జీవన శైలిని మార్చే ధ్యానం
posted on May 16, 2011
జీవన శైలిని మార్చే ధ్యానం
మన జీవన విధానంలో యాంత్రికత చోటు చేసుకున్నాక ప్రశాంతత లోపించింది . మన గురించి మనం ఆలోచించుకునే తీరిక, ఓపిక లేదిప్పుడు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలంటే మనలో చాలామందికి ఆసక్తి రోజు రోజుకీ తగ్గిపోతుంది. నిజానికి జీవనశైలిలో వచ్చిన మార్పుల్ని ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలు ఎన్ని ఉన్నా మనం వాటి పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నాం. మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి శారీరకంగా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ మానసిక శక్తి యోగ, ధ్యానం వల్ల లభిస్తుంది. ఎంత బిజీగా ఉన్నా కొన్ని యోగ పద్ధతుల్ని పాటించి ధ్యానం చేస్తే మనసు శరీరం హాయిగా సేద దీరుతుంది.
-
రోజుకి కనీసం కొన్ని నిమిషాల సేపైనా మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. అందుకోసం ధ్యానం బాగా ఉపకరిస్తుంది.
-
మీలో ఏకాగ్రత లోపిస్తుంటే ఖచ్చితంగా మీరు ధ్యానాన్ని ఆచరించాల్సిన సమయం ఆసన్నమైందని భావించాలి. ధ్యానం మనలో ఏకాగ్రతని పెంచి, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
-
క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల మనలో చైతన్యం పెరగడంతో పాటు గొప్పి శక్తిని కూడా
పెంచుకోగలుగుతాం .
-
బాగా కష్టపడి పనిచేసి వచ్చిన తర్వాత హాయిగా స్నానం చేసి విశ్రాంతి తీసుకోండి. మీరు విశ్రాంతి తీసుకునే ప్రాంతం ఎంత ప్రశాంతంగా ఉంటే మీలో అంత కొత్త శక్తి వచ్చి చేరుతుంది.
-
ఒత్తిడి, నిస్పృహ ఈ రోజులో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు, వీటినుండి తక్షణ ఉపశమనం పొందాలనుకునేవారు తప్పకుండా యోగ పద్ధతులను ఆచరించాలి .
-
ఒత్తిడికి కారణమైన నరాలకు విశ్రాంతిని కలుగజేయడంలో యోగ మంచి పాత్ర పోషిస్తుందని పరిశోధనల్లో తేలింది.
-
రక్త ప్రసరణను క్రమబద్ధం చేయడం, కండరాలకు అదనపు బలాన్ని ఇవ్వడంలో ధ్యానానికి మించింది లేదు.
-
రక్తంలోని చక్కర శాతాన్ని తగ్గించడానికి వ్యాయయం లాగే ధ్యానం కూడా మంచి మందుగా ఉపయోగపడుతుంది,. డయాబెటిస్ రోగులు డాక్టర్ల సలహా మేరకు రోజూ కొద్దిసేపు యోగా చేయడం మంచిది.
-
గుండెపోటు వంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వారు రక్త సరఫరాలో విపరీతమైన వేగాన్ని నియంత్రించడానికి, గుండెకి హాయిని కలిగించే మంచి కొలెస్ట్రాల్ లెవెల్ ని క్రమబద్ధం చేయడంలో ధ్యానానికి మించింది లేదు.
-
కుటుంబ సమస్యలతో సతమతమయ్యే స్త్రీలు కూడా క్రమం తప్పకుండా యోగ చేయడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంటిపని సరిపోతుందిలే అనుకుని యోగాని నిర్లక్ష్యం చేయకూడదు.
-
సాధ్యమైనంత వరకు యోగ చేస్తున్నప్పుడు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా ఉంచడం మంచిది. యోగ వల్ల కలిగే ప్రయోజనాలను రేడియోధార్మిక కిరణాలు ప్రభావితం చేస్తాయి.
- పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవడం, మిన్ను విరిగి మీద పడినా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా తమ పని తాము చేసుకుపోవడం యోగ పద్ధతులు పాటించేవారికి బాగా అబ్బుతాయి.
- శరీరంలోని నిర్జీవంగా ఉన్న కొన్ని కణాలను ఉత్తేజవంతం చేయడంలో, మూత్ర పిండాలు సక్రమంగా పని చేయడంలో ధ్యానం మంచి పాత్ర పోషిస్తుంది.
ఎల్లప్పుడూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మన శరీరం మీద దాడి చేయడానికి ఏ వ్యాదికైనా భయం కలుగుతుంది. రోగ నిరోధక శక్తి సరిగ్గా ఉంటే ఆరోగ్యాభ్యుదయం క్రమం తప్పక సిద్ధిస్తుంది. మన పూర్వీకులు అంత ప్రశాంతంగా, ధృడంగా తమ జీవితాలను సాగించారంటే అందుకు కారణం వారి జీవన శైలి అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.