Read more!

చుండ్రును ఇలా తరిమికొట్టండి!

చుండ్రును ఇలా తరిమికొట్టండి!

తల దువ్వగానే తెల్లగా పొట్టు పొట్టు రాలుతుంది. తల మొత్తం దురద, ఎక్కువగా దువ్వినా, గోకినా తలలో మెల్లగా మంట, దానికి తోడు పుండ్లు ఏర్పడటం, కుదుళ్లను బలహీనం చేయడం. వీటి కారణంగా జుట్టు రాలిపోవడం, జుట్టు రంగు మారడం ఇలాంటి కారణాలు ఎన్నో వస్తున్నాయి కేవలం చుండ్రు అనే ఒకే ఒక సమస్య వల్ల. ఇంతగా ఇబ్బంది పెట్టే చుండ్రు చలికాలంలో మరింత పెరుగుతుంది. చాలామందికి ఈ చలికాలంలో చుండ్రు విశ్వరూపం దాలుస్తుందని అనడంలో సందేహమే లేదు. అయితే ఈ చుండ్రును సులువుగా అధిగమించే ఉపాయాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే చుండ్రు చక్కగా పారిపోతుంది మీ నుండి.

జుట్టుకు నూనె పెట్టడం అందరూ చేస్తారు. అయితే చుండ్రు పోవాలంటే కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ మూడింటిలో ఏదో ఒక నూనెను కప్పులో  తీసుకుని దాన్ని వేడి చేసి తలకు బాగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసిన తరువాత ఒక మందం టవల్ తీసుకుని వేడి నీళ్లలో ముంచి పిండి, దాన్ని తలకు చుట్టెయ్యాలి. వేడి తగ్గిపోయిన తరుణం తలకు చుట్టిన టవల్ ను విప్పేయాలి. ఇలా కొన్ని రోజులు చేస్తుంటే తల చుండ్రు క్రమంగా తగ్గిపోతుంది.

తల చుండ్రుకు మరొక చక్కని పరిష్కారం కోడిగుడ్డు. కోడిగుడ్డులో ఉండే సొనను తలకు పట్టించి ఆ తరువాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే… కొన్ని వారాలలో క్రమంగా తలలో చుండ్రు తగ్గిపోతుంది.

కాసిన్ని వేడినీరు తీసుకుని అందులో కొబ్బరిపాలు, నిమ్మరసం వేయాలి. వాటిని బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తున్నా కూడా చుండ్రు తగ్గిపోతుంది.

తలలో చుండ్రు తగ్గించుకోవడానికి ఎన్ని మార్గాలు ఫాలో అయినా దానికి ఆహారం కూడా ఒక పరిష్కారంగా పనిచేస్తుంది. విటమిన్ బి, సి, ఇ లు పుష్కలంగా కలిగిన ఆహారాన్ని తీసుకుంటే తలలో చుండ్రును అరికట్టవచ్చు.

మెంతి ఆకు చుండ్రుకు చక్కని పరిష్కారం. మెంతి ఆకులను పేస్ట్ చేసి జుట్టుకు పట్టించి ఒక పావుగంట అలాగే ఉంచి, ఆ తరువాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే… చుండ్రు మెల్లగా తగ్గుముఖం పడుతుంది.

తల చుండ్రుకు మరొక శక్తివంతమైన టిప్ ఉంది. వేడినీటిలో వెనిగర్ వేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి రాత్రంతా అలాగే వదిలేయాలి. మరుసటిరోజు ఎగ్ ఆధారిత షాంపూ తో తల స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే చుండ్రు సమస్య పరిష్కరమవుతుంది. 

అన్నిటికంటే ముఖ్యంగా చుండ్రు ఉన్నవారు వాడే దువ్వెనలు, తువాళ్ళు, దిండు కవర్లు మొదలైనవి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని మారుస్తూ ఉండాలి.  జుట్టు చల్లగా ఉన్నట్టే దువ్వడం, జడ వేయడం వంటివి చేయకూడదు. ఇవన్నీ పాటిస్తూ పైన చిట్కాలు ఫాలో అయితే  చుండ్రును తగ్గించేసుకోవచ్చు.

                                      ◆నిశ్శబ్ద.