చాక్లెట్ తినడం వల్ల మహిళల పీరియడ్ పెయిన్ తగ్గుతుందా.. అసలు నిజమేంటంటే!

చాక్లెట్ తినడం వల్ల మహిళల పీరియడ్ పెయిన్ తగ్గుతుందా.. అసలు నిజమేంటంటే!

ఒక వయసు వచ్చాక ప్రతి ఆడపిల్లకు, మహిళకు నెలసరి రావడం చాలా సహజం. ఇది ప్రకృతి సిద్దంగా జరిగిపోయే చర్య. అయితే మహిళల నెలసరిలో చాలా మంది కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం  నడుము నొప్పి,  తలనొప్పి  వంటి సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు.  అయితే చాలా మంది మహిళలు తమ పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తినడానికి ఇష్టపడతారు.  చాక్లెట్ తినడం వల్ల నెలసరి  నెప్పి తగ్గుతుందని అంటుంటారు. ఇందులో నిజమెంత అనేది చాలామందికి తెలియదు.  అసలు పీరియడ్స్ టైంలో చాక్లెట్ తినడం వల్ల పీరియడ్స్ పెయిన్ నిజంగా తగ్గుతుందా? దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

పీరియడ్స్ సమయంలో చాక్లెట్..

పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తినడం చాలామందికి మంచి ఉపశమనంలా అనిపిస్తుంది. ఎందుకంటే చాక్లెట్ లో మెగ్నీషియం ఉంటుంది. ఇది గర్భాశయ కండరాలను సడలించడానికి సహాయపడుతుంది.

చాక్లెట్ తినడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.  ఇవి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే పీరియడ్స్ సమయంలో చాక్లెట్ తింటే నెలసరి నొప్పి నుండి కాస్త ఉపశమనం గా అనిపిస్తుంది.

చాక్లెట్ తినడం వల్ల సెరటోనిన్ పెరుగుతుంది.  సెరోటోనిన్ అనేది హ్యాపీ హార్మోన్..  చాక్లెట్ తిన్నప్పుడు ఈ హ్యాపీ హార్మోన్ అనేది పెరగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్,  చిరాకు,  అలసట, నీరసం వంటివి తగ్గుతాయి.  పీరియడ్స్ సమయంలో కూడా శరీరం చురుగ్గా ఉంటుంది.

డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి, ఇవి నొప్పిని తగ్గించడంలో  కాస్త సహాయపడతాయి.

ఏ చాక్లెట్ తినడం మంచిది?

70% లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్   తినడం మంచిది.  ఎక్కువ చక్కెర ఉన్న మిల్క్ చాక్లెట్‌లో కోకో తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయోజనం కూడా తక్కువగా ఉండొచ్చు. అధికంగా చాక్లెట్ తింటే చక్కెర, కేలరీలు ఎక్కువగా తీసుకున్నట్లవుతుంది. ఇది బరువు పెరగడానికి,  డయాబెటిస్ రావడానికి కూడా కారణం అవుతుంది.

ఎంత మోతాదులో తినాలి?

రోజుకు సుమారు 20–30 గ్రాముల డార్క్ చాక్లెట్ చాలామందికి సరిపోతుంది. దీన్ని సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. దీని కంటే ఎక్కువ చాక్లెట్ తినకూడదు.

                              *రూపశ్రీ.