జీరో యావలో లైఫే జీరో...
posted on Jun 20, 2016
జీరో యావలో లైఫే "జీరో"...
కరువు కాటకాలతో అల్లాడే దేశాల్లో తినడానికి ఆహారం దొరకదు కాబట్టి అక్కడ ప్రజలు బక్కచిక్కిపోయి, ఎముకలు బయటపడి ఉండటం మనం చూస్తుంటాం. కానీ నేటి కాలం యువతులకు ఏం పోయే కాలం..అన్నీ ఉన్నా కావాలని కడుపు కట్టేసుకుని సన్నగా గడకర్రలా ఉండటానికి..? ఆ దేశం, ఈ దేశం అని లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లోని అమ్మాయిలు నాజూకుతనం కోసం పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. అయితే సన్నబడాలనే ఉద్దేశ్యంతో శరీరావసరాలకు సరిపోని స్థాయిలో అతి తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. వారి టార్గెట్ ఒక్కటే "సైజ్ జీరో"..ఇదంతా బాగానే ఉంది కాని దీని కారణంగా బయటపడిన ఒక మానసిక వ్యాధి ప్రపంచంలోని అమ్మాయిల ప్రాణాలను హరిస్తోంది. అదే "ఎనరెక్సియా నెర్వోసా"..ఇది అత్యధిక మోడళ్లలో కనిపించే ఒక మానసిక సమస్య. తిండి తినడం వల్ల బరువు పెరుగుతుందనే ఫోబియా వల్ల వచ్చే రోగం ఇది. ఇది ఒక సాంఘిక అంటువ్యాధి..నా కన్నా ఆ అమ్మాయి సన్నగా ఉందనే ఆత్మన్యూనతా భావంతో ఈ డిజార్డర్ బారిన పడి కలత చెంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారెందరో..తాజాగా ఇది ఇండియాలో అడుగుపెట్టింది. ఈ వ్యాధి తీవ్రతను గుర్తించిన యూరప్ అమ్మాయిలు సైజ్ జీరో నుంచి బయటపడుతుండగా..అదే సమయంలో దాన్ని ఇండియాకి తీసుకొచ్చింది కరీనా. "తషన్" చిత్రంలో కరీనా సన్నదనం చూసి బాలీవుడ్‌తో పాటు అమ్మాయిలు స్టన్నయ్యారు. ఇంకేముంది క్యాలరీలు కట్ చేసుకోవడం మొదలెట్టారు. మహానగరాల నుంచి కుగ్రామాల వరకు ఇండియాలో ఇప్పుడోక ఫ్యాషన్‌లా మారింది జీరో సైజ్. త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో డైటింగ్‌లు, తీవ్రస్థాయిలో వ్యాయామంతో పాటు మందులు వేసుకోవడం లాంటివి చేస్తున్నారు.
అనొరెక్సియా నెర్వోసా దుష్పలితాలు:
* ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో మంట
* ఏకాగ్రత తగ్గడం
* నిద్రలేమి
* శరీరంలో పెళుసైన ఎముకలు విరిగిపోవడం
* మూర్ఛవ్యాధి
* హర్మోన్లలో అసమతుల్యత
* రుతుక్రమంలో లోపాలు
సైజ్ జీరోని సాధించడానికి చాలా పద్ధతులున్నాయి. కానీ, ఆరోగ్యవంతమైన పద్ధతులు చాలా తక్కువ. మగవాళ్లు సిక్స్ ప్యాక్‌కు కష్టపడినట్టు, అమ్మాయిలు కూడా జీరో సైజుకి అంతే కష్టపడాలి. ప్రత్యేకమైన డైట్లు, రోజువారీ ఎక్సర్‌సైజులు చేయాలి. ఇందుకు నెలల తరబడి టైం పడుతుంది. అయితే అందరికన్నా ముందు దీనిని సాధించాలని కొందరు పూర్తిగా ఆహారాన్ని మానేసి కాఫీలతో కాలం గడుపుతున్నారు. మరికొందరు స్టెరాయిడ్స్ తీసుకుంటూ..జీరో సైజ్ యావలో లైఫ్‌ని జీరో చేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే అతి నాజూకుతనం భారతీయ మగ కంటికి అంత ఇంపుగా అనిపించకపోవడంతో జీరో సైజ్‌ని ఎంచుకునేవారి సంఖ్య జీరోకి చేరుతోంది. అమ్మాయిలైనా అతిగా ఉన్న కొవ్వును కరిగించుకోవాలే కానీ లేనిదాని కోసం ఆరాటపడటం మంచిది కాదని గుర్తిస్తే మంచిది.