పిల్లలు పుస్తకాలు చదవట్లేదా... అయితే ఇలా చేయండి!

పిల్లలు పుస్తకాలు చదవట్లేదా... అయితే ఇలా చేయండి!

ఏ ఇద్దరు వ్యక్తుల చేతివేలి ముద్రలు ఒకేలా ఎలా ఉండవో.. ఏ ఇద్దరు వ్యక్తుల రుచి మొగ్గలు ఓకేవిధంగా ఎలా ఉండవో.. అలాగే ఏ ఇద్దరు పిల్లల ఆలోచనలు ఒకేలా ఉండవు. పిల్లలు జీవితంలో గొప్పవాళ్లుగా మారడానికి పెద్దవాళ్ళు ఎన్నో మార్గాలు ఫాలో అవుతారు. అయితే  ఒకరికి పని చేసేది మరొకరికి పని చేయకపోవచ్చు. ఇలాంటప్పుడు ఓపికపట్టాలి.  ముందు మీ పిల్లలకు ఏది ఉత్తమంగా పని చేస్తుందో కనుగొనే వరకు విభిన్న విధానాలను ప్రయత్నిస్తూ ఉండాలి. 

పుస్తకాలు చదవడం చాలా ఆరోగ్యకరమైన అలవాటు. ఇది పిల్లల్లో విభిన్న కోణాలను బయటకు తెస్తుంది, ఆత్మను సుసంపన్నం చేస్తుంది జ్ఞానాన్ని నింపుతుంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో  పుస్తకపఠనం అలవాటు చెయ్యాలి  అందుకోసం కొన్ని చిట్కాలు ఇవిగో..

వయస్సుకి తగిన పుస్తకాలతో ప్రారంభించండి:

 మీ పిల్లల వయస్సు మరియు పఠన స్థాయికి తగిన పుస్తకాలను ఎంచుకోండి. మీరు చిన్న పిల్లల కోసం బొమ్మల పుస్తకాలతో ప్రారంభించవచ్చు వారు పెద్దయ్యాక చాప్టర్స్ ఉన్న పుస్తకాలకు వెళ్లవచ్చు. వారి దృష్టిని ఆకర్షించే ప్రకాశవంతమైన, రంగురంగుల దృష్టాంతాలతో పుస్తకాలను ఎంచుకోండి.

పఠనాన్ని రొటీన్‌గా చేసుకోండి: 

నిద్రవేళకు ముందు లేదా రాత్రి భోజనం తర్వాత పుస్తక పఠనం కోసం ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి. ఇది వారి దినచర్యలో పఠనాన్ని ఒక క్రమమైన భాగంగా చేయడానికి వారిలో పఠనాభిమానాన్ని కలిగించడంలో సహాయపడుతుంది.

ఆసక్తి కలిగించే విషయాలపై పుస్తకాలను ఎంచుకోండి:

పిల్లలు ఆసక్తిని కలిగించే అంశంగా ఉన్నప్పుడు చదవడానికి ఇష్టపడతారు. మీ పిల్లలు డైనోసార్‌లను ఇష్టపడితే, వాటి గురించిన పుస్తకాలను కనుగొనండి. వారు క్రీడలను ఇష్టపడితే, వారికి ఇష్టమైన క్రీడ లేదా అథ్లెట్ గురించి పుస్తకాలను వెతికి తెచ్చివ్వండి. ఇలాగే వారికి ఏది ఇష్టమైతే ఆ మార్గంలోనే పుస్తకపఠనం అలవాటు చెయ్యాలి.

కలిసి చదవండి:

నన్ను చదవమని చెబుతూ నువ్వు మొబైల్ చూసుకుంటావా?? టీవీ చూస్తావా?? ఇలా పిల్లలు ముక్కుసూటిగా ప్రశ్నలు వేస్తారు. వాటికి సమాధానం చెప్పలేక వారిని పెద్దరికం అనే ట్యాగ్ తో మందలిస్తారు పెద్దలు. కాబట్టి  కుటుంబంలో ఎవరో ఒకరు పిల్లలతో కలిసి చదవడానికి సమయాన్ని వెచ్చించండి. కథను బిగ్గరగా చదవడం,  కథ గురించి చర్చించడం వంటివి చేయండి. ఇది వారి పఠన నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా మీకు మరియు మీ పిల్లల మధ్య బంధాన్ని ఏర్పరుస్తుంది.

బహుమతులు ఇవ్వండి:

పిల్లలు చదువుతున్నప్పుడు వారిని ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహం తెచ్చుకుంటారు. వారు చదివే పుస్తకంలో ఒక చాప్టర్ పూర్తి చేసినప్పుడు, దానిగురించి మీతో సమర్థవంతంగా చర్చించినప్పుడు, పుస్తకాన్ని విజవంతంగా పూర్తి చేసినప్పుడు వారికి బహుమతులు ఇవ్వడం. వారికి ఇష్టమైన ప్రదేశాలకు వారిని తీసుకెళ్లడం. మరొక అద్భుతమైన పుస్తకాన్ని వారికి ఇవ్వడం చేస్తే.. వారు ఎంతో సంతోషిస్తారు.

                                  ◆నిశ్శబ్ద.