మేరీ కాం- బాక్సింగ్ చేసే అమ్మ!

 

మేరీ కాం- బాక్సింగ్ చేసే అమ్మ!

ఆడది అమ్మయితే ఇక ఆమె వ్యక్తిగత జీవితం ఆఖరు అనుకుంటారు చాలామంది. కానీ జీవితంలో ఎదగాలన్న తపనే ఉంటే అటు కుటుంబ జీవితంలోను, ఇటు లక్ష్య సాధనలోనూ అద్భుతాలు సాధించవచ్చని నిరూపించిన మనిషి మేరీ కాం. మహిళలకు అనువుగాని ఆటలనీ, అందులోనూ తల్లి అయ్యాక దూరంగా ఉండాల్సిన పోటీలని భయపడిపోయే బాక్సింగ్‌లో పతకాల పంటని పండిస్తున్న మేరీ కాం గురించి మరికొంత...

పేదరికం... మేరీ కాం మణిపూర్‌లోని కన్‌గెతే అనే మారుమూల గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు పొలం పనులు చేసుకునే కూలీలు. మేరీ కాం కూడా పూట గడిచేందుకు తరచూ ఆ పొలం పనులకు వెళ్లి తల్లిదండ్రులకు సాయపడాల్సి వచ్చేది.

లక్ష్యం... మేరీ కాంకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టంగానే ఉండేది. కానీ తన రాష్ట్రానికే చెందిన డింగ్‌కో సింగ్‌ ఎప్పుడైతే ఆసియా క్రీడలలో బాక్సింగ్‌లో బంగారు పతకాన్ని తీసుకువచ్చాడో, అప్పటి నుంచి తాను కూడా బాక్సింగ్‌లో రాణించాలని నిర్ణయించేసుకుంది.

పోరాటం... మేరీ ఆశయాన్ని ప్రపంచమంతా ఎగతాళి చేసింది. బాక్సింగ్‌ అనేది పురుషుల ఆటనీ, ఆడవాళ్లకు తగిన సున్నితమైన ఆటని వెతుక్కోమని హెచ్చరించింది. ఆఖరికి మేరీ తల్లిదండ్రులు కూడా ఆమె ఆసక్తిని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా మేరీ తన పట్టు వీడలేదు. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు చేరుకుంది. అక్కడ నర్జిత్‌ సింగ్‌ అనే బాక్సింగ్‌ శిక్షకుడి వద్దకు తనకు బాక్సింగ్‌ నేర్పమంటూ ప్రాథేయపడింది.

శిక్షణ... తొలుత నర్జిత్‌ సింగ్‌ మేరీని తేలికగా తీసుకున్నాడు. కానీ ఇతరులకంటే తీవ్రమైన ఆమె సంకల్పాన్ని గ్రహించిన తరువాత తన శిక్షణపటిమనంతా ఆమెకు అందించాడు. నర్జిత్‌ ఆశలకు అనుగుణంగా మేరీ కాం రాష్ట్ర స్థాయి నుంచి ఒకో పోటీలో గెలుస్తూ 2001 నాటికి ప్రపంచ బాక్సింగ్‌ పోటీలలో రజతాన్ని సాధించింది. ఆ తరువాత మరో ఐదు సార్లు ప్రపంచ బాక్సింగ్‌ పోటీలలో బంగారు పతకాన్ని గెల్చుకుని, ఆ పోటీలలో ఆరు పతకాలను గెల్చుకున్న ఏకైక మహిళగా రికార్డు సాధించింది.
పెళ్లి... 2001లో మేరీ, ఆన్లర్‌ కామ్‌ను కలుసుకుంది. మేరీ ప్రతిభతో ముగ్ధుడైన ఆన్లర్‌ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. 2005లో ఆ జంట వివాహం చేసుకుంది. మేరీ వివాహం చేసుకుంటే ఆమె కెరీర్‌ నాశనం అయిపోతుందని నర్జిత్‌ సింగ్‌ వంటి పెద్దలంతా భయపడ్డారు. వారు ఊహించినట్లుగానే మేరీ 2006-08 కెరీర్‌కు దూరమయ్యింది. ఈ మధ్యలో ఆమెకు కవల పిల్లలు కూడా జన్మించారు.

కుటుంబం అడ్డుకాలేదు... అందరి భయాలనూ తిప్పికొడుతూ మేరీ 2008లో తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించింది. మళ్లీ ఒకదాని తరువాత ఒక పోటీని నెగ్గుకుంటూ పతకాల పంటని ప్రారంభించింది. ఒక పక్క గుండెజబ్బుతో బాధపడుతున్న పిల్లవాడిని గమనించుకుంటూ, ఆ బాధని దిగమింకుకుంటూనే రికార్డుల మోత మోగించింది. ఈ సందర్భంగా ఆమె భర్త ఆన్లర్‌ కామ్‌ అందించిన ప్రోత్సాహం కూడా అసామాన్యం. 2011 ఆమె ఆసియా కప్‌లో స్వర్ణాన్ని సాధించి వచ్చేనాటికి ఆమె పిల్లవాడికి ఆపరేషన్‌ కూడా విజయవంతంగా పూర్తయ్యింది.

చరిత్ర ముగిసిపోలేదు... 2012లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పడమే కాదు, ఆ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి తన పతకాల రికార్డుని మరింత పదిలం చేసింది. మేరీ కామ్‌ ప్రతిభను గమనించిన కీర్తి ఆమె వెంటపడింది. పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో ఆమెను వరించాయి. మేరీ కాం జీవిత చరిత్ర ఆధారంగా 2013లో ‘అన్‌బ్రేకబుల్‌’ అనే పుస్తకాన్నీ, ఆ పుస్తకం ఆధారంగా ప్రియాంక చోప్రా ముఖ్యపాత్రతో చలనచిత్రాన్ని రూపొందించారు. మేరీకాం ప్రతిభను, పోరాటపటిమను గమనించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను రాజ్యసభకు ఎంపికచేసింది. అయినా మేరీ కాం ప్రస్థానం ఇక్కడితో ఆగేట్లు లేదు. ఈ ఏడాది బ్రెజిల్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో అర్హత సాధించడం మీదే ఆమె దృష్టంతా!

- నిర్జర.