మహిళలలో PCOS, PCOD సమస్యలు తగ్గించే మూలికలు ఇవి..!
posted on Jul 18, 2024
మహిళలలో PCOS, PCOD సమస్యలు తగ్గించే మూలికలు ఇవి..!
ఈ రోజుల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PCOD లేదా PCOS) మహిళల్లో అత్యంత సాధారణ సమస్యగా మారింది. అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కారణంగా PCOD, PCOS సమస్యలు పెరగుతున్నాయి. ఇది కాకుండా మహిళల్లో అనేక హార్మోన్ల మార్పులు కూడా కారణమవుతాయి. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్య గర్భధారణ సమయంలో మహిళల్లో కనిపిస్తుంది. 16 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. చాలా సార్లు ఈ వ్యాధి గురించి మహిళలకు కూడా తెలియదు. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అండాశయాలలో గడ్డలు ఏర్పడతాయి. వీటిని సిస్ట్ అని పిలుస్తాము. ఇవి ఉంటే గర్భం నేరుగా ప్రభావితమవుతుంది. అయితే జీవనశైలిని మార్చుకోవడం, కొన్ని మందుల ద్వారా దీనిని నియంత్రించవచ్చు. అలాగే కొన్ని రకాల మూలికలు తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలు తగ్గుతాయి.
తిప్పతీగ..
ఈ మధ్యకాలంలో తిప్పతీగ మొక్క చాలా వైరల్ అవుతోంది. ఆయుర్వేదంలో తిప్పతీగ చాలా ప్రభావవంతమైన మూలికగా పరిగణించబడుతుంది. తిప్పతీగ తీసుకోవడం PCOSని నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో ఎక్కువ ఆండ్రోజెన్ ఉత్పత్తి అయినప్పుడు మగ హార్మోన్లు పెరగడం ప్రారంభిస్తాయి. అలాంటి పరిస్థితిలో ఈ హార్మోన్లను సమతుల్యం చేయడంలో తిప్పతీగ సహాయపడుతుంది.
దాల్చినచెక్క..
శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగకుండా దాల్చిన చెక్క నిరోధిస్తుందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో బరువు తగ్గుతారు. ఇది PCOS రోగులకు సహాయపడుతుంది.
పుదీనా..
PCOSలో పుదీనా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. శరీరంలో అధిక జుట్టు పెరుగుదలను తగ్గిస్తుంది.
అతిమధురం..
ఆయుర్వేదంలో అతిమధురం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అతిమధురం తీసుకోవడం వల్ల అండోత్సర్గ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది.
*రూపశ్రీ.