కోల్డ్ తో బాధ పడుతున్నారా ?
posted on Jan 19, 2023
కోల్డ్ తో బాధ పడుతున్నారా ?
కోల్డ్ అనేది సర్వ సాధారణమైన లక్షణం. ఇది పెద్ద జబ్బేం కాదు, అయితేనేం పట్టిందంటే పీడిస్తుంది. తెగ సతాయిస్తుంది. జలుబు చేసేది ముక్కుకే అయినా ముఖమంతా ఏదో పాకుతున్నట్టు యమా చేరాకేస్తుంది. కోల్డ్ వల్ల శరీరమంతా అలసిపోయినట్టు అవుతుంది. మనసు స్థిమితంగా ఉండదు. తిండి తినాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు. నిద్ర పట్టడం కష్టమౌతుంది. ఇంత ఇబ్బంది పెట్టే కోల్డ్ గురించి ఓ నానుడి ఉంది. దీనికి మందు వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది, వాడితే వారంలో తగ్గుతుంది- అని. అంటే కోల్డ్ కు ఔషధం వేసుకున్నా లాభం లేదనేది తాత్పర్యం.
అనేకమంది అనుభవాలు ఆ మాట నిజమే అనిపించేలా చేశాయి. అలాగని మెడిసిన్లు వేసుకోకుండా కోల్డ్ ను ముదరబెట్టుకుంటే ఆనక బాధపడక తప్పదు. దీర్ఘకాలంపాటు జలుబు కనుక తగ్గకపోతే, అది న్యుమోనియాకు దారితీస్తుంది. పూర్వకాలం సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు కోల్డ్ కు చాలానే మందులున్నాయి. మందుల సంగతి అలా ఉంచితే అనేక గృహ చిట్కాలు కూడా ఉన్నాయి. పసుపు, పటిక బెల్లములను సమంగా తీసుకుని నిప్పుల మీద వేసి ఆ పొగను పీల్చినట్లైతే పడిశం సమస్య నివారణ అవుతుంది. మిరియాలను నూరి, బెల్లంతో కలిపి ముద్దగా చేసి తింటే కోల్డ్ తగ్గుతుంది. ఒకవేళ అది మరీ ఘాటుగా ఉంటుంది, తినలేము అనుకుంటే వేడి పాలలో మిరియాల పొడి వేసుకుని తాగినా ఫలితం ఉంటుంది. గులాబీ రేకలను నువ్వుల నూనెలో మరిగించి , దించి వడపోసి నిలువ చేసుకోవడం ఇంకో పధ్ధతి. ఈ గులాబీ తైలాన్ని రెండు పూటలా రెండు చుక్కలు ముక్కులో వేస్తే, జలుబు తగ్గుతుంది. తుమ్ములు కూడా అరికడతాయి.
కొందరికి డస్ట్ ఎలర్జీల్లాంటివి ఉంటాయి. పిండి, కారం లాంటివి జల్లించినా, కాస్త అటక దులిపినా వెంటనే ఎలర్జీ బయటపడిపోతుంది. ఆఖరికి సాంబ్రాణి పొగ కూడా పడనివారు ఉంటారు. అలాగే కొందరికి ఎండలో తిరిగితే వెంటనే ఎలర్జీ వస్తుంది. మరి కొందరికి కొన్ని వాసనలు సరిపడవు. ఇంకొందరికి కొన్ని పదార్ధాలు తింటే ఎలర్జీ వస్తుంది. వీళ్ళందరికీ దాదాపుగా కోల్డ్ మొదటి లక్షణంగా ఉంటుంది. కనుక ఏది సరిపడటంలేదో, దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
ముక్కు అంటూ ఉన్నాక జలుబు చేయకుండా ఉండదు. కానీ చీటికిమాటికి కోల్డ్ వస్తుంటే ఆలోచించాల్సిందే. డాక్టర్ను సంప్రదించాలి. రెసిస్టేన్స్ పవర్ తగ్గితే కూడా త్వరగా కోల్డ్ చేస్తుందని గ్రహించాలి. మొత్తానికి ఎక్కువకాలం పాటు రొంప వదలకుండా బాధిస్తుంటే, లోపల ఏదో అనారోగ్యం పొంచి ఉందని గ్రహించి తగిన శ్రద్ధ తీసుకోవాలి.