Spinach is Best Medicine for Everyone
posted on Oct 13, 2012
Spinach is Best Medicine for Everyone
ఔషధాల ఆకుకూర -పాలకూర
కూరగాయల్లో ప్రతి ఒక్కదానిలో కొన్ని ప్రత్యేక పోషకాలుంటాయి. ముఖ్యంగా ఆకుకూరల్లో పోషకాల శాతం అధికం. పాలకూర గురించి చెప్పాలంటే ప్రత్యేక విశేషమే. ఇందులో ఆరోగ్యపరంగా, ఔషధపరంగా ఎన్నో సుగుణాలున్నాయి.
* గర్భిణీలకు: పాలకూరలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. గర్భవతులు, శిశువులకు పాలిచ్చే తల్లులకు ఇది మంచి పోషకాహారం. ఫోలిక్‌యాసిడ్ లోపం కారణంగా గర్భవతుల్లో కనిపించే మెగలోబ్లాస్టిక్ ఎనీమియా వ్యాధిని పాలకూరతో దూరంగా ఉంచవచ్చు. ఫోలిక్‌యాసిడ్ గర్భంలో శిశువు ఎదుగుదలకు సహకరిస్తుంది. అందుకని గర్భిణులు ఆహారంలో ప్రతిరోజూ పాలకూరను తీసుకోవడం వల్ల శిశువు జనన లోపాలను అరికట్టవచ్చు. అంటే గర్భస్రావం, రక్తస్రావం, అలసట, శ్వాస సరిగా ఆడకపోవడం, బరువుతగ్గడం, డయేరియా తదితర సమస్యలకు పాలకూర మంచి పరిష్కారం.
* మలబద్దకం: పాలకూర రసం జీర్ణకోశంలో ఉన్న చెడును శుభ్రపరుస్తుంది. అంతేకాదు పేగులను ఉత్తేజపరుస్తుంది.
* శ్వాసకోశవ్యాధులు: తాజా పాలకూర ఆకులకు రెండు చెంచాల మెంతులు, చిటికెడు అమ్మోనియం క్లోరైడ్, తేనె కలిపి జ్యూస్‌లా చేసుకోవాలి. బ్రాంకైటిస్, టీబీ, ఆస్త్మా, పొడిదగ్గు మొదలైన వాటికి ఇది ఒక చక్కని నివారణగా పనిచేస్తుంది. 30ఎమ్ఎల్ మందును రోజుకి మూడుసార్లు చొప్పున తీసుకోవచ్చు.
* ఎనీమియా: పాలకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో హిమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాలు పెరుగుదలకు ఇది తోడ్పడుతుంది. రక్తాన్ని మంచిగా వృద్ధిచేసి ఎనీమియా బారిన పడకుండా పాలకూర సర్వదా సంరక్షిస్తుంది. పాలకూరలో మిగతా అన్నింటికంటే ఎ-విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్య పెరుగుదలకు ఉపకరిస్తుంది. ముఖ్యంగా కళ్లను కాపాడుతుంది. రాత్రిపూట కనిపించే రేచీకటి సమస్య రాకుండా కాపాడడానికి పాలకూర ఒక మంచి పరిష్కారం.
* దంత సమస్యలు: పాలకూర రసం పంటిచిగుళ్లను దృఢ తరం చేస్తుంది. పంటి చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే ప్రతిరోజూ పాలకూర- క్యారెట్ జ్యూస్‌ని కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* మూత్రాశయ సమస్యలు: పాలకూర రసానికి కొబ్బరినీళ్లు కలుపుకుని రోజుకి రెండుసార్లు తాగడం వల్ల మూత్రం ధారాళంగా వస్తుంది. ఇంకా ఏముంది! పాలకూరలో క్యాల్షియం, ఆల్కాలిన్ ఎలిమెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణజాలాన్ని శుభ్రంగా ఉంచడంలోనూ రక్తంలో ఉన్న ఆల్కాలిన్‌ను నిలబెట్టడంలోనూ తోడ్పడతాయి. జీర్ణాశయంలో యాసిడ్లు ఎక్కువగా ఉత్పత్తి అవడానికి కారణమయ్యే ఎన్నో రకాల వ్యాధులను అడ్డుకునే శక్తి పాలకూరలో ఉంది.