పిల్లల పేచీ శాస్త్రం

పిల్లల పేచీ శాస్త్రం

ఒకోసారి పిల్లలు పెట్టే పేచీలు అర్థం కావు. ఎందుకు ఇంత చిన్న విషయానికి  పేచీ పెడుతున్నారు అనుకుంటాం.  మొండిగా, ఎదురు సమాధానం చెప్పగానే మనకి కోపం వస్తుంది. కానీ పిల్లలలోని ఇలాంటి పేచీలకి, మొండితనానికి మూలాలు తెలుసుకోకుండా ఆ నిమిషానికి  ఏదో ఒకటి సర్దిచెప్పటమో, లేదా గట్టిగా అరచి ఉరుకోబెట్టటంతోనో  ఎలాంటి లాభం ఉండదు అంటున్నారు నిపుణులు. పదే పదే పిల్లలు పేచీ పెడుతుంటే ఒక్కసారి వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు అని ఆలోచించాలి. కొంతమంది పిల్లలకి అమ్మ వాళ్ళతో సరిగ్గా సమయం గడపకపోతే కోపం, ఉక్రోషం వస్తాయి. అది ఎలా వ్యక్తం చేయాలో తెలియక అమ్మతో ఏదో ఒకరకంగా గొడవకి దిగుతారు.   ఎదురు చెబుతారు. ఏడుస్తారు.  అలాంటప్పుడు అమ్మ వాళ్ళతో ఆడుకోవటం, దగ్గర కూర్చుని చదివించటం, కథలు చెప్పటం వంటివి చేస్తే పిల్లలు ఉషారుగా వుంటారు.  అమ్మ చెప్పినట్టు వినటానికి ప్రయత్నిస్తారు.

కొంతమంది పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు ఉండటానికి ఇష్టపడతారు. కానీ పదే పదే అమ్మ, నాన్న వాళ్ళని ఇలా వుండు, అలా వుండు అని చెబుతుంటే నచ్చక  ఆ చికాకుని  పేచీలుగా బయట పెడతారు. ఒకటి రెండుసార్లు పిల్లలు నాకు తెలుసు అనటం విన్నాక అర్థం చేసుకుని వాళ్ళని డిమాండ్ చేయకుండా, నచ్చ చెప్పే ధోరణిలో మాట్లాడితే పిల్లలు కూడా పంతానికి పోకుండా వుంటారు. అంతే కాకుండా పిల్లలు ఎదురు చెప్పగానే మనం కూడా వెంటనే రియాక్ట్  అవకుండా, చూసి చూడనట్టు వదిలేయాలి. అలా అని వాళ్ళకి మంచి, చెడు చెప్పద్దని కాదు. కానీ పిల్లలకు అర్థం అయ్యేలా ఏదన్నా చెప్పాలంటే దానికి ఎమోషన్స్‌ని చేర్చకూడదు. పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ మూడ్ చూసి నువ్వు నిన్న చేసింది కరక్టేనా? అలా చేయకూడదు కదా? అని నెమ్మదిగా చెబితే వాళ్ళు ఆలోచనలో పడతారు. ఇంకోసారి వాళ్ళ చికాకుని మీకు ఎలా చెప్పాలో నేర్చుకుంటారు.


పిల్లల పేచీలని గమనిస్తూ , వాటికి శాశ్వత పరిష్కారం వెతకటం ఎలా అంటే పిల్లల మానసిక నిపుణులు చెప్పే సమాధానం ఒక్కటే... చిన్నప్పటి ఆ పేచీలే పెరిగి పెద్ద అవుతున్న కొద్ది వారి వ్యక్తిత్వంలో భాగంగా మారి, మాటవినని దశకి తీసుకువస్తాయి. అందుకే చిన్నగా ఉన్నప్పుడే సమస్య ములాలని గుర్తించి, పిల్లలతో మాట్లాడితే వాళ్ళు క్రమంగా నేర్చుకుంటారు. నచ్చలేదు అన్న విషయాన్నిఎలా చెప్పాలి... మనసులో వున్న బాధని, కోపాన్ని ఎలా ఎదుటివాళ్ళకి చేర్చాలి అన్నది పిల్లల ఎదుగుదలలో నేర్చుకోవలసిన ప్రథమ పాఠం.దానికి టీచర్లం మనమే. కొంచం ఓర్పు, మరికొంచం నేర్పుతోనే అది సాద్యం .