పిల్లలకి ‘ఆర్ట్ ఆఫ్ సేవింగ్’ నేర్పాల్సిందే
posted on Oct 9, 2024
పిల్లలకి ‘ఆర్ట్ ఆఫ్ సేవింగ్’ నేర్పాల్సిందే
డబ్బు పొదుపు చేయటం కూడా ఒక కళే. అవసరాలకు తగ్గట్లు ఒక క్రమపద్ధతిలో డబ్బు ఖర్చు చేయటం, మిగిలినది భవిష్యత్తు కోసం పొదుపు చేయటం మంచిదని అందరికి తెలిసిందే. అయితే ఇలాకాక డబ్బును దుబారా చేయటం, లేదా అవసరాలకు కూడా ఖర్చు చేయకుండా తాము ఇబ్బంది పడుతూ, ఇంట్లో వారినీ ఇబ్బంది పెడుతూ అతిగా పొదుపు చేయటం రెండు తప్పే. అందుకే డబ్బు పొదుపు చేయటం ఒక కళ ఒక్కరోజులో అలవాటు కాదు. సంపాదన మొదలవ్వగానే డబ్బును మేనేజ్ చేయటం వస్తుందనుకోవటం పొరపాటు. అది చిన్నతనం నుంచే అలవడాల్సిన కళ.
డబ్బు విలువ చిన్నప్పటి నుంచి తెలిసిన వారు పెద్దయిన తరువాత డబ్బును చక్కగా మేనేజ్ చేయగలరుట. తమ తెలివితేటలను, విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి అవసరమైనంతవరకే డబ్బు ఖర్చుపెట్టే పొదుపరులుగా పిల్లలు రేపు పెద్దయ్యాకా ఉండాలంటే అందుకు చిన్నప్పటినుంచే తల్లిదండ్రులు వారికి డబ్బు విలువ తెలియచేయాలి. పిల్లల ప్రతీ అవసరాన్ని తామే గుర్తించి తీర్చటం కాకుండా, పిల్లలు తమ అవసరాలు ఏంటో తామే గుర్తించి తల్లిదండ్రులను అడిగే అవకాశం ఇవ్వటం మొదటి ప్రయత్నం. ఆ తరువాత కాస్త ఎదిగిన పిల్లలకి కొంత డబ్బు ఇచ్చి వాటిని తమ అవసరాలకు ఉపయోగించుకోమనటం రెండో ప్రయత్నం. ఇందులో తల్లిదండ్రులు ఎంతో నిక్కచ్చిగా ఉండాలి. ఇచ్చిన డబ్బును అనవసర ఖర్చులకు ఉపయోగించి, తిరిగి అవసరానికి చేయిచాచితే "లేదు" అని ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే పిల్లలు ఉన్న డబ్బుని అవసరాల మేరకు ఖర్చు చేసుకోవటం నేర్చుకోగలుగుతారుట.
పిల్లలకు పాకెట్ మనీ ఏ వయసు నుంచి ఇవ్వచ్చు, ఎంత ఇవ్వచ్చు అనేది చాలా మంది తల్లిదండ్రులకు వచ్చే అనుమానం. 6 ఏళ్ళు దాటిన పిల్లల నుంచి పాకెట్ మనీ ఇవ్వటం ప్రారంభించవచ్చు అంటున్నారు నిపుణులు. వారానికి ఒకసారిగా ఇంత అని ప్రారంభించి, పిల్లలు పెద్దవుతున్న కొద్దీ దానిని నెలకి ఒకసారిగా మార్చాలి. వాటిని వారి ఇష్టాలు, అవసరాలు, భవిష్యత్తులో కొనుక్కోవాలనుకుంటున్న పెద్ద వస్తువులు ఇలా విభజించి ఖర్చు చేయటం, దాచుకోవటం నేర్పించాలి.
ప్రతీ వారం మీరు పిల్లాడికి కొంత డబ్బు ఇస్తుంటే, అప్పుడు తనకి చెప్పాలి. ఈ డబ్బును నువ్వు ఇప్పటి అవసరాలకి ఖర్చుచేసుకుని, మిగిలినది దాచుకుంటే ఆ మిగిలిన డబ్బు కొంత మొత్తం అయ్యాకా నీకు నచ్చిన బైసికిల్, వీడియోగేమ్ వంటి పెద్ద ఇష్టాలను తీర్చుకోవచ్చని! అప్పుడు డబ్బు విషయంలో అబ్బాయి నైజమేమిటో స్పష్టంగా తెలిసిపోతుంది మనకు. పూర్తిగా దుబారా చేస్తున్నాడా? అవసరాలు కూడా తీర్చుకోకుండా పిసినారిగా ఉంటున్నాడా? గమనించగలిగితే చిన్నతనంలోనే డబ్బు పట్ల సరైన దృక్పథం ఏర్పరచుకునేలా తనని మలచవచ్చు.
డబ్బు విలువ పిల్లలకు తెలియాలన్నా, దానిని సరిగ్గా మేనేజ్ చేయటం నేర్చుకోవాలన్నా పిల్లలకు తప్పకుండా డబ్బు ఇవ్వాలి. పర్యవేక్షించాలి. అవసరం మేరకు సలహాలు ఇవ్వాలి. అప్పుడే పిల్లలు పెరిగి పెద్దయ్యాక డబ్బును సక్రమంగాఉపయోగించుకోగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా చిన్నతనం నుంచి అలవాడాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి ఆలోచిస్తారు కదూ!
-రమ ఇరగవరపు