ఉద్యోగంలో రాణించాలంటే...?
posted on Jul 5, 2013
ఉద్యోగం చేసే చోట ఉద్యోగస్తుల్లా మెలగాలి కాని ఆడపిల్లల్లా కాదు అంటున్నారు నిపుణులు. అంటే సున్నితత్వం, లాలిత్వం ఆడవారి నైజం అయినా ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు వాటిని దూరంగా పెట్టడమే మంచిదట. అలాగే మేం ఆడవాళ్ళం అని గుర్తుచేసేలా కొన్ని పనులు అలవాటుగా చేసేస్తుంటారు కొందరు. వాటికి దూరంగా ఉండటం కూడా ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ఆ అలవాటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది. వంటలని పంచిపెట్టడం. ఏ కొత్త స్వీటో చేసినపుడు, ఏ కొత్త వంటకాన్నో తయారు చేసినపుడు స్నేహితులకి రుచి చూపించటం తప్పు కాకపోయినా, ఆఫీసులోని కొలిగ్స్ కి కూడా ఆ రుచులను పంచాలనుకోవటం కరెక్ట్ కాదట. పూర్తి ప్రొఫెషనల్ రిలేషన్ మెయింటేన్ చేయాలంటే అలా వంటల రుచులు చూపించకపోవటమే మొదటి సూత్రం.
మన శారీరక కదలికలు, నుంచోవటం, నవ్వటం, నడవటం ఇవన్నీ మన ఆత్మవిశ్వాసాన్ని బహిర్గత పరిచేలా వుండాలి. అలా కాక నలుగురు ఉన్నచోట సర్దుకుపోవాలని ఆలోచించినపుడు మన బాడీ లాంగ్వేజ్ కూడా ఆ ఆలోచనలకి తగ్గట్టే ఉంటుంది. ఇది మిమ్మల్ని మీపై అధికారులు అంచనా వేసేటపుడు తప్పుడు సంకేతాలు అందిస్తుంది. సర్దుకుపోవటమనేది మీ ఆప్షన్ గా ఉండలే గాని, ప్రతీ విషయంలో అదే పరిష్కారం కాకుడది గుర్తుంచుకోవాలి అంటున్నారు నిపుణులు.
"లీడర్"కి ఉండాల్సిన మొదటి లక్ష్యం ఇతరులతో సమర్థవంతంగా పనిచేయించగలగటం... అన్నీ తన బాధ్యత అనుకుంటూ ఎన్నో పనులని పైన వేసుకొని ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. చాలా మంది తాము లేకపోతే ఆర్గనైజేషన్ నడవదన్నట్టు మాట్లాడుతుంటారు మరికొందరు. అయితే తన పని తాను చేస్తూనే, తన కిందివారు కూడా తమ పనులని సమర్థవంతంగా చేసేలా చేయటం నాయకత్వ లక్షణమని గుర్తించి అలా నడుచుకోగలిగితే తప్పకుండా ఓ మంచి లీడర్ అనిపించుకుంటారట ఆడవారు. అలాగే ఆర్డర్ చేయాల్సిన చోట రిక్వెస్టింగ్ గా చెప్పటం కూడా మిమ్మల్ని ఎదుటవారు తక్కువ అంచనా వేసేందుకు కారణమవుతుంది కాబట్టి ఇతరులతో వ్యవహరించేటపుడు స్పష్టమైన వైఖరి అవసరం అంటున్నారు నిపుణులు.
ఇతరులతో మాట్లాడేటపుడు తలవంచుకోవటం, అటు ఇటు చూడటం కాకుండా... ఎదుటి వ్యక్తితో నేరుగా చూస్తూ మాట్లాడటం మంచి పద్ధతట. అలాగే ఆఫీసు వాతావరణంలో నవ్వుల్ని ఆచితూచి వాడలట. సరదా అంటూ అతి చనువుని ప్రదర్శించే వారిని ముందే కట్టడి చేయాలట. ఆఫీసులో వారు మిమ్మల్ని ఏ విధంగా గుర్తించాలని మీరు కోరుకుంటున్నారు అన్నీ విషయాలపై మీకు ముందే అభిప్రాయం ఉండాలి. అప్పుడే మీరు అందుకు తగ్గట్టు ప్రవర్తించటం సులభమవుతుంది అంటున్నారు నిపుణులు.
ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా పురుషులతో కరచాలనం చేయాల్సి వచ్చినపుడు చాలా మంది ఇబ్బంది పడతారు. మొహమాటంగా అందీ అందనట్టు చేయి ముందుకు చాపటం మనలోని ఆత్మవిశ్వాసరాహిత్యాన్ని సూచిస్తుందట. అందుకే కరచాలనం చేయాల్సి వచ్చినపుడు ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడి, ఎదుట వ్యక్తిని చూస్తూ చేయి కలపాలి. మన మాటలు కూడా సూటిగా, స్పష్టంగా క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలి. అనవసర గాసిప్స్ కి దూరంగా ఉండాలి. ఇవన్నీ మన ఉద్యోగ బాధ్యతల్ని మనం సమర్థవంతంగా నిర్వర్తించటానికి సహాయపడే అంశాలు.
-రమ