పిల్లల మనసుని మార్చే రంగులు!
posted on Mar 22, 2024
పిల్లల మనసుని మార్చే రంగులు!
రంగుల ప్రభావం మన మనసుపై పడుతుందంటే నమ్మసక్యంగా లేదు కదూ, కాని ఇది అక్షరాల నిజమని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. మనం పిల్లల గదికి వేసే రంగుల ప్రభావం వారి మీద చాలా ఉంటుందిట. ముభావంగా ఉండే పిల్లల్లో హుషారుని నింపాలన్నా, హైపెరాక్టివ్ పిల్లల్ని కుదురుగా కూర్చోబెట్టాలన్నా ప్రత్యేకమైన రంగులు ఉపయోగిస్తే చాలట. వారి ప్రవర్తనా విధానంలో మెల్లిగా మార్పులు చేసుకుంటాయట. ఇది వింటే కాస్త కొత్తగా అనిపిస్తున్నా దీనికి సంబంధించి పిల్లలపై చేసిన పరిశోధనలు మంచి ఫలితాలని ఇచ్చాయని నొక్కి చెప్తున్నారు శాస్త్రజ్ఞులు.
మరి మీ పిల్లల మనస్తత్వానికి ఎలాంటి రంగు ఎక్కువగా వాడాలో ఎంచుకోండి. ఇంటిలో వాళ్ళ రూమ్ కి వేసే కలర్, వాళ్ళ స్కూల్ బ్యాగ్ కలర్, వాళ్ళు వేసుకునే బట్టల కలర్ ఇలాంటి వాటికి ఏ సమయంలో ఎలాంటివి ఎంచుకోవాలో ఒక నిర్ణయానికి రావచ్చు.
* రెడ్ కలర్ - ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకుండా నలుగురిలో కలవటానికి ఇబ్బంది పడే పిల్లల రూం కి ఎరుపు రంగు వేస్తె వాళ్ళల్లో హుషారు పెరుగుతుందట ఎందుకంటే ఎరుపు మనిషి మెదడులో రక్త ప్రసరణ త్వరగా జరిగేలా చేస్తుందిట. అదే హైపెరాక్టివ్ పిల్లల రూంలో ఎరుపు రంగు వేస్తే గనక ఇక వాళ్ళని ఆపటం ఎవరితరము కాదు. వాళ్ళ హుషారు రెండింతలు పెరిగి చదువు మీద ధ్యాస తగ్గి ప్రవర్తనలో విపరీతధోరణులు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్తంత జాగ్రత్త సుమా.
* ఆరంజ్ కలర్ - పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచగల శక్తి ఈ నారింజ రంగుకి ఉందట. ఎవరి మీదా ఆధారపడకుండా వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించటానికి దోహదపడుతుందట. అన్నివిషయాలలో పిల్లలు మీ మీద ఆధారపడుతుంటే మీరు ఈ రంగుని ఎంచుకోవచ్చు.
* గ్రీన్ కలర్ - పిల్లల్లో కాన్సంట్రేషన్ పెరగడానికి ఈ రంగు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. వారిలో చదువుపట్ల ఆసక్తిని కూడా పెంపొందిస్తుందట. వాళ్ళల్లో ఉన్న యంగ్జైటి తగ్గి వాళ్ళని ఎప్పుడూ కూల్ గా ఉంచుతుంది కూడా.
* బ్లూ కలర్ - ఎరుపు రంగుకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది ఈ నీలం రంగు. అది మెదడులోని రక్త ప్రసరణని రెట్టింపు చేసి గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తే ఈ నీలం రంగు పిల్లల మెదడు చాలా ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని.నిద్రకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా అవి కూడా దూరమయ్యి హాయిగా నిద్రపడుతుందట కూడా. హైపేరాక్టివ్నెస్ ఎక్కువగా ఉండే పిల్లల కోసం ఎక్కువగా ఈ రంగుని ఎంచుకున్నట్లయితే వారిలో దూకుడు స్వభావం తగ్గుతుందని చెప్తున్నారు.
* ఎల్లో కలర్ - పిల్లల్లో ఏకాగ్రత పెరగటానికి పసుపు రంగు ఉపయోగపడుతుందట. వారు స్థిరంగా కూర్చుని చదవాలన్నా లేడిన ఏదైనా పని కుదురుగా చేయాలన్నా ఈ రంగుని ఎంచుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు నిపుణులు.
ఇలా రంగులు మనిషి పైన వాటి ప్రభావాన్ని చూపిస్తాయని ఎన్నో అధ్యయనాలు రుజువు చేసాయి. రంగుల పట్ల కాస్తంత అవగాహన ఉంటే చాలు మన పిల్లల మనసుని మనం సునాయాసంగా మార్చుకుని హ్యాపీ గా ఉండచ్చు. కేవలం గదికి వేసే రంగులే కాదు వారి కోసం వాడే ప్రతి వస్తువుని సరిపడే రంగులలో మనం ఎంచుకున్నట్లయితే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడరు మనని ఇబ్బంది పెట్టరు.
- కళ్యాణి