Samosa Pinwheels
సమోసా పిన్ వీల్స్
సమోసా అంటే నచ్చని పిల్లలు ఉండరు. కాని ఇంట్లో మనం చేసే సమోసా బయట కొన్న సమోసా లాంటి షేప్ చాలావరకు రాదు. అలాంటి వాళ్ళు ఈ పిన్ వీల్ సమోసా ట్రై చేస్తే మంచిది. మంచి టేస్ట్ ఉంది వెరైటీ షేప్ లో ఉంటాయి ఇవి. మరి ఎలా తయారుచేసుకోవాలో చూసేద్దామా.
కావాల్సిన పదార్థాలు:
మైదా - 2 కప్పులు
బొంబాయి రవ్వ - 1/4 కప్పు
ఉప్పు - తుచికి తగినంత
నూనె - 1/4 కప్పు
స్టఫ్ఫింగ్ కోసం:
ఉడికించిన బంగాల దుంపలు - 4
ఉడికించిన బటాని - 1/2 కప్పు
జీలకర్ర - 1/2 చెంచా
ధనియాల పొడి - 2 చెంచాలు
గరం మసాలా - 1/2 చెంచా
కారం - 1/2 చెంచా
ఆమ్చూర్ పొడి 1/2 చెంచా
కొత్తిమీర - 1 కట్ట
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 2 చెంచాలు
తయారి విధానం:
ఈ పిన్ వీల్స్ తయారుచేయటానికి ముందుగా ఒక బొఎల్ తీసుకుని మైదా, బొంబాయి రవ్వ తగినంత ఉప్పు వేసి 1/4 కప్పు నూనే వేసి పిండి అంతటిని బాగా కలపాలి. నూనె కలపటానికి పూర్తిగా సరిపోదు కాబట్టి కాసిన్ని నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని ఉడికించిన బంగాల దుంపలు, బటానీలు వేసి అందులో జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఆమ్చూర్ పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చి మిర్చి వేసి నీళ్ళు పోయకుండా ముద్దలా కలుపుకోవాలి. మరొక చిన్న బౌల్ లో 2 చెంచాల మైదా వేసి నీళ్ళు పోసి పల్చటి దోసెల పిండిలా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు చపాతి పిండిని తీసుకుని పెద్ద సైజు చపాతిలా వత్తి దాని మీద మనం బంగాళదుంపలతో తయారుచేసి పెట్టుకున్న మిశ్రమాన్నికాస్త మందంగా పరవాలి. చేతితో ఆ మిశ్రమం చపాతి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. అలా తయారుచేసుకున్న దాన్ని మెల్లిగా చాపలా చుట్టుకుని ఆఖరున అది విడిపోకుండా కాసిన్ని నీళ్ళతో అంచులని అంటించాలి. అలా రోల్ చేసిన చపాతిని చాకుతో అంగుళం వెడల్పు ఉంచి ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పల్చటి మైదా మిశ్రమంలో ముంచి కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇలా అన్నిటిని వేయించిన తరువాత వాటిని ఒక ప్లేట్ లో టమాటో సాస్ లో డిప్ చేసుకుని తింటే భలే ఉంటుంది.
- కళ్యాణి