యువతులు సీతాకోకచిలుకతో జాగ్రత్త..!
posted on Jun 29, 2016
యువతులు సీతాకోకచిలుకతో జాగ్రత్త..!
పచ్చని చెట్లపై..రంగు రంగుల పూలపై వాలి మకరందం పీలుస్తున్న సీతాకోకచిలుకను చూస్తే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. అలాంటిది ముఖంపై సీతాకోకచిలుక వస్తే..జోక్ చేయకండి సీతాకోకచిలుకేంటి ముఖంపై రావడమేంటి..? అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం. యుక్తవయసులో ఉన్నవారిని ఇటీవల కాలంలో వేధిస్తున్న సమస్య లుపస్ లేదా సీతాకోకచిలుక వ్యాధి. యువకుల కన్నా యువతుల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య ఎక్కువగా 30 ఏళ్లలోపు వారిలోనే కనిపిస్తోంది. మనదేశంలో ప్రతి వెయ్యిమందిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సీతాకోకచిలుక ఆకారంలో బుగ్గలపై దద్దుర్లు రావటంతో పాటు జ్వరం, కీళ్లనొప్పులు, నీరసం ఈ వ్యాధి లక్షణాలు. లుపస్ అనేది ఓ ఆటో ఇమ్యూన్. దీనిని ఆరంభదశలో గుర్తించపోతే చర్మంపై ప్రభావం చూపడంతో పాటుగా కీళ్లు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, నరాల వ్యవస్థ తదితర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలుత 15 నుంచి 45 సంవత్సరాల యువతీ/ యువకుల్లో తరచుగా ఈ లక్షణాలు కనిపిస్తాయని భావించినప్పటికి... 20 నుంచి 30 సంవత్సరాల వారిలో వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందని కనుగొన్నారు.
మనదేశంతో పోలిస్తే విదేశాల్లో లుపస్ అత్యంత సహజంగా కనిపిస్తోంది. ఆఫ్రికన్-అమెరికన్‌లలో ఇది మరింత తీవ్రంగా ఉండటంతో పాటుగా నానాటికీ దీని బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధి ఇతర లక్షణాల్లో బరువు తగ్గడం, రక్తం గడ్డకట్టడం, చేతి వేళ్లు, కాలి వేళ్లకి రక్తం సరఫరా కాకపోవడం, గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సాధారణంగా రోగనిరోధక వ్యవస్థ శరీరంలో యాంటీ బాడీలు తయారుచేసే క్యాన్సర్లు, సూక్ష్మక్రిములు బారి నుంచి కాపాడుతుంది. కానీ లుపస్ సోకిన రోగి నిరోధక వ్యవస్థపై ఆటో యాంటీబాడీస్ దాడి చేస్తాయి. దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో రోగం ముదిరిపోయిన తర్వాత వైద్యులను సంప్రదిస్తున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే లుపస్‌గా అనుమానించి వైద్యుని సంప్రదిస్తే మొదట్లోనే అనర్థాన్ని అడ్డుకోవచ్చు.