ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఈ పండు ఇవ్వకండి..ఎందుకంటే!
posted on Feb 8, 2024
ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఈ పండు ఇవ్వకండి.. ఎందుకంటే!
పండ్లు పిల్లలకు, పెద్దలకు కూడా చక్కని ఆరోగ్యం చేకూరుస్తాయి. రోజువారి ఆహారంలో పండ్ల ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. పిల్లలకి చిన్నప్పటి నుండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తుంటే పిల్లలు పెరిగేకొద్ది బాగుంటారు. అయితే ఆరోగ్యం అనే అపోహలో కొందరు పిల్లలకు ఇవ్వకూడని ఆహారం ఇస్తుంటారు. పండ్లన్నీ ఆరోగ్యకరమైనవని, వాటివల్ల నష్టం ఉండదని అనుకునే అమాయకులు ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ పిల్లలకు ఇవ్వకూడని ఆహారాల గురించి తెలుసుకోవాలి. ఇంగ్లీష్ లో గ్రేప్ ఫ్రూట్ అని, తెలుగులో పంపరపనస అని అంటారు. బత్తాయిపండులాగా పెద్దగానూ, పనసపండులా లోపన తొనల్లానూ ఉండే ఈ పండు తెలుపు, పింక్ రంగులలో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ఈ పిల్లలకు ఇవ్వడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అసలు పిల్లలకు ఈ పండును ఎప్పుడు, ఎంత ఇవ్వాలనే విషయాన్ని తెలుసుకుంటే..
పంపరపనస ఒక నిమ్మజాతికి చెందిన పండు. సాధారణంగా సిట్రస్ పండ్లను 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తినిపించవద్దని సలహా ఇస్తారు. ఎందుకంటే అవి ఆమ్లంగా ఉంటాయి. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి వారి చర్మం పై దద్దుర్లు కలిగిస్తాయి. అయితే, 6 నెలల తర్వాత శిశువైద్యుని సలహా మేరకు పిల్లల ఆహారంలో పంపరపనసను చేర్చవచ్చు.
పిల్లల వైద్యుల ప్రకారం పిల్లలు కాల్షియం తీసుకోవడానికి ఇబ్బంది పెడతారు. దీనికారణంగా పిల్లలకు కాల్షియం కోసం సిసాప్రైడ్, సైక్లోస్పోరిన్ వంటి కొన్ని మందులు ఇస్తుంటారు. ఈ మందులు పిల్లలకు వాడుతుంటే మాత్రం పంపరపనస పండు ఇవ్వకూడదు. దీన్ని తినడం వల్ల ఔషధం శరీరంలో ఇమిడిపోవడం, జీర్ణక్రియ, దానివల్ల కలగాల్సిన ఫలితాలు ప్రభావితం అవుతాయి.పిల్లలకు ఏ మందు వాడుతున్నా ఈ పండు ఇచ్చేముందు శిశువైద్యుల సలహా తీసుకోవాలి.
పంపరపనస గుజ్జులో విటమిన్లు ఎ, సి, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అదనంగా ఇది లైకోపీన్, నరింగిన్ వంటి అనేక ఫైటోకెమికల్స్‌ను కూడా కలిగి ఉంటుంది. తగినంత పోషకాహారం కోసం పిల్లల సమతుల్య ఆహారంలో ఈ పండును కొద్దిమొత్తంలో వైద్యుల సలహాతో చేర్చవచ్చు. ఇందులో అధిక మొత్తంలో నీరు, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి, ఇవి చిన్నపిల్లలను డీహైడ్రేషన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.
ఈ పండులో గణనీయమైన మొత్తంలో నీరు, డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది పిల్లల ప్రేగులను చురుకుగా ఉంచడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో ఫాలిఫినాల్స్, ఫ్లేవనోన్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా ఉంటాయి. ఇవి గట్ మైక్రోబయోటాను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. కానీ శిశువైద్యుల ప్రకారం ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పండ్ల రసం కూడా ఇవ్వడం మంచిది కాదు. పంపరపనస పండు రసంతో ఇతర పండ్ల రసాలు ఇవ్వకూడదు. రసం కంటే పండ్లు ఎక్కువ పోషకాహారాన్ని అందిస్తాయి. అంతే కాకుండా జ్యూస్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల పళ్లలో క్యావిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఇస్తే విరేచనాలు కావచ్చు. కాబట్టి ఒక సంవత్సరం లోపు పిల్లలకు పండ్ల రసాన్ని, పంపరపనసను అస్సలు ఇవ్వకూడదు.
*నిశ్శబ్ద.