బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఈమె గురించి తెలిస్తే ఆశ్చర్య పోతారు!
posted on Jun 19, 2023
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఈమె గురించి తెలిస్తే ఆశ్చర్య పోతారు!
“విజయమో వీరస్వర్గమో అంతుతేలాలి. శాంతి సమరంలో ఇది ఆఖరు ఘట్టం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులారా భారతదేశాన్ని వదలివెళ్లిపొండి. క్విట్టిండియా" అని 1942 క్విట్టిండియా కాలంలో ఒక వీరనారి సివంగివలె గర్జిస్తూ ఉండేది. గట్టివరస శరీరంతో, తేజోవంతమైన ముఖంతో ఖాదీ నిక్కరు, చొక్కా ధరించి ఒక యూరోపియన్ వనిత ఈ నినాదాలు ఇవ్వటం వినిన పొరుగూరువారు క్షణకాలం బిత్తరపోయి చూసేవారు. ఆమె శ్రీమతి మెల్లీ షోలింగరు. సరిగ్గా చెప్పాలంటే ఆంధ్రుల అభిమానం సంపూర్ణంగా పొందిన తెలుగింటికోడలు. శ్రీమతి ఉప్పల మెల్లీ షోలింగరు లక్ష్మణరావు. ఈమె 1898 వ సంవత్సరం మార్చి మూడవ తేదీన స్విట్జర్లాండు ముఖ్యపట్టణమైన జూరిచ్ లో జన్మించారు. శ్రీ అధల్ఫ్, శ్రీమతి బెర్తా షోలింగర్ లకు కుమారులు ఉన్నారు గాని కూతురు ఈమె ఒకరే కావటాన ఇష్టంగా చదివించారు. దానితో ఈమె హోంసైన్స్ పట్టభద్రురాలు అయింది. మెడికల్ కాలేజీ పంపించారు. రెండు సంవత్సరాలు చదువు ముగిసింది. ఇంతలో మొదటి ప్రపంచయుద్ధ కారణంగా తండ్రి ఆస్థి అంతా విధ్వంసమై ఆమె చదువు నిలిపివేశారు.
తండ్రికి వ్యాపార నిర్వహణలో సాయపడుతూ ఉండేవారు. వ్యాపారరీత్యా దక్షిణ జర్మనీలో ఉన్న ట్యూబెన్గెన్ నగరంలోవున్న మిత్రులను కలుసుకోవటానికి వెళ్లవలసివచ్చేది. ఆ సమయంలో అక్కడ డాక్టరేటుకు చదువుతున్న శ్రీ ఉప్పల లక్ష్మణరావును కలుసుకోవటం జరిగింది. ఆమె మాతృభాష జర్మన్, అప్పటికే ఆమె జర్మన్ భాషలో సుప్రసిద్ధ ఇండాలజిస్ట్ శ్రీ ఓల్టెన్బర్లు పండితుడు వేదాలను గురించి, బౌద్ధమతాన్ని గురించి వ్రాసిన గ్రంధాలను చదివారు. బహుమతి గ్రహీత ప్రఖ్యాత రచయిత శ్రీ హెర్మొన్ హెన్సే హిందూ దేశాన్ని గురించి, సింహళ దేశాన్ని గురించి వ్రాసిన పుస్తకాలు చదివారు. మనదేశంపట్ల సంస్కృతిపట్ల ఎంతో అభిమానం, సద్భావము కలిగాయామెకు. అందువల్ల శ్రీ లక్ష్మణరావు పట్ల గౌరవము, స్నేహము ఏర్పడ్డాయి. అప్పటికే భారత దేశ రాజకీయాలలో గాంధీయుగం ఆరంభమయింది. ఆమెకు సోషలిజం పట్ల ప్రపంచ కార్మికోద్యమంపట్ల అంతకు పూర్వంనుంచే అభిమానం ఉండేది. అందువల్ల భారతదేశంలో బ్రిటిష్ వారి దమన నీతిని, హింసాకాండను ఏవగించుకుంటూ భారతదేశ స్వాతంత్ర్యోద్యమంపట్ల సహానుభూతి కనపరచేవారు. మిత్రులైన శ్రీ లక్ష్మణరావు గారి ద్వారా మత, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలను సవిస్తరంగా తెలుసుకుంటూ ఉండేవారు. పర్యవసానంగా హిందూదేశం చూసితీరాలన్న కోరిక కలిగింది. తండ్రి అనారోగ్య కారణంగా ఆమె 1934 చివరన స్వదేశం వెళ్లి పోయినారు. 1937 ఆగస్టు 30న మాస్కోలో డాక్టరు శ్రీ ఉప్పల లక్ష్మణ రావుగారితో ఆమె వివాహం జరిగింది. 1937 లో భారతీయ వనితగా ఆంధ్ర మహిళగా విజయవాడలో భర్తతో స్థిరపడ్డారు.
క్విట్టిండియా ఉద్యమంలో ఆమె వుద్రేకం గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకయినా మంచిదని శ్రీమతి ఉప్పల మెల్లీ షోలింగర్ ను 1942 సెప్టెంబరులోనే ఆరెస్టుచేశారు. ఆ ఊళ్లోనే తాలూకా ఆఫీస్ సబ్ జైలులో రెండు నెలలపాటు రిమాండులో ఉంచారు. అక్కడ ఒక్క నదుపాయం లేకపోగా మహిళా ఖైదీలకు కనీసపు అవసరాలు అయిన మరుగుదొడ్లు, స్నానాల గదులుకూడాలేవు. ఎందరెందరో విన్నవించుకున్నారు. బ్రతిమలాడుకున్నారు, విసుక్కున్నారు. ప్రయోజనం లేకపోయింది. ఇక ఇదిమార్గం కాదని శ్రీమతి మెల్లీ నిరశనవ్రతం పూనారు. పచ్చి మంచినీళ్లు ముట్టకుండా వారం గడిచింది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. చాలా నీరస స్థితిలో ఉన్నారు. శక్తి కూడతీసుకుని "క్విట్టిండియా” అని ఉచ్చరిస్తూనే ఉన్నారు. జైలు అధికారులకు కొంచెం జంకు కలిగింది. ఆమె కోరిక ప్రకారం జైలులో శ్రీ ఖైదీలకు కనీనపు సదుపాయాలు కల్పించారు. ఆమె కేసు విచారణ చేసి ఒకటిన్నర సంవత్సరాలు కఠినశిక్ష వేశారు. "సి" కాను ఇచ్చి రాయ వేలూరు పంపారు. రాయవేలూరు జైలుకు వెళ్లటం ఆమెకది మొదటిసారికాదు, రెండవ సారికాదు. మూడవసారి. అందుకనే కసితీర ఆమెకు శిక్ష ఘాటుగా వేశారు. ఆ నిరశనవ్రతం సందర్భంలో క్షీణించిన ఆరోగ్యం ఆమె తిరిగి కోలుకోనేలేదు.
1957లో తన సోదరులను చూడటానికి, ఆమె భర్తతో సహా తూర్పు జర్మనీకి వెళ్లారు. అక్కడ ఉన్న రెండు సంవత్సరాల కాలంలోను అనేక పట్టణాలలో భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, భారత మహిళాభ్యుదయం వంటి అనేక విషయాలపై ఉపన్యసించేవారు, గోష్టులు జరిపేవారు. 1959లో దంపతులు మాస్కో వెళ్లారు. 1965 జూలై 27న ఒక రోడ్డుప్రమాదంలో ఆమె తనువు చాలించారు. ఆనాటికీ ఆమె ఖాదీ ధారణ మానలేదు. ఆమె పట్టుదల, సేవానిరతి, త్యాగం భారతీయులు గుర్తుంచుకోవాలి.
◆నిశ్శబ్ద.