అన్ని రకాల దుస్తులకు భలే సెట్ అయ్యే చెవి పోగులు ఇవేనండోయ్..!
posted on Dec 28, 2024
చెవి పోగులు భారతీయ మహిళల అందాన్ని మరింత పెంచుతాయి. ముక్కు కుట్టించడం, చెవులు కుట్టించడం వెనుక చాలా ఆరోగ్య రహస్యం దాగుందని కూడా చెబుతారు. అయితే ఫ్యాషన్ పెరిగేకొద్దీ ఇలా చెవులు కుట్టించడం, ముక్కు కుట్టించడం చాదస్తం అనుకుంటున్నవారు ఉన్నారు. దీనివల్ల ఇప్పటికే ముక్కు కుట్టించడం అనే అలవాటు చాలా వరకు తగ్గిపోయిందని చెప్పాలి. అయితే చెవి పోగులు మాత్రం ఫ్యాషన్ కు తగ్గట్టు అప్డేట్ అవ్వడం వల్ల సాధారణ దుస్తుల నుండి వివిధ రకాల ఫ్యాషన్ దుస్తుల వరకు సెట్ అయ్యే చెవి పోగులు అందుబాటులో ఉంటాయి. అమ్మాయిల దగ్గర చెవి పోగులకు సంబంధించి చాలా వివిధ్యమైన కలెక్షన్ ఉంటుంది. ఓ సారి వాటి వైపు లుక్కేస్తే..
వెండిపొర చెవి పోగులు..
సూట్ వేసుకున్నా చీర కట్టుకున్నా రెండు రకాల దుస్తులకు సెట్ అయ్యేలా చెవి పోగులు కావాలి అంటే వాటికి వెండిపొర చెవిపోగులు కరెక్ట్ గా సెట్ అవుతాయి. వెండి ధర బంగారం కంటే తక్కువే కాబట్టి వెండిపొర చెవిపోగులు తీసుకుంటే అద్భుతంగా ఉంటాయి.
కుందన్ చెవిపోగులు..
ఈ రోజుల్లో కుందన్ చెవి పోగులు ప్రతి సంప్రదాయ దుస్తులపై చాలా బాగా సెట్ అవుతాయి. సెట్ అవ్వడమే కాదు.. మరింత అందాన్ని పెంచుతాయి. సూట్ తో అయినా చీరతో అయినా వివిధ రకాల వెస్ట్రన్ దుస్తులతో అయినా చెవిపోగులు ధరించడం వల్ల అందం మరింత పెరుగుతుంది.
స్టడ్ చెవిపోగులు..
స్టడ్ చెవిపోగులు చెవులకు అతుక్కున్నట్టు ఉంటాయి. ఇవి ఇవి పరిమాణాన్ని బట్టి మరింత సింపుల్ లుక్ అయినా, గ్రాండ్ లుక్ అయినా ఇస్తాయి. సాధారణ దుస్తుల నుండి అన్నిరకాల వస్త్రాలకు మంచి క్లాసీ లుక్ ఇవ్వడంలో ఇవి బాగుంటాయి.
బుట్టలు..
దుస్తులలో అయినా ఆభరణాలలో అయినా బుట్టలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పట్టు పావడా కొట్టించినా, చీరలో జాకెట్ కుట్టించినా హ్యాండ్స్ కు బుట్ట పెట్టిస్తే ఆ కళనే వేరు. ఇక బుట్ట కమ్మలు ఎంత సెన్సేషన్ సృష్టించాయో మాటల్లో చెప్పలేం. పెళ్లికూతురు అంటే ఖచ్చితంగా బుట్ట కమ్మలు పెట్టుకున్న బుట్టబొమ్మే అయ్యుంటుంది. ఈ బుట్ట కమ్మలు కూడా వివిధ రకాల డిజెన్లతో చాలా స్టైల్స్ లో అందుబాటులో ఉంటాయి. కేవలం బంగారమే కాకుండా వివిధ రకాల మెటల్స్ లో అందుబాటులో ఉంటాయి.
*రూపశ్రీ.