నవరాత్రుల భక్తి వెనుక ఆరోగ్యం.. ఆరోగ్యంగా అధిక బరువుకు చెక్ పెట్టేద్దాం.!
posted on Oct 14, 2023
నవరాత్రుల భక్తి వెనుక ఆరోగ్యం.. ఆరోగ్యంగా అధిక బరువుకు చెక్ పెట్టేద్దాం..
స్త్రీ పూజ్యునీయురాలు . భారతదేశంలో స్త్రీని దేవతగా భావిస్తారు. స్త్రీ శక్తిని చాటి చెప్పే కథలు, పండుగలు కూడా ఉన్నాయి. వాటిలో శరన్నవరాత్రులు ఎంతో ప్రాశస్త్యమైనవి. దేవి నవరాత్రులు అని, శరన్నవరాత్రులు అని, దసరా అని పిలుచుకునే ఈ పండుగ సందర్భంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు. భక్తితో అటు దైవ కృపకు పాత్రులు కావడం, ఇటు ఫిట్ గా మారడం మహిళల చేతుల్లోనే ఉంది.
చాలామంది నవరాత్రుల సందర్బంగా ఉపవాసాలు ఉంటారు. అధిక బరువు కలిగిన వారికి ఈ నవరాత్రులు మంచి అవకాశం. భక్తి వెనుక భయం కూడా ఉంటుంది. కాబట్టి సాధారణ సమయాల్లో నోరుకట్టేసుకుని బాధపడుతూ మధ్యలో కాంప్రమైజ్ అయ్యేవారు దేవుడి ముందు భక్తితో ఉపవాసం పాటిస్తారు. నవరాత్రుల ఉపవాసంలో పండ్లు ఎక్కువగా తీసుకుంటారు. అయితే, పండ్ల పేరుతో చాలామంది ఫ్రూట్స్ కలిపిన పాయసం, నైవేద్యం పేరుతో పూరీ, బూరెలు, కేసరి, డ్రైఫ్రూట్స్, పనీర్ వంటివి తింటారు. వీటి వల్ల కేలోరీలు బాగా శరీరంలోకి వెళతాయి. అలా కాకుండా బరువు పెరగకుండా రోజులో ఒకపూట మాత్రమే తినే ఆహారం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం కింది టిప్స్ పాటించాలి.
ఏ వంటకం చేసినా దాన్ని వేయించడం మానుకోవాలి. ఆవిరి మీద ఉడికించినవి తీసుకోవాలి.
చక్కెరకు బదులుగా ఇతర చక్కెర ప్రత్యామ్నాయాలను ఉపయోగించండి. మిశ్రి(కండచక్కెర), బెల్లం, తేనే, ఎండు ద్రాక్ష మొదలైనవి తీపిని ఇస్తాయి.
సగ్గుబియ్యం, మఖనా, బరువు ఉండవు కాబట్టి బరువు పెరగం అనుకుంటారు. కానీ ఇవి అధిక కేలరీల ఆహారాలు, ఇవి బరువును పెంచుతాయి. వాటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి.
డ్రై ఫ్రూట్స్‌కు బదులుగా మొత్తం పండ్లను తినాలి. బరువు తగ్గడానికి తాజా పండ్లను బీట్ చేసే డైట్ లేనే లేదు.
వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు.
ఉపవాస సమయంలో రోజంతా వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి.
పాల ఉత్పత్తులు కొందరు జీర్ణించుకోలేరు. అలాంటి వారు పాల ఉత్పత్తును తినకపోవడం మంచిది. దీనికి బదులుగా వెజిటేరియన్ ప్రోటిన్ పౌడర్ ఉపయోగించవచ్చు.
ఉపవాసం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు. అది ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యామోహాన్ని తగ్గిస్తుంది. చాలామంది దేవుడి పేరుతో బాగా వండుకుని తింటారు. కానీ అది తప్పు. ఆ భావన వదలకపోతే శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ ప్రశ్నార్థకమే అవుతాయి. పండుగ ముగిసేసరికి మరింత బరువు పెరుగుతారు.
*నిశ్శబ్ద.