దీపాలకాంతితో అమ్మాయిల అందం పోటీ పడాలంటే ఇలా చెయ్యాల్సిందే!

దీపాలకాంతితో అమ్మాయిల  అందం పోటీ పడాలంటే ఇలా చెయ్యాల్సిందే!


 దీపావళి భారతదేశ ప్రజలందరూ పెద్ద ఎత్తున సంతోషంగా జరుపుకునే పండుగ. అందుకే ఎక్కడ చూసినా ఈ పండుగ వైభవం కనిపిస్తుంది. ఇది హిందూ మతానికి చాలా  ప్రత్యేకమైన పండుగ.   ప్రతి ఏడాది దీన్ని చాలా గొప్పగా  జరుపుకుంటారు. దీపావళి సందర్బంగా ఇళ్లను అలంకరించుకోవడం, ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు వేయడం , ఇల్లంతా దీపాలు వెలిగించడం వంటివి చేస్తారు.  కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా దీపావళి సందర్బంగా  అమ్మాయిలు తమ అందంలో  దీపాల కాంతితో పోటీ పడాలని ప్రయత్నిస్తారు. అయితే  ఈ దీపాల పండుగలో  డిఫరెంట్‌గా కనిపించాలన్నా గులాబీ లాంటి అందంతో మెరిసిపోవాలన్నా ఈ కింది టిప్స్ పాటించాలి..


దీపావళికి ఇంకా ఒకరోజే సమయం ఉంది. ఈ సందర్బంగా  ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌,  మాస్క్‌లను ఉపయోగించడం మంచిది.  కావాలంటే  చర్మానికి సరిపోయే ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. దీని వల్ల చర్మానికి లోపల నుండి జీవం వస్తుంది,  ముఖానికి రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది దీపావళి నాటికి  ముఖం మెరిసేలా చేస్తుంది.

చాలామంది అమ్మాయిలు  తమ ముఖాన్ని సాధారణ ఫేస్ వాష్‌తో కడగడం ద్వారా శుభ్రం చేసుకుంటారు, అయితే కొన్నిసార్లు హడావిడిలో   ముఖాన్ని శుభ్రం చేయడానికి తగినంత సమయం ఉండదు. ఏదైనా క్లెన్సింగ్ ఏజెంట్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  ఇందుకోసం పచ్చి పాలలో కాటన్‌ను నానబెట్టి ముఖానికి మసాజ్ కూడా చేసుకోవచ్చు. మసాజ్ చేసిన తర్వాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం శుభ్రంగా,  మేకప్‌కు చేసుకోవడానికి అనువుగా  స్మూత్‌గా మారుతుంది.

దీపావళి పండుగ  రోజున మేకప్ చేసేటప్పుడు ఎక్కువగా పొరల మేకప్  వేసుకోకపోవడం మంచిది. బేస్,  ఫౌండేషన్  వేరు వేరు  లేయర్‌లను వేసుకోవడం  వలన  మేకప్ క్రాక్స్ వచ్చి తక్కువ సమయంలో పగుళ్లు ఏర్పడతాయి. అందువల్ల మేకప్  ను ఒకే  సన్నని పొరగా వేసుకోవాలి. ఇది చాలా సేపు ఉంటుంది.  ముఖం ఎక్కువసేపు  ఆరోగ్యంగా కనిపిస్తుంది.


ముఖానికి మేకప్ వేసేటప్పుడు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే, పాత లేదా చౌక ఉత్పత్తులను ఉపయోగించడం.  వీటితో  ఎన్ని విధాలుగా మేకప్ అప్లై చేసినా  అవి ఎక్కువ కాలం ఉండవు.   చెమటతో కారిపోవడం, లేదా రంగు వెలసిపోవడం జరుగుతుంది. అందువల్ల ఎల్లప్పుడూ మంచి కంపెనీ నుండి ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఇకపోతే మేకప్ వేసేటప్పుడు జరిగే రెండవ తప్పు.. సరైన క్రమంలో మేకప్ వేయకపోవడం.  క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్, ప్రైమర్, ఫౌండేషన్, కన్సీలర్, ఫేస్ పౌడర్, బ్లషర్, ఐ మేకప్ అన్నీ వేటి  ప్రాముఖ్యతను అవి కలిగి ఉంటాయి. వాటిలో దేని తరువాత దేన్ని అప్లై చేయడం మంచిదో తెలుసుండటం ముఖ్యం. ఏ ఒక్కటైనా అటుది ఇటు, ఇటుది అటు వేస్తే మేకప్ మొత్తం పాడైపోతుంది. కాబట్టి మేకప్ వల్ల అందంగా కనబడాలంటే  ఈ తప్పులు చేయకూడదు.

 మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే వాటర్ ప్రూఫ్ మేకప్ ఉత్పత్తులను ఉపయోగించాలి. ప్రస్తుతం మార్కెట్లో చాలా కంపెనీలు వాటర్‌ప్రూఫ్ మేకప్‌ను విడుదల చేస్తున్నాయి. ఇవి సులభంగా అందుబాటులో ఉంటాయి.   ఇవి ముఖంలో గ్లోను  ఎక్కువసేపు ఉంచడంలో కూడా సహాయపడతాయి.

                                                            *నిశ్శబ్ద