Vegetable Idli
వెజిటేబుల్ ఇడ్లీ
రోజూ ఉదయాన్నే అందరు కామన్ గా తినే టిఫిన్ ఇడ్లీ. మినప పప్పుతో చేసే ఇడ్లీ బలమే అయినా రోజు తినాలంటే మొహం మొత్తుతుంది. అందుకే కాస్త వెరైటీ గా ఉండటానికి వెజిటేబుల్ ఇడ్లీ ట్రై చేసి చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
బొంబాయి రవ్వ - 2 కప్పులు
సేమ్యా - 1 1/2 కప్పు
తురిమిన కేరట్, బీట్రూట్ - 1 కప్పు
పచ్చి మిర్చి - 4
పచ్చి బఠాణి - 1/2 కప్పు
పెరుగు - 3 కప్పులు
పోపు దినుసులు - సరిపడా
వంటసోడా - చిటికెడు
కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా
ఉప్పు - తగినంత
తయారి విధానం:
ఈ ఇడ్లీల తయారికి మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టి కాస్త నెయ్యి గాని నూనే గాని వేసి బొంబాయి రవ్వను, సేమ్యాను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరికాస్త నూనే వేసి అందులో పోపుదినుసులు వేయించుకోవాలి. అవి వేగిన తరువాత వాటిలో కొత్తిమీర కరివేపాకు వేసి ఆపై అందులో తురిమిన కేరట్, బీట్రూట్ ఇంకా ఉడికించి పెట్టుకున్న బఠాణి వేసి వాటిని 3 నిమిషాలు మగ్గనియ్యాలి. స్టవ్ ఆపి వాటినన్నిటిని పెరుగులో వేసి కలపాలి. అదే పెరుగులో వేయించి పెట్టుకున్న రవ్వ, సేమియాను కలిపి అందులో ఒక చిటికెడు వంటసోడా కలిపి గంట పాటు నాననివ్వాలి. ఇలా నానిన పిండిని ఇడ్లీ పాత్ర ప్లేటుల్లో వేసి 15 నిమిషాలు ఉడకనీయాలి. ఈ ఇడ్లీలని పల్లి చెట్నీ తో గాని, కొత్తిమీర చట్నీతో గాని కలిపి తింటే చాల టేస్టీ గా ఉంటాయి.
...కళ్యాణి