ఈ చీరలతో పెట్టుకుంటే ఫ్యాషన్ షేక్ అయిపోద్ది!
posted on Dec 5, 2022
ఈ చీరలతో పెట్టుకుంటే ఫ్యాషన్ షేక్ అయిపోద్ది!
ఫ్యాషన్ కి కేరాఫ్ అడ్రస్ అమ్మాయిలే. ముఖానికి పెట్టుకునే బొట్టు బిళ్ళ నుండి వేసుకునే చెప్పుల వరకు దేంట్లోనూ తగ్గం అనేలా ఉంటాయి మహిళల ఫ్యాషన్ తీరూ తెన్నులు. అయితే ఈ ఫ్యాషన్ లో కూడా దుస్తులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అదిరేటి డ్రెస్సు మెవేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ ఆ మీకూ… దడ… అనే పాటే గుర్తొస్తుంది మహిళల ఫ్యాషన్ చూసినప్పుడు. అయితే ఈ దుస్తులలో కూడా మహిళలకు ఎన్ని రకాలు వచ్చినా చీర కట్టులో ఉన్నంత అందం, హుందాతనం మరెందులోనూ ఉండదు అంటే నమ్మండి.
అయితే చీరకట్టు పాత టేస్టు అవన్నీ ఎలాగబ్బా?? వంటి ఫీలింగ్ లో ఉన్నవాళ్లు ఒకటి తెలుసుకోవాలి. మన తెలుగువైపు మాత్రమే కాదు బాలీవుడ్ లో అదిరిపోయే అందాల భామలు అయిన దీపికా పదుకొనె నుండి కియారా అద్వానీ వరకు ఎంతోమంది చీరకట్టును ఎంచుకుని వహ్వా అనిపిస్తున్నారు. బోలెడు రకాల డిజైన్లలో అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసే చీరల్లో ఆరు అద్భుతమైన శారీస్ మీకోసం…
ఈ చీరకట్టులు సాంప్రదాయంగానూ.. ఫాషన్ తోనూ జతకలిసి భలే అనిపిస్తాయ్.
రఫ్లడ్ శారీ…
ఈ రకమైన చీర సన్నని మడతలు కలిగి కాస్త రఫ్ గా కనిపిస్తుంది. కొద్దిపాటి మందం కూడా కలిగి ఉంటుంది. ఫాబ్రిక్ విషయంలో ఇది మందంగా, మృదువుగా ఉన్నా దీనికి ఉన్న చిన్న మడతల వల్ల రఫ్ గా అనిపిస్తుంది. పింక్ కలర్ నుండి లావెండర్ వరకు లేత రంగులు ఈ చీరలకు అద్భుతమైన లుక్ ఇస్తాయి. ఈ చలికాలంలో జరిగే పార్టీలు, ఫంక్షన్ లకు ఈ చీరలు మంచి ఫ్యాషన్ లుక్ ఇవ్వడంతో పాటు వెచ్చదనాన్ని కూడా ఇస్తాయి.
బెల్ట్ శారీస్..
బెల్ట్ శారీస్ ఇప్పట్లో చెప్పలేనంత ఫ్యాషన్. సాధారణ చీరలు తగినట్టుగా మంచి బెల్ట్ ఎంపిక చేసి వాటిని శారీ లుక్ కు జతచేస్తే బెల్ట్ శారీ రెడి అయినట్టే. క్లాసిక్ లుక్ ఇచ్చే ఈ బెల్ట్ శారీ ఫ్యాషన్ వీక్స్ నుండి పార్టీ ల వరకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. పైపెచ్చు ఈ డ్రెస్సింగ్ స్టయిల్ లో వెళితే అందరినీ డామినేషన్ చేసేట్టు ఉంటుంది. అట్రాక్ట్ చేస్తుంది.
మిర్రర్ వర్క్ శారీస్..
మిర్రర్ వర్క్ అనేది కేవలం ఒక ఫాబ్రిక్ కు మాత్రమే సెట్ అయ్యే అంశం కాదు. కాటన్ నుండి, షిఫాన్, సిల్క్ వంటి ఫాబ్రిక్ లకు కూడా బెస్ట్ గా నప్పుతుంది. పైగా ఈ మిర్రర్ వర్క్ కోసం ఉపయోగించే దారాలు కూడా గోల్డ్, సిల్వర్ ఇతర రంగులతో చాలా ఆకర్షణగా ఉంటాయి. ట్రెడిషల్ నుండి పార్టీస్ వరకు ప్రతి ఈవెంట్ లో అట్రాక్షన్ గా ఈ రకమైన డిజైన్ కలిగిన శారీస్ ఆకర్షణగా నిలుస్తాయి. చూపు తిప్పుకొనివ్వని చీరల మెరుపులతో పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ గా మీరు నిలవడం ఖాయం.
సీక్వెన్ శారీస్..
ఈ రకమైన శారీస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాయని చెప్పడంలో సందేహమే లేదు. కాకపోతే వీటిని ధరించినప్పుడు వీటికి జతగా ధరించే జ్యువెలరీ, మేకప్ మొదలైనవి దీని అట్రాక్షన్ ను పెంచేలా వేసుకుంటే దీనికి మించినది ఇంకేది ఉండదు. అదే నప్పని జ్యువెలరీ, మేకప్ వేసుకుంటే మాత్రం దీనికి ఉన్న లుక్ మొత్తం పాడు చేసి పడేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే క్వీన్ తరహా లుక్ సొంతం చేసుకోవచ్చు.
కేప్ శారీస్
ట్రెడిషనల్ శారీస్ కి కూడా ఫ్యాషన్ లుక్ ఇవ్వడం కేప్ డిజైన్లకు ఉన్న ప్రత్యేకత. ఇవి చీరలకు మెరుపును తీసుకొస్తాయ్. దీని వల్ల చీరలు ఎంతో ఆకర్షణగా కనబడతాయి. ఈ చీరలకు తగ్గట్టు బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే అదిరిపోయే లుక్ సొంతమవుతుంది.
చికంకారి శారీస్..
సాధారణ శారీస్ ను కూడా స్పెషల్ గా చూపెట్టడం ఈ చికంకారి వర్క్ ప్రత్యేకత. దీనికోసం ఉపయోగించే డిజైన్లు చాలా విలక్షణంగా ఉంటాయి. తెలుపు నుండి నలుపు వరకు పాస్టెల్ కలర్ నుండి విభిన్న రంగుల వరకు ఇవి విభిన్నతను కలిగి ఉంటాయి. వీటికి ఉపయోగించే ఎంబ్రాయిండరి టెక్నిక్ షాడో డిజైన్ అని పిలవబడుతుంది. ఇది చాలా సున్నితంగా ఉంటుంది. జార్జిట్, షిఫాన్, కాటన్ సహా ఇంకా చాలా ఫాబ్రిక్ మీద ఈ రకమైన చీరలు అద్భుతమైన లుక్ సంతరించుకుంటాయి.
ఇవండీ అదిరిపోయే ఆరు రకాల చీరలు. ఇవన్నీ మార్కెట్ లలో లభ్యమయ్యేవే.. మీకు కాసింత ఫ్యాషన్ మీద అవగాహన ఉంటే రంగులు, బ్లౌజ్ ల డిజైన్ లలో వైవిధ్యం చూపిస్తే ఇంకా ఎక్కువ అట్రాక్షన్ తీసుకురావచ్చు. చీరకట్టులో కూడా సూపర్ అనిపించేలా రెడి అవ్వడమొక్కటే మీ వంతు ఇక..
◆నిశ్శబ్ద.