సూర్య నమస్కారాలు - 2

 

సూర్య నమస్కారాలు

 

ఆసనాలు: 

1. ప్రణామాసనం

                       నిటారుగా ప్రార్థనా భంగిమలో నిలుచుని ఉండాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసలను ( inhale – exhale) చేయాలి.

' ఓం మిత్రాయ నమః ' అందరికీ మిత్రుడనైన నీకు అంజలి ఘటిస్తున్నాము అనే అర్థం వచ్చే ఈ మంత్రాన్ని పఠించాలి .

 

ప్రయోజనాలు :

ఈ ఆసనం చేస్తూ మనస్సును నిశ్చలంగా ఉంచడం వల్ల, మనస్సును హృదయం పై కేంద్రీకరించి ఉండటం వల్ల మనస్సు సూర్యాభివందనం చేయడానికి అనువుగా మారుతుంది.

2.హస్త ఉత్థానాసనం

శ్వాస లోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపుకు వెనుకకు వంచాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులైతే కొద్దిగాను, చాలాకాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగాను ఊపిరి పీల్చుకోవాలి.  ' ఓం రవయే నమః' ప్రకాశవంతుడైన ప్రకాశదాతవైన నీకివే వందనాలు దేవా! అనే అర్థాన్నిచ్చే ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి.

ప్రయోజనాలు :

వెన్నెముకకు శక్తి ఇవ్వడం , దాని రుగ్మతలను నిరోధించేది గాను ఈ ఆసనం పని చేస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేయడం వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది. ఛాతీని విరిచినట్లుగా వెడల్పుగా చేయడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది. అంతేకాక థైమస్, థైరాయిడ్ వంటి గ్రంథులపై బాగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం, మెటబాలిజం మెరుగుపరిచి, సారా థైరాయిడ్ చురుకుగా పనిచేస్తుంది.

3. పాదహస్తాసనం

శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్ళను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలి. ' ఓం సూర్యాయ నమః ' సకల ప్రాణుల పుట్టుకకు కారణమైన పరమాత్మ అనే భావాన్నిచ్చే ఈ మంత్రాన్ని జపించాలి.

జాగ్రత్తలు:

మెడ కింద వైపు వేలాడేలాగా ఉంచాలి. పైకి చూడకూడదు . అలా కానిచో మెడ పట్టేసే ప్రమాదముంది .

ప్రయోజనాలు:

ఈ ఆసనం వల్ల ఉదరం పై ఒత్తిడి పడిన కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది . మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది , కొవ్వుని తొలగించి శరీరం నాజూకుగా మారడానికి ఈ ఆసనం సహకరిస్తుంది.

4.అశ్వ సంచలనాసనం

లోనికి శ్వాసిస్తూ కుడిపాదం వెనుక వైపునకు కదిలించాలి. అదే సమయంలో శరీరాన్ని కిందకు వంచుతూ చేతులను నేలమీదకు వంచాలి. కుడి మోకాలుని కూడా అదే సమయంలో వెనుకకు వంచాలి. తల ఎత్తి ఇంటి కప్పులపైకి చూడాలి. నేలపై రెండు చేతులను ఉంచాలి. ఈ భంగిమలో శరీరం అర్థ చంద్రాకృతిని కలిగి ఉంటుంది. ' ఓం భానవే నమః ' అజ్ఞానాన్ని తొలగించే గురువుకు వందనం ' అనే అర్థాన్నిచ్చే మంత్రం పఠించాలి.

జాగ్రత్తలు :

ప్రారంభ దశలో ఎక్కువమంది సాధకులు మోకాలిని వెనుకకు వంచడాన్ని మరిచిపోతారు. శరీరమంతా సక్రమమైన భంగిమలో ఉన్నదా లేదా అన అంశాన్ని గమనించాలి. చాలామంది పైకి చూడటం మరిచిపోతారు . తప్పనిసరిగా తలను పైకెత్తి చూడాలి. థైరాయిడ్ గ్రంథి చర్య క్రమబద్ధం చేసేందుకు ఈ భంగిమ కీలకమైన పాత్రను కలిగి ఉంది.

ప్రయోజనాలు:

శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, ఎడ్రినల్, మరియు యురోజెనిటల్ గ్రంథులు వంటివి ఉత్తేజితమవుతాయి . శ్వాస సంబంధమైన ' సైనస్' సమస్యను అధిగమించడం, సంతాన సాఫల్యం , శ్వాసక్రియ మెరుగుపడటం - ఈ ప్రక్రియ వల్ల కలిగే ప్రయోజనాలు. .

సూర్య నమస్కారాల్లోని మిగిలిన ఆసనాలు మూడవభాగంలో ..