుగా ఉంటాయి. విద్యార్థుల స్థాయిని బట్టి కొన్ని అవసరం, మరికొన్ని అనవసరం అవుతాయి..
తెలివైన విద్యార్థి కి మార్గదర్శకత్వం అందిస్తే చాలు..
సాధారణ విద్యార్థి కి మార్గదర్శకత్వంతో పాటు ఆప్యాయత కూడా అవసరం అవుతుంది.
అతిసాధారణ విద్యార్థి: మార్గదర్శకత్వం, ఆప్యాయతతో పాటు నువ్వు సాధించగలవు అనే ఆత్మవిశ్వాసం అందించాలి.
ఈ సూచనల్ని పాటించిననాడు 'I have found the hap- piness of parenthood greater than any other that I have experienced. - పిల్లల పెంపకంలో ఉన్న మాధుర్యం కన్నా మించినది మరొకటి లేదు' అన్న బెర్ట్రాండ్ రస్సెల్ అనుభవం నిజమవుతుంది. ఆ ఆనందానుభూతితో పిల్లల్ని ఆదరించి, వారి శక్తిసామర్థ్యాలను అర్థం చేసుకున్ననాడు వారిని ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు.
◆నిశ్శబ్ద.