మహిళల్లో జుట్టు ఏ కండిషన్ లో ఉంటే ఏ సమస్య ఉన్నట్టో తెలుసా?

మహిళల్లో జుట్టు ఏ కండిషన్ లో ఉంటే ఏ సమస్య ఉన్నట్టో తెలుసా?

ఇప్పటి కాలంలో మహిళల ఆరోగ్యం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. నెలసరి సమస్యల నుండి ఎన్నో రకాల జబ్బులు మహిళలను చుట్టుముడుతున్నాయి. ఇవన్నీ మహిళలను బలహీనంగా మారుస్తాయి. కొన్ని సార్లు తాము అనారోగ్యంతో ఉన్నామనే విషయం కూడా మహిళలు స్వతహాగా గుర్తించలేరు. చాలా చిన్నవే.. అనే నిర్లక్ష్యంతో కొన్ని దాటవేస్తుంటారు. చాలామంది వైద్యులు మహిళలు ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుని, అన్ని రకాల పరీక్షలు చేయించడం ఉత్తమం అని అంటుంటారు. కానీ అందరికీ ఆర్థిక పరిస్థితులు సరిపడినట్టు ఉండవు. చాలామంది జుట్టు,  చేతి గోర్ల కండిషన్ ను బట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చో చెప్పచ్చంటున్నారు. ముఖ్యంగా జుట్టు కండిషన్ ఎలా ఉంది?? ఎంత మొత్తంలో రాలిపోతోంది అనే దాన్ని బట్టి ఏ ఆరోగ్య సమస్యలు ఉండొచ్చో గెస్ చేయవచ్చట. ఇంతకూ జుట్టు ఏ కండిషన్ లో ఉంటే ఏ సమస్యలు ఉన్నట్టో తెలుసుకుంటే..

జుట్టు రాలడం..

ఇది చాలా సాధారణ సమస్య. సాధారణంగా తల స్నానం తరువాత   100 వెంట్రుకల వరకు రాలిపోతుంది, ఈ నష్టం తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం. పోషకాహార లోపాలు ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి.  ఈ క్రమంలో వైద్యుడిని సంప్రదిస్తే థైరాయిడ్, రక్తహీనతతో పాటు విటమిన్ డి లోపంతో సహా కొన్ని విటమిన్, ఖనిజ లోపాలను గుర్తించే పరీక్షలు చేయవచ్చు..

పెళుసుదనం …

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..  కొంత తేమ అవసరం. ముఖ్యంగా పెళుసుగా ఉండే జుట్టు  జింక్ మరియు, ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. జింక్ ఐరన్ లేకపోవడం జుట్టు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే కెరాటిన్ ఏర్పడటానికి ఈ పోషకాలు అవసరం. ఐరన్, జింక్ ను ఆహారం నుండి అయినా లేదా సప్లిమెంట్స్ ద్వారా అయినా సరిపడినంత తీసుకోవడం మంచిది. 

 బూడిద జుట్టు

దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల DNA దెబ్బతింటుంది. ఇది  వెంట్రుకల కుదుళ్లలో వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాల సంఖ్యను తగ్గిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. జుట్టు రాలడం అనే సమస్య ఒత్తిడి వల్ల కూడా సంభవిస్తుంది. అయితే జుట్టు నెరవడం జన్యువుల వల్ల కూడా సంభవిస్తుంది. చాలామందిలో ఇది వంశపరంపర్యంగా వస్తూంటుంది.

జుట్టు పొడిబారడం 

ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు మృదువుగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్య కరమైన కొవ్వులు లోపిస్తే..  జుట్టంతా పొడిబారిపోయి పీచులాగా కనిపిస్తుంది. శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు లోపిస్తున్నాయనే దానికి ఇది చక్కని సూచన. ఆహారంలో అవకాడో, ఆలివ్ ఆయిల్ సాల్మన్ ఫిష్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండే పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిచవచ్చు.  

చుండ్రు

చుండ్రు జుట్టులో పొట్టు పొట్టుగా ఏర్పడే ఒకానొక సమస్య. ఇది పసుపు లేదా తెలుపు రంగులో ఉంటుంది. చుండ్రు సరైన విధంగా ప్రయత్నం చేస్తే తొందరగానే తగ్గిపోతుంది. సెబోర్హెయిక్ డెర్మటైటిస్ ఎరుపు, జిడ్డుగల చర్మంతో ఉంటుంది, ఇది తెల్లటి లేదా పసుపు రంగు పొలుసులతో కప్పబడి ఉంటుంది. మలాసెజియా, ఈస్ట్ లాంటి శిలీంధ్రం జుట్టు కుదుళ్లలో ఏర్పడటం వల్ల ఈ సమస్య వస్తుంది. జుట్టు పొడిబారడం ఈ సమస్యకు కారణం కావచ్చు. 

 ఈ విధంగా జుట్టు కండిషన్ ను బట్టి శరీర స్థితిని కూడా తెలుసుకోవచ్చు.

                                 ◆నిశ్శబ్ద.