పిల్లల్లో డిప్రెషన్..గుర్తించటం ఎలా!
posted on Nov 16, 2024
పిల్లల్లో డిప్రెషన్.. గుర్తించటం ఎలా!
1. ‘డిప్రెషన్’ ఈ మధ్యకాలంలో తరచూ అందరిదగ్గర మనకి వినిపిస్తున్న మాట ఇది. ఈ డిప్రెషన్ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోలేక, లోలోపలే కుమిలి పోయే, ఒకలాంటి అయోమయ స్థితికి తీసుకువెళుతుంది ఎవరినైనా. ఏ వయసువారినైనా ఈ డిప్రెషన్ చుట్టుముట్టచ్చు. కాస్త పెద్దవాళ్లకయితే తామున్న స్థితి గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. దాని నుంచి బయట పడటానికి కనీసం ప్రయత్నమైనా చేయగలుగుతారు. కానీ పిల్లలు అలా కాదు. అసలు తమకి ఏమవుతుందో కూడా అర్థం చేసుకోలేని వయసు వారిది. కాబట్టి పిల్లల విషయంలో మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
2. పిల్లలోని డిప్రెషన్‌ను సరైన సమయంలో గుర్తించకపోతే, పిల్లల వికాసాన్ని చేజేతులారా మనమే అడ్డుకున్న వాళ్ళమవుతాం అంటున్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డా॥ గౌరీదేవిగారు. డిప్రెషన్‌తో ఉండే పిల్లల లక్షణాలు ఇలా వుంటాయంటూ కొన్ని లక్షణాలని తెలియచేస్తున్నారు. అవి ఏంటంటే ఎప్పుడు చూసినా దిగులుగా ఉండటం, ప్రతీ విషయానికి పేచీ పెట్టి ఏడవటం, ఎక్కువగా భయపడటం, ఆటపాటల పట్ల కూడా ఉత్సాహం చూపకపోవటం, అమ్మ కొంగుపట్టుకునే తిరగటం, ఎప్పుడూ ఏదో ఒక నొప్పి ఉందంటూ చెబుతుండటం, ఆహారంపట్ల ఎక్కువ ఇష్టం ఇష్టం చూపించటం, లేదా అస్సలు ఇష్టపడకపోవటం ఇలా సాధారణ స్థితికి భిన్నంగా ఉండే లక్షణాలు కనిపిస్తాయట.
3. పిల్లలోని డిప్రెషన్‌ను గుర్తించటం ఎలాగో చెప్పుకుంటున్నాం కద.. అసలు ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుందీ అన్న దానికీ పరిశోధకులు చెబుతున్న కారణం ‘మొదడులో డోపమిన్, సిరోటానిన్ అనే పదార్ధాల ప్రమాణం ఎక్కువ, తక్కువ అవడం వల్ల డిప్రెషన్‌కు లోనవుతారట.’ అలాగే చిన్నప్పుడు బాధాకర అనుభవాలు కూడా డిప్రెషన్‌ను కలుగచేస్తాయట. కుటుంబంలోని తల్లిదండ్రుల పోట్లాటలు, స్కూలు టీచర్లు, తోటివారి ప్రవర్తన వంటివి కూడా పిల్లల్లో డిప్రెషన్‌కు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.
4. పిల్లలో అసహజ లక్షణాలు అంటే కోపం, భయం, వంటివి కనిపిస్తే ‘ఎందుకు’! అంటూ తల్లిదండ్రులుపిల్లల్ని అరిచి, తిట్టి, హేళన చేస్తుంటారు. అది వారిని మరింత కృంగదీస్తుంది. కాబట్టి పిల్లల్లో అసహజ లక్షణాలు కనిపిస్తే కారణం ఏమైవుంటుంది అని ఆలోచించి, వారిని ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకురావటానికి ప్రయత్నించాలి అంటున్నారు నిపుణులు.
5. మన ప్రయత్నాలేవి ఫలించనపుడు మానసిక వైద్యులను సంప్రదించటానికి సంకోచించకూడదు. డిప్రెషన్ అనేది ఒక మానసిక స్థితి అంటే.. తగిన సమయంలో గుర్తించి స్పందిస్తే పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు అంటున్న నిపుణుల సూచనలు పిల్లల చిన్న ప్రపంచాన్ని సంతోషంతో నింపటానికి సహాయపడతాయి.
- రమ