మహిళలు గర్బం దాల్చడంలో మరింత గొప్ప ఫలితాలు పొందాలంటే ఈ టెస్ట్ బెస్ట్..


మహిళలు గర్బం దాల్చడంలో మరింత గొప్ప ఫలితాలు పొందాలంటే ఈ టెస్ట్ బెస్ట్..
 

గర్బం దాల్చడం, తల్లి కావడం ప్రతి ఆడపిల్ల కల. కానీ దురదృష్టవశాత్తూ  ప్రస్తుతకాలంలో 12నుండి 15శాతం జంటలు  పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భార్యాభర్తల ఇద్దిరలోనూ పిల్లలు పుట్టడంలో తగినంత సామర్థ్యం లేకపోవడం వల్ల  చాలామంది పిల్లల కోసం వైద్యుల చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. లోపం ఎవరిలో ఉన్నా అది ప్రత్యక్షంగా మహిళల మీదే  కనిపిస్తుంది.

కానీ చాలామంది మహిళలు గర్భం దాల్చడంలో  అవకాశాలు ఉన్నా కూడా విఫలమవుతుంటారు. దీనికి కారణం మహిళలకు గర్బం ధరించే సమయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో సరిగా అవగాహన లేకపోవడం. అయితే ఇప్పుడు దీన్ని కనుక్కోవడం సులభం. దీని వల్ల మహిళలు గర్బం ధరించే అవకాశాలు 20 నుండి 25శాతం ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎలా కనుక్కోవాలి? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

గర్భం దాల్చడానికి అద్బుతమార్గం..

మహిళలలో గర్బం దాల్చే అవకాశాలు  అండాలు విడుదల అయ్యే సమయంలో ఎక్కువగా ఉంటాయి. మూత్ర పరీక్ష ద్వారా అండోత్సర్గ పరీక్ష చేయించుకోవచ్చు.  ఈ అండోత్సర్గ పరీక్ష కిట్ సాధారణ మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది. లేదా దీన్ని వైద్యుల పర్యవేక్షణలో కూడా చేసుకోవచ్చు.  సాధారణంగా మహిళలలో ఋతుచక్రం  28రోజులుగా ఉంటుంది. చివరిసారి ఋతుక్రమం ప్రారంభమైన 11వ రోజున ఈ పరీక్షను చేసుకోవాలి. అండాలు విడుదల కావడానికి మూడు నుండి ఐదు రోజుల ముందు ఈ పరీక్షను చేసుకోవాలి.  ఈ పరీక్షలో టెస్ట్ కిట్ రంగు మార్పు కనబడితే మరొక 24నుండి 36గంటలలో అండాలు విడుదల కావడం ప్రారంభమవుతుందని అర్థం. దీన్ని అర్థం చేసుకుని భార్యాభర్తలు సంభోగంలో పాల్గొంటే ఆ సమయంలో మహిళలు గర్బం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అండోత్సర్గానికి ఐదు రోజుల ముందు నుండి అండోత్సర్గము తర్వాత చాలా గంటల వరకు గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఈ కాలాన్ని ఫెర్టిలిటీ విండో అంటారు.  అండోత్సర్గము కాలం గురించి తెలుసుకోవడానికి  అల్ట్రాసౌండ్ కూడా  చేయవచ్చు లేదా ఋతు చక్రానికి సంబంధించిన హార్మోన్ల స్థాయిలను తెలుసుకోవడానికి మూత్ర పరీక్ష చేయించుకోవచ్చు.  ఇంకొక మార్గం ఏమిటంటే  గర్భాశయ శ్లేష్మం పర్యవేక్షణ సహాయంతో  అండోత్సర్గము కాలాన్ని కూడా తెలుసుకోవచ్చు. అండాలు పర్ఫెక్ట్ గా విడుదల అయ్యే సమయాన్ని తెలుసుకోవడానికి ఈ మార్గాలు  ఉన్నాయి. ఇవే కాకుండా  పీరియడ్ ట్రాకింగ్ యాప్ ద్వారా కూడా దీన్ని తెలుసుకోవచ్చు.

 గర్భం దాల్చాలనుకుంటే లేదా చాలా కాలంగా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే,  వైద్యుని సలహా,  సహాయంతో ఈ మూత్రం అండోత్సర్గము పరీక్షను చేయవచ్చు. ఈ పరీక్ష సహాయంతో అండోత్సర్గము గురించి సమాచారాన్ని పూర్తీగా అర్థమవుతుంది కూడా.  తద్వారా  తొందరలోనే  గర్భం దాల్చవచ్చు.

                                                            *నిశ్శబ్ద.