Methi Chaman Hariyali

 

 

 

మేతీ చమన్ హరియాలీ

 

 

 

ఎండలు భయపెడుతున్నాయి, తినటం తక్కువ లిక్విడ్స్ తీసుకోవటం ఎక్కువ అయిపోతోంది. ఎంతలా ద్రవ పదార్ధం తీసుకున్నా కాస్త తింటే ఆ బలమే వేరబ్బా, కొంచమే అయిన కాస్త బలమైనది తింటే ఇంకా హాయి. అందులోనూ ఎండాకాలం ఆకుకూరలు తింటే ఇంక చెప్పక్కర్లెద్దు. మరెందుకు ఆలస్యం లీఫి వెజిటేబుల్స్ తో మంచి వంటకం చూద్దాం.

 

కావాల్సిన పదార్థాలు:

పాలకూర - 2 కట్టలు

మెంతి కూర - 2 కట్టలు

పనీర్ - 1/2 కప్పు

ఉల్లిపాయలు - 2

పచ్చి మిర్చి - 4

జీడిపప్పు - 8

ధనియాల పొడి - 1/2 చెంచా

మీగడ - 1/2 చెంచా

గరం మసాలా - 1/2 చెంచా

ఉప్పు, కారం - తగినంత

 

తయారి విధానం:

మేతీ చమన్ హరియాలీ తయారుచేయటానికి ముందుగా మనం పనీర్ ముక్కల్ని నేతిలో వేయించాలి. అలా వేయించినవి మెత్తగా ఉండటం కోసం కొంచెం పాలల్లో నానపెట్టాలి. పాలకూరని, మెంతికూరని కాడలు లేకుండా ఆకులను తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఆ నీటిలో ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చి మిర్చిని వేసి 2 నిమిషాలు ఉడకనీయాలి. అందులోనే పాలకూర మెంతికూర ఆకులు వేయాలి. అవన్నీ కలిపి ఒక 5 నిమిషాలు ఉడికిన తరువాత స్టవ్ ఆపి అవి చల్లారాకా మిక్సి చేసి ఉంచుకోవాలి. అలాగే జీడిపప్పుని కూడా ముద్దలా రుబ్బి ఉంచుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలో నూనే వేసి కాస్త కాగాకా ఆవాలు వేసి అవి చిటపటలాడాకా అందులో పేస్టు చేసి ఉంచుకున్న పాలకూర, మెంతికూర మిశ్రమాన్ని వేయాలి. అందులో ఉప్పు,కారం, ధనియాలపొడి,వేసి కలపాలి. కాసేపు తరువాత జీడిపప్పు పేస్టు వేసి అంతా  కలిపి కొన్ని నీళ్ళు పోసి మూతపెట్టి మగ్గనివ్వాలి. అలా తయారయిన గ్రేవీలో పనీర్ ముక్కలు, గరం మసాలా పొడి వేసి కలపాలి. అంతా మగ్గిపోయి దగ్గరపడిన తరువాత కొత్తిమీర చల్లి దింపుకోవాలి. ఇది రోటిల్లోకి బాగుంటుంది అలాగే అన్నంలోకి కూడా బాగుంటుంది.

 

...కళ్యాణి