ఆరెంజ్ తో ఆరోగ్య, అనారోగ్య రహస్యాలు
posted on Feb 8, 2014
ఆరెంజ్ తో ఆరోగ్య, అనారోగ్య రహస్యాలు
ఆరెంజ్ ఫ్లేవర్ సాధారణంగా అందరికి ఇట్టే నచ్చుతుంది. చూడటానికి మంచి రంగు,అంతకుమించిన రుచి.. ఎవరినైనా ఈ కమల పండ్లు ఇష్టపడేలా చేస్తాయి.ఇవన్నీ పక్కన బెడితే ఈ కమల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఇందులో విటమిన్ C, ఫాస్పరస్, పొటాషియం, బీటా కెరోటిన్, ఆల్కహాల్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయట.
శరీర పెరుగుదలకి, జీవక్రియలకి, బి.పి.ని తగ్గించడానికి పొటాషియం శరీరానికి ఎంతో అవసరం. ఈ పొటాషియం మీడియం సైజు కమల పండుతో దాదాపు 260 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇక పీచు శాతం సంగతి చెప్పనక్కరలేదు. మందులు వేసుకున్న తర్వాత ఓ గ్లాసు ఆరెంజు జ్యూస్ తాగితే అవి మరింత త్వరగా ఒంటబడతాయట. కేవలం ఆరోగ్యానికే కాదు.. మంచి శరీర ఛాయని కలిగి ఉండాలన్నా, వయసు ప్రభావం కనిపించకుండా ఉండాలన్నా కూడా రోజు ఓ కమల పండు తింటే చాలు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగాల్ని నియంత్రించడంతో పాటు, వయసును మీద పడనివ్వవట.
మనం తొక్కతీసి తింటే.. అబ్బబ్బ పులుపు అని అంటుంటాం కదా! కానీ తొక్క తీయకుండా తినేవాళ్ళు కూడా ఉన్నారు. నేపాల్ కు వెళ్ళినపుడు కమలాలు తొక్కలు వొలచి తింటే వింతగా చూసే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ పండ్లను తొక్కలతో సహా తింటారట. స్విట్జర్లాండ్ వాసులైతే ఈ పండ్లను మీగడ, పంచదార అద్దుకొని మరీ ఇష్టంగా తింటారు. చైనీయులు దీన్ని "చైనీస్ యాపిల్ "అని, డచ్ వాళ్ళైతే "సినాస్ యాపిల్"అని ముద్దుగా పిలుచుకుంటారు.
కమలాలు ప్రతీ ఒక్కరికి మంచివే. కానీ రోజుకీ 3 కమలాలని మించి తినకూడదట. ఒక్కటైతే సరిపోతుందట. అలాగే భోజనానికి ముందు కానీ, ఖాళీ కడుపుతో కానీ ఈ పండ్లను అస్సలు తీసుకోకూడదట. ఎందుకంటే ఇందులోని ఆమ్లాలు పొట్టలోని గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని మరింత పెంచుతాయి. అలాగే పాలు తాగాక వెంటనే కమలాల జ్యూస్ తాగకూడదట. కనీసం గంట వ్యవధి ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే పాలలోని ప్రోటీన్లు కమలాలలోని ఆమ్లంతో కలిసి జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.
ఈ పండ్ల వలె ఉన్నా పుల్లగా ఉండే నారింజ పండ్లు వాడుకలో లేకపోయినా కూడా... ఔషధ పరంగా చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయట. ఈ నారింజ చెట్ల ఆకుల నుంచి తీసిన తైలంని సాఫ్ట్ డ్రింకులు, ఐస్ క్రీంలు, బేకరీ ఫుడ్స్ లలో వాడతారు. కొన్నిచోట్ల ఈ నారింజని కీళ్ళ నొప్పులకి ఔషదంగా కూడా వాడతారట. ఈ నారింజ ఆకుల్ని కషాయం కాచి కఫం, కడుపు నొప్పి వంటి వ్యాధులు తగ్గటానికి వాడతారట.
- రమ