కూర్చున్న చోటే ఎక్సర్ సైజ్
posted on Nov 6, 2024
కూర్చున్న చోటే ఎక్సర్ సైజ్
రోజూ వ్యాయామం ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కూడా.. ఈ ఉరుకుల పరుగుల రొటీన్ జీవితంలో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోం. అయితే కదలకుండా ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాల్లో స్టిఫ్ షోల్డర్ వంటివి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఈమధ్య. ఆ ఇబ్బందులని అధిగమించాలంటే... ఎప్పుడు, ఎక్కడ, ఏ కాస్త సమయం దొరికినా కూడా కూర్చున్న చోటనే చిన్న చిన్న కదలికల్ని చేయటం మంచిది అంటున్నారు నిపుణులు. ఎలా అంటే ...
1. ప్రతి అరగంటకి ఒకసారి కూర్చున్న భంగిమను మార్చాలి. అలాగే కళ్ళు ఆర్పి, తెరవటం చేయాలి.
2. ప్రతి గంటకి ఒకసారి కుర్చీలోంచి లేచి అటు, ఇటు నడవాలి. వీలు కాకపొతే ఓ ఐదు నిముషాలు నిల్చోవాలి.
3. అలాగే కుర్చీలో కూర్చుని మెడని పైకప్పు కేసి సాగదీయాలి. అంటే పైకప్పు వైపు చూస్తుండాలి అన్నమాట.
4. ఇక అప్పుడప్పుడు మెడని ఒక పక్కనుంచి మరో పక్కకి అడ్డంగా తిప్పాలి.
5. భుజాలని అప్పుడప్పుడు గుండ్రంగా తిప్పాలి. అలాగే మణికట్టు దగ్గర చేతుల్ని తిప్పాలి.
ఇలా ఆఫీసులో, ఇంట్లో, బయట ఎక్కడ వున్నా మోచేతులు, మోకాళ్ళు, భుజాలు, మణికట్టు, మెడ ఇలా జాయింట్స్ ని కదుపుతూ చిన్న చిన్న ఎక్సర్ సైజులు చేస్తే ... పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలనుంచి బయటపడచ్చు అంటూ సూచిస్తున్నారు నిపుణులు.
- రమ