Sojja Boorelu

 

 

సొజ్జ బూరెలు

 

 

శ్రావణ శుక్రవారం నాలుగు వారాలు అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి , తీపి నైవేద్యం పెట్టాలి అంటారు. నిజమే కాని ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళకి రకరకాల వంటకాలు చేయటానికి సమయం సరిపోదు. కాస్త మన పద్ధతులకి దగ్గరగా, అలాగే సులువుగా చేయగలిగే స్వీట్స్ చేయటం తెలిస్తే బావుంటుంది కదా. అలా సులువుగా అయిపోయే స్వీట్ ఈ సొజ్జ బూరెలు. బూరెలు అన్న పేరు వినగానే నేను కూడా ముందు వద్దులే మనవల్ల అయ్యే పని కాదు అనుకున్నా..కాని చేసాక పర్వాలేదు సులువే అనిపించింది. మరి మీరు కూడా చేసి చూడండి. రేపు కృష్ణాష్టమి కూడా కదా.. క్రిష్ణయ్యకి కూడా ఇష్టమే తీపి వంటకాలు. కాబట్టి రేపు కూడా చేసుకోవచ్చు..

 

కావలసిన పదార్థాలు:

బొంబాయి రవ్వ - ఒక కప్పుడు
పంచదార - ఒక కప్పుడు
నీరు - ఒక కప్పుడు
నెయ్యి - రెండు చెమ్చాలు
యాలకుల పొడి - చిటికెడు
బియ్యం పిండి - పావు కప్పు
మైదా - పావు కప్పు
ఉప్పు - చిటికెడు
వంట సోడా - చిటికెడు
నూనె - వేపుకి తగినంత

 

తయారీ విధానం:

ముందుగా నూకని పొడి బాణలిలో కాస్త ఎర్రదనం వచ్చే దాక వేయించాలి. ఆ తర్వాత తీసి వేరే ప్లేట్ లో పోసి అదే బాణలిలో నీరు పోసి మసిలే వరకు ఉంచాలి. నీరు మసులు తుండగా అందులో ముందుగా నూక వేసి కలిపితే దగ్గరకి వస్తుంది. ఆ తర్వాత వెంటనే పంచదార కూడా వేసి కలపాలి. పంచదార వేయగానే నూక జారుగా వస్తుంది. కాని కదుపుతూ వుంటే మళ్ళి దగ్గర పడుతుంది. కొంచం దగ్గర పడుతుండగా నెయ్యి వేసి బాగా కలిపితే బాణలికి అంటుకోకుండా వస్తుంది. నూక ఉడికి ఉండ చేసుకునే వీలుగా రాగానే దింపి చల్లారనివ్వాలి . ఈ లోపు బియ్యం పిండి, మైదా పిండిలని కలిపి అందులో చిటికెడు ఉప్పు వేసి, వంట సోడా కూడా చిటికెడు వేసి తగినంత నీరు కలపాలి. దోశెల పిండిలా జారుగా వుండాలి. మామూలు బూరెలు చేయటానికి తోపు పిండి వాడతాం కదా అలా రావాలి.

 

నూక మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసుకుని తోపు పిండి లో ముంచి నూనెలో వేయించాలి. మరి ఎర్రగా కాకుండా కాస్త బంగారు వర్ణం వస్తుండగా తీసి పేపర్ మీద పెడితే నూనె ఏమన్నా వుంటే పేపర్ పీల్చేస్తుంది. చేయటం ఎంతో సులువు కాని రుచిలో మాత్రం పూర్ణం బూరెలకి పోటి పడతాయి ఈ సొజ్జ బూరెలు. చేసి రుచి చూసి చెప్పండి. మా ఇంటి మహాలక్ష్మికి ఆరగింపు పెట్టిన ఈ బూరెలు చూడండి ..నోరురిస్తున్నాయి కదా..

 

టిప్స్ :

నీటిలో నూక వేసిన వెంటనే పంచదార కూడా వేయాలి ..లేక పోతే నూక పూర్తిగా ఉడికి గట్టి పడితే పంచదార వేయగానే ఉండలు, ఉండలు కడుతుంది.

అలాగే నూకతో పాటే పంచదార కూడా వేస్తె నూక పూర్తిగా ఉడకదు. ఈ చిన్న జాగ్రత్త తీసుకుంటే సొజ్జ బూరెలు సూపర్ గా వస్తాయి .

 

- రమ