పిల్లల నుంచి నేర్చుకోవడానికి మీరు రెడీయేనా
posted on Nov 25, 2015
పిల్లల నుంచి నేర్చుకోవడానికి మీరు రెడీయేనా ??
"పిల్లల మంచి కోరి, పెద్దలు తమ అనుభవం మీద కొన్ని విషయాలు చెప్తారు, వాటిని పిల్లలు నేర్చుకోవాలి " ఇది మనం ఎప్పటినుంచో వింటున్న మాట. కానీ ఇప్పటి తరానికి అందులోనూ యుక్త వయస్సులో ఉన్నవారికి అది ఎంతవరకు పనిచేస్తుందో చెప్పలేం. ఎందుకంటే " పెద్ద వారి మాట వినమంటున్నారు సరే తప్పకుండ వింటాం, అలాగే వాళ్ళు మా మాట కూడా అప్పుడప్పుడు వినాలిగా ?అని ఇప్పటి తరం పిల్లలు అడుగుతున్నారు. దీనికి సమాధానం ఏది ? " మీకు అనుభవం లేదు మేం అనుభవమ్మీద చెప్తున్నామ్", అనేస్తారు కానీ వారి అనుభవం ఎలాంటి పరిస్తితిలో వచ్చింది ? అదే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా ? అని ఆలోచిస్తే లేవు.
ఒక 20 యేళ్ళ క్రితం ఉన్న పరిస్థితుల్లో ఒక్కటన్న ఇప్పుడు ఉందా? ఉద్యోగాల్లో, ఇంట్లో, సమాజంలో ఎన్ని మార్పులు వచ్చేశాయి. మరి వాటి ప్రకారం పెద్దవారు తమని తాము మలచుకున్నారా? అలా ఒకవేళ మారి ఉంటే తరాల మధ్య తలెత్తుతున్న ఈ అంతరాలు వచ్చేవే కాదట. మిగతా బంధాలలో ఎలా ఉన్నా తలితండ్రుల్లో ఇది ఇంకొంచెం పెద్ద ప్రాబ్లంగా ఉంటుందట. ఎందుకంటే, పిల్లల జీవితాలని శాసించే అదికారం ఉందని అనుకోవడం వారికి పరిపాటి కాబట్టి. అందుకే "ఇది చేయండి అది చేయద్దు" అని చెప్పేస్తుంటారు పిల్లలకి. అలా మీరు చెప్పినట్టు చేస్తే పని కాదు అని ఒక వేళ పిల్లలు చెప్తే ఆ విషయంలో కూడా ఎంతో కొంత నిజం ఉందేమో అని పెద్దవారు ఆలోచించొచ్చుగా?
కుదరదు, ఎందుకంటే "పిల్లలకి అనుభవం ఉండదు" ,"మాకు ఎలాగూ చేతులు కాలాయి మీరు ఎందుకు కాల్చుకోవడం" లాంటి మాటలు పుట్టుకొస్తాయి. ఒక సమస్యని పెద్ద వాళ్ళు అప్పటి పరిస్థితి ప్రకారం పరిష్కరిస్తే అదే పద్ధతి ఇప్పటి పరిస్థితికి వర్తిస్తుందా? అంటే అన్నిసార్లు వర్తించదు అని పిల్లలు గోల పెడతారు. అలాంటప్పుడే యుక్త వయస్సులో పిల్లల మాటలు పెద్దవాళ్ళు వినాల్సిన అవసరం వస్తుంది. కానీ వారిదారికి అలాంటప్పుడే అంతర్యుద్ధం మొదలౌతుంది" ఈ పిల్లలు చెప్పిన మాటలు మేం వినాలా? అని"
ఏం ?ఎందుకు వినకూడదు? ఇప్పటితరం పిల్లలు సమస్యల మధ్యే పుడుతున్నారు, సమస్యలతో పెరుగుతున్నారు, అలాంటప్పుడు సమస్యని ఎదుర్కోవడంలో వారికి ఉన్న శక్తి పెద్దవారికన్నా ఎక్కువేగా? వారి మాట కొట్టిపారెసే ముందు ఈ ఒక్కసారికి వింటే పోలే అని కాస్త ఆలోచించచ్చుగా.
అసలు సమస్య ఏంటంటే పెద్ద వారికి ఇలా చిన్న వారి మాట వినడం లో "అహం "అడ్డు వస్తుంది. మేం పెద్దవాళ్లం అనే అహం, పిల్లల మాట వినాలా? వారి దేగ్గర నేర్చుకోవాలా? అంతకన్నా చిన్నతనం ఉంటుందా ? అన్న అహం. అందుకే ఆ అహం వల్లే ఒకవేళ చిన్నవారు చేస్తున్నది కరెక్ట్ అని తెలిసినా ఒప్పుకోరు. అన్నిసార్లు పిల్లలు కరెక్ట్ కాకపోవచ్చు, పడనివ్వండి.. నేర్చుకొనివ్వండి. అప్పుడు మీరు చెప్పే మాట విలువ వారికి తెలుస్తుంది. మీరు వారి మీద ఉంచే నమ్మకమే వారిని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. మీరే నమ్మకపోతే రేపు ప్రపంచాన్ని ఎలా నమ్మించగలరు వాళ్ళు .?
పిల్లల్ని పెంచడం అంటే ఎప్పుడు వారి చేయి పట్టి నడిపించడం కాదు, పడకుండా సంభాళించుకునే నడిచే పద్ధతి నేర్పించడం. మీరు పిల్లల మాట కాస్త వింటే వారి ఆలోచనతో మీరు ఉన్నారని వారికి అనిపిస్తే అప్పుడే వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ మాట మీదే నడుస్తారు.
--Pushpa