హెన్నా పెట్టుకున్న తర్వాత జుట్టు పొడిబారిపోతోందా.. ఇలా చేస్తే చాలా మృదువుగా ఉంటుంది!

హెన్నా పెట్టుకున్న తర్వాత జుట్టు పొడిబారిపోతోందా.. ఇలా చేస్తే చాలా మృదువుగా ఉంటుంది!

 జుట్టుకు హెన్నా లేదా గోరింటాకు పెట్టుకోవడం ఈనాటి కాలం పాటిస్తున్న హెయిర్ కేర్ పద్దతి కాదు. అమ్మమ్మలు ఎన్నో ఏళ్లుగా తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెన్నాని లేదా గోరింటాకును వాడుతున్నారు. హెన్నా ఒక సహజ కండీషనర్‌లా పనిచేసి, జుట్టు పై పొరను బిగుతుగా చేసి, దానిని మృదువుగా, మెరిసేలా , పట్టులా చేస్తుంది. హెన్నా జుట్టుకు అందమైన రంగును కూడా ఇస్తుంది. హెన్నాని వాడటం వల్ల తెల్ల జుట్టును దాచడానికి కూడా సహాయపడుతుంది. హెన్నాకు చల్లదనాన్నిచ్చే గుణం ఉంది,  దానిని తలకు పట్టించడం వల్ల తల చర్మానికి వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. వేసవి కాలంలో హెన్నాని వాడటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కొందరిలో హెన్నా ఉపయోగించిన తర్వాత  జుట్టు చాలా పొడిగా మారుతుంది.  ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు హెన్నా పెట్టుకోవడం వల్ల జుట్టు పొడిగా ఎందుకు మారుతుంది?  తెలుసుకుంటే..

హెన్నా జుట్టును ఎందుకు పొడిగా చేస్తుంది?

తెల్ల జుట్టును కప్పిపుచ్చడానికి హెన్నా పెట్టుకోవడం చాలా ప్రయోజనకరం. హెన్నాలోని పదార్థాల మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. పదార్థాలు సరిగ్గా బాలెన్స్ గా లేకపోతే,  జుట్టు పొడిబారిపోతుంది. హెన్నాకు పెరుగు, కలబంద , ఉసిరికాయలను కలపాలి.

హెన్నా పెట్టుకునే సమయం..

చాలామంది హెన్నా పెట్టుకునేటప్పుడు తరచుగా పొరపాట్లు చేస్తుంటారు. హెన్నాను 8 నుండి 10 గంటల పాటు ఉంచుకోవడం వల్ల జుట్టు పొడిబారి, నిర్జీవంగా మారుతుంది. హెన్నాను  జుట్టుపై కేవలం 3 నుండి 4 గంటల పాటు మాత్రమే ఉంచుకోవాలి.

పరిశుభ్రత..

జిడ్డుగా లేదా చెమటగా ఉన్న జుట్టుకు హెన్నా పెట్టకూడదు. మురికి జుట్టుకు హెన్నా పెట్టడం చాలా పెద్ద తప్పు. హెన్నాను ఎల్లప్పుడూ శుభ్రమైన జుట్టుకే పెట్టాలి. ఈ తప్పులన్నీ చెడు ఫలితాలకు దారితీయవచ్చు. మొదటగా జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టు ఆరిన తర్వాత మరుసటి రోజు శుభ్రంగా ఉన్న జుట్టుకు హెన్నా పెట్టుకోవాలి.

కొబ్బరినూనె లేదా ఆముదం..

హెన్నా మిక్స్ తయారు చేసుకున్నప్పుడు అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆముదం అందులో కలపాలి.  ఇలా కలపడం వల్ల జుట్టుకు హెన్నా పెట్టుకున్న తర్వాత జుట్టు పొడిగా కాకుండా చాలా మృదువుగా ఉంటుంది.

పైన చెప్పుకున్న టిప్స్ పాటిస్తే.. జుట్టుకు హెన్నా పెట్టినా  జుట్టు పొడిబారదు. తెల్లజుట్టు కూడా చాలా బాగా కవర్ అవుతుంది.

                          *రూపశ్రీ.