పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు ఈ తప్పులు చెయ్యకండి..!
posted on Aug 10, 2024
పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు ఈ తప్పులు చెయ్యకండి..!
ప్రతి మనిషికి ఆహారమే శక్తి వనరు. అయితే వయసుకు తగిన ఆహారం తీసుకోవాలని వైద్యులు, పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లలు ఆహారం తినడంలో చాలా గోల చేస్తారు. ఈ కారణంగా వారికి పోషకాహారం అందించడం కష్టమవుతుంది. పోషకాహారం అందకపోతే ఎదుగుదలలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కారణంగానే చాలా మంది తల్లులు తమ పిల్లలకు బలవంతంగా అయినా సరే ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇలా బలవంతంగా ఆహారం తినిపించడం చాలా ప్రమాదమని చిన్న పిల్లల వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.
పిల్లలకు బలవంతంగా ఆహారం తినిపిస్తే ఏం జరుగుతుందంటే..
పిల్లలకు 4-5 సంవత్సరాలు వచ్చినా సరే సరిగా ఆహారం తీసుకోకుంటే వారిని తిట్టడం, కొట్టడం, ప్రలోభపెట్టడం వంటివి చేసి ఆహారం పెడుతుంటారు. ఇలా చేస్తే పిల్లలు విసిగిపోతారు. కొన్నిసార్లు ఆకలి ఉన్నా సరే పిల్లలు తినడానికి ఇష్టపడరు. వారికి ఆహారం మీద ఆసక్తి తగ్గిపోవడానికి దారితీస్తుంది.
పిల్లలకు బలవంతంగా ఆహారం తినిపిస్తే అది వారి జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. బలవంతంగా ఆహారం పెట్టేటప్పుడు పిల్లలు ఆహారాన్ని నమలకుండా ముద్దలు ముద్దలుగా అలాగే మింగుతారు. దీనివల్ల ఆహారం సరిగా అరగదు. జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.
తల్లిదండ్రులు బలవంతంగా పిల్లలకు ఆహారం పెట్టే అలవాటును అనుసరిస్తే పిల్లలు తల్లిదండ్రులన్నా, ఆహారం అన్నా భయపడతారు. తల్లిదండ్రులను చూసినా, ఆహారాన్ని చూసినా పారిపోతారు. ఇది పిల్లలలో పోషకాహార లోపానికి, వారిలో మొండి వైఖరికి దారితీస్తుంది.
పిల్లలకు కడుపు నిండినప్పుడు, ఆహారం మీద ఆసక్తి లేనప్పుడు వారు ఆహారం తినడానికి వ్యతిరేకిస్తారు. ఇలాంటి సందర్బాలలో తల్లిదండ్రులు అతి ప్రేమ కొద్ది ఆహారాన్ని ఇంకా బలవంతంగా పెట్టడం వల్ల పిల్లలు అతిగా తిని బరువు పెరుగుతారు. ఏ తల్లి తమ పిల్లలు ఎక్కువ తింటున్నారు అనే ఆలోచనలోకి వెళ్ళదు. కాబట్టి ఎవరూ దీన్ని అర్థం చేసుకోరు. కానీ అతిగా తినిపించడం వల్ల పిల్లలు బరువు పెరిగి చిన్నతనంలోనే ఊబకాయం రావడానికి కారణం అవుతుంది.
పిల్లలకు ఆహారం ఎలా ఇవ్వాలంటే..
పిల్లల కోసం చేసిన ఆహార పదార్థాలు అన్నీ ఒకేసారి తినిపించకూడదు. మొదటిసారి పిల్లలను కన్న తల్లులు పిల్లలకు ఆహారం సరిపోతుందో లేదోననే సందేహంతో ఏదో ఒకటి పిల్లలకు తినిపిస్తుంటారు. కానీ కొద్ది కొద్దిగా పిల్లలు ఆసక్తి చూపినప్పుడు ఆహారం ఇస్తే వారు విసుగు లేకుండా తింటారు.
తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల ముందు పద్దతిగా కూర్చుని ఆహారం తినాలి. తినేటప్పుడు పోన్ లో మాట్లాడటం, టీవి చూడటం ఆపి పిల్లలతో కబుర్లు చెబుతూ తినాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులతో కబుర్లు చెబుతూ ఆహారం తినేయడానికి అలవాటు పడతారు.
పిల్లలు ఒకే రకమైన ఆహారం అంటే విసుగు చెందుతారు. ఆరోగ్యకరమైన పద్దతిలో విబిన్నంగా ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించాలి. పిల్లలను ఆకర్షించాలి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఆసక్తిగా తింటారు.
*రూపశ్రీ.