మైగ్రేన్ వేధిస్తోందా? ఈ ఆసనం వెయ్యండి చాలు!
posted on Jun 25, 2026
మైగ్రేన్ వేధిస్తోందా? ఈ ఆసనం వెయ్యండి చాలు..!
నేటికాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల చాలా మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళల్లోనే మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మైగ్రేన్ నొప్పి తలకు ఒక వైపున రెండు గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది. . విచారించే విషయం ఏమిటంటే.. మైగ్రేన్ కు ఎలాంటి మందు లేకపోవడం. ఒకసారి మైగ్రేన్ వస్తే దానికదే తగ్గేవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కానీ మైగ్రేన్ తగ్గడానికి యోగా చక్కగా సహాయపడుతుంది. మైగ్రేన్ ను తగ్గించుకోవడానికి ఏ ఆసనం వేయాలి? తెలుసుకుంటే..
శశాంకాసనం..
శశాంకాసన యోగా మనస్సును ప్రశాంతపరచడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం ఒత్తిడిని, మానసిక అలసటను తగ్గించగలదు. ఈ యోగాసనాన్ని రోజూ సాధన చేయడం వల్ల మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. శశాంకాసనం పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడంలో ఈ ఆసనం ఎంతగానో సహాయపడుతుంది.
ఎలా చేయాలి?
మొదట వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు చేతులను తల పైకి ఎత్తి, లోతుగా శ్వాస తీసుకోవాలి.
శ్వాసను వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగాలి. ఇప్పుడు, రెండు చేతులను ముందుకు చాచి, నుదుటిని నేలకు తాకించడానికి ప్రయత్నించాలి. శరీరాన్ని పూర్తిగా విశ్రాంతిగా ఉంచుతూ సాధారణంగా శ్వాస తీసుకోవాలి.
ఈ ఆసన భంగిమలో 20 నుండి 30 సెకన్ల పాటు ఉండాలి. ఆ తరువాత తిరిగి ఇదే విధంగా కొనసాగించాలి.
హస్తపాదాసనం..
హస్తపాదాసనం మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఈ యోగాసనం నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది, దీనివల్ల తలనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఎలా చేయాలి?
ఈ ఆసనం వేయడానికి, మొదట నిటారుగా నిలబడి పాదాలను కలిపి ఉంచాలి. తరువాత లోతుగా శ్వాస తీసుకుని చేతులను తల పైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ, నడుము నుండి ముందుకు వంగి, పాదాల పక్కన నేలపై అరచేతులను ఉంచాలి. మోకాళ్లను నిటారుగా ఉంచుతూ 20-30 సెకన్ల పాటు శ్వాస తీసుకోవాలి.
పైన చెప్పుకున్న రెండు ఆసనాలు వేస్తుంటే మైగ్రేన్ సమస్య ఉన్నవారికి చాలా చక్కని ఉపశమనం లభిస్తుంది.
*రూపశ్రీ.