వింటర్ బెల్స్ పొరపాట్లు…. అగచాట్లు…
posted on Dec 23, 2024
వింటర్ బెల్స్ పొరపాట్లు…. అగచాట్లు…
చలి వణికిస్తోంది. ఉదయం మధ్యాహ్నం అనే తేడా లేదు. బయట అంతా టెంపరేచర్ నార్మల్ గా ఉంటుంది. కానీ వెచ్చగా ఉంటుంది కదా అని గదులలో దూరితే అక్కడే చెడినట్టు చల్లని వణుకు శరీరాన్ని కుదిపేస్తుంది. దీనికి తోడు కొందరి ఉద్యోగస్తులకు నరకమే… ఏసీ ల కింద కూర్చుని పనిచేయడం శరీరాన్ని క్షోభ పెట్టుకుంటూ వృత్తిని నిర్వహించడం లాంటిది. ఈ చలిని భరించాలని మనం ఎంత గట్టిగా ఉన్నా, ఆ చలిని భరిస్తూ పనులలో నిమగ్నం అయినా అది చేసే పని చేసేసి పాలు తాగేసిన పిల్లిగా మెల్లగా వెళ్ళిపోతుంది. అయితే గిన్నెలో పాలు అయిపోయినట్టు, మన శరీర చర్మం మీద ఉండే కళ మొత్తం హుష్ కాకి అయిపోతుంది. శరీరాన్ని కప్పి ఉంచే చర్మానికి మనం బట్టలు వేసుకుని నాగరికులు అయితే… ఇప్పుడు మళ్లీ ఇంకొన్ని ఎగస్ట్రా దుస్తులను జత చేసుకోవాలి. అంతేనా చలి పులి పంజా విసిరితే… తప్పించుకునే లేడి పిల్లలా లేడీస్ గెంతులు వేయక తప్పదు. ఆడవారిలో చాలమందికి పొడి చర్మం, సున్నితమైన చర్మం ఉంటుంది. ఈ రెండు రకాలు చలికి, ఎండకు చాలా తొందరగా ప్రభావవంతం అవుతాయి.
చర్మానికి తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి మాత్రమే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే గిలి పెట్టే ఈ చలి సమయాల్లో చేయకూడనివి ఏంటో తెలుసుకోవాలి.
వామ్మో వేడి వద్దు…
చలికి వేడి నీటి స్నానం చేస్తుంటే ఆహా ఎంత బాగుంటుందో… వేడి నీళ్లు అలా పోసుకుంటూ ఉంటే బాత్రూమ్ నుండి బయటకు కూడా రాబుద్ది కాదు. అయితే కొంతమంది చలి ఎక్కువగా ఉంది కదా అనే ఆలోచనతో బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తుంటారు. చలికి ఎలాగో పగిలిపోయి ఎఫెక్ట్ కి గురయి ఉంటుంది చర్మం.అలాంటి చర్మానికి చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తే చర్మం ఇంకా ఎక్కువ పాడైపోయి కొలుకోవడానికి చాలా సమయం తీసుకునేలా మారిపోతుంది. అందుకే స్నానానికి ఎక్కువ వేడిగా ఉన్న నీటిని వాడొద్దు, గోరువెచ్చగా ఉన్న నీరు అన్ని కాలాలలోనూ శ్రేష్టం.
చల్లచల్లగా…. ఒళ్ళు గుల్ల అవ్వుద్ది…
చాలామందికి ice cream, కూల్ డ్రింక్ లాంటివి తీసుకోవడం ఇష్టం. వర్షం పడుతున్నప్పుడు ice cream తింటే.. అని కొందరు వెర్రిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ చలి కాలంలో చల్లటి పదార్థాలు తీసుకోవడమే కాదు, చల్లబడిన ఆహారం తీసుకోవడం కూడా సమస్యే…. చల్లగా ఉన్న ఆహారం జీర్ణం కావడానికి, వేడిగా ఉన్న ఆహారం జీర్ణం కావడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. చల్ల ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. అందుకే వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగని మరీ పొగలు కక్కుతున్న తిండి తినకూడదు.
వాటర్ బెల్స్….
చలికి నీరు ఎక్కువ తాగబుద్దేయదు. మరీ ముఖ్యంగా ఏసీ గదుల్లో పనులు చేసేవారు అప్పటికే వణుకుతూ మొండిగా పనిలో లీనమవుతారు. బాటల్స్ లో నీరు పక్కన పెట్టుకున్న కొద్దిసేపటికే అవి ఫ్రిజ్ లో నుండి బయటకు తీసినట్టు చల్లగా అయిపోతాయి. దాంతో నీటిని గొంతులో పోసుకోవాలంటే మహా చిరాకుగా ఉంటుంది. కానీ నీటిని స్కిప్ చేయడం ఈ చలి కాలంలో చాలా ప్రమాదకరమైన చర్య అని గమనించాలి. బయట చలికి చర్మం ఎఫెక్ట్ కు గురైతే లోపల నీటి శాతం తగ్గిపోతే శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. అందుకే కాలాన్ని చూసి వెనకడుగు వేయకుండా తగిన మోతాదులో నీటిని తాగాలి. కనీసం గంటకు ఒకసారి ఒక గ్లాసుడు నీళ్లు తాగుతూ ఉంటే మంచిది.
ఇలా పైన చెప్పుకున్న పనులు చలికాలంలో ఫాలో అయితే చర్మం తన జీవాన్ని కోల్పోకుండా ఉంటుంది.
◆నిశ్శబ్ద.