Read more!

ఆకుకూరలతో జుట్టుకు పోషణ

ఆకుకూరలతో జుట్టుకు పోషణ

ఆకుకూరలు ఒంటికే కాదు జుట్టుకు కూడా చాల మంచివి. వాటితో జుట్టుకూ నిగారింపు ఇవ్వొచ్చు. చుండ్రు, జుట్టురాలడం తగ్గించుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
 

ఒక కప్పు పొనగంటి కూర, ఒక కప్పు గోరింటాకుపొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది.


చుక్కకూర ఒక కప్పు, గోరింటాకు పొడి కప్పు, రెండు స్పూన్‌ల ముల్తాన్ మట్టీ, కప్పు పెరుగు బాగా కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టు నిగనిగలాడడమే కాదు, చుండ్రు బాధ నుంచి దూరమవ్వచ్చు.


మజ్జిగలో చింతచిగురు, గోరింటాకుపొడి ఒక్కొక్క కప్పు తీసుకొని దాంట్లో అరకప్పు శనగపిండిని కలపాలి. దాన్ని మాడకు పట్టించాలి. 20నిమిషాల తర్వాత తలను కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌లా పనిచేస్తుంది. అయితే ఈ మిశ్రమాన్ని పెట్టుకునే ముందు తలకు నూనె పెట్టుకోవాలి.


ముందు తలకు నూనె పెట్టుకొని మర్దనా చేయాలి. ఇప్పుడు అవిసె ఆకులు రెండు కప్పులు, గోరింటాకు కప్పు, ఉసిరిపొడి అరకప్పు వేసి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇది వేడిని దూరం చేస్తుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు బాధ కూడా తగ్గుతుంది.


గోరింటాకు పొడిలో ఒక స్పూన్ లవంగాలపొడి, కప్పు డికాషన్, కోడిగుడ్డు, కొంచెం పెరుగు, ఒక స్పూన్ ఆముదం నూనె కలిపి తలకు పెట్టుకోవాలి. 20నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఆ తర్వాత నూనె రాసి మర్దనా చేసుకోవాలి. దీనివల్ల తెల్ల జుట్టు మంచి రంగు వస్తుంది. అంతేకాదు, జుట్టు రాలకుండా ఉంటుంది.