Tomato Kurma

 

 

 

టమాటా కుర్మా

 

 

 

మా పిల్లలు టమాటా కూర బోర్ అంటే ఒకసారి ఇలా చేసాను. మసాలా రుచి తగలగానే వాళ్లకి చాలా నచ్చింది. అన్నంలో కంటే రైస్ ఐటమ్స్ కి, చపాతీలలోకి బావుంటుంది. ఈ కూర పిల్లలు దోశలలోకి కూడా చాలా బావుంటుందని చేయమంటారు. ఈ కూర చేయడానికి కూడా ఎక్కువ టైమ్ పట్టదు. రెగ్యులర్ గా చేసే టమాటా కూరనే చేసే విధానంలో చిన్న మార్పు చేస్తే వెరైటీ డిష్ గా మారి అందరూ సూపర్ అంటూ తిన్నారు. మీరూ ఒకసారి ట్రై చేయండి.

 

కావలసిన పదార్ధాలు:

టమాటాలు            - 5
ఉల్లిపాయలు         - 12
అల్లంవెల్లుల్లి           - 1/2 చెమ్చా
దాల్చిన చెక్క         - చిన్నది
లవంగాలు            - 3
కారం                   - 1 చెమ్చా
బిర్యాని ఆకు         - తగినంత
పసుపు                - తగినంత
నూనె                  - 4 చెమ్చాలు
కొబ్బరి తురుము   - 1/4 కప్పు
పచ్చిమిర్చి           - 2
గసగసాలు           - 1/2 చెమ్చా
నువ్వులు            -1/2 చెమ్చా

 

తయారీ విధానం:

ముందుగా కొబ్బరి, పచ్చిమిర్చి, గసగసాలు, నువ్వులు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత బాణలిలో ఓ నాలుగు చెమ్చాల నూనె వేసి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యాని ఆకు వేసి ఒక్క నిమిషం వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్ద,  పసుపు, కారం వేసి బాగా కలపాలి. ఆ వెంటనే సన్సగా తరిగిన టమాటాలని ఆ మిశ్రమానికి కలిపి ఉప్పు వేసి కలియబెట్టి మూతపెట్టాలి. సన్నని మంట మీద ఓ పది నిమిషాలు మగ్గిస్తే చాలు. టమాటా బాగా మగ్గాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముద్దని వేసి కలపాలి. అప్పటికే టమాటా లోని నీళ్లు వచ్చి ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా గ్రేవీ కోసం వేరే నీళ్లు పోయక్కర లేదు. ఒకవేళ కూర మరీ గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే చిన్న కప్పు నీళ్లు పోసి పెద్ద మంట మీద రెండు నిమిషాలు ఉంచి ఆపాలి. ఈ కూర పుల్లగా, కొంచం మసాలా వాసనతో రుచిగా ఉంటుంది. ఈ కుర్మాని రైస్ ఐటమ్స్ కి సైడ్ డిష్ గా వాడచ్చు.

 

టిప్

1. కొబ్బరి అన్నం, జీరా రైస్, గ్రీన్ పీస్ పలావ్, స్వీట్ కార్న్ రైస్ వంటి రైస్ ఐటమ్స్ కి ఈ పుల్లటి టమాటా కుర్మా మంచి కాంబినేషన్.
2. కొబ్బరి, గసగసాల పేస్టు వేస్తాం కాబట్టి టమాటా పులుపు తగ్గి కమ్మదనం వస్తుంది. ఒకవేళ కూర మరీ పులుపుగా అనిపిస్తే చిన్న కప్పు పాలని వేసి కలిపితే చాలు.
3. ఉల్లిపాయలు నూనెతో వేసినప్పుడు పెద్ద మంట మీద రెండు నిమిషాలు వేయించాలి. లేకపోతే నూనె పీలుస్తాయి ఉల్లిపాయలు.

 

-రమ