Mango Thokkudu Pickle

 

 

 

మామిడికాయ తొక్కుడు పచ్చడి

 

 

 

 

మామిడి కాయల సీజన్ వచ్చేసింది. పెద్ద ఆవకాయ పెట్టె లోపు చిన్న, చిన్న పిల్ల ఆవకాయలు బోలెడు రకాలు పెడుతుంటారు. ఒకో ప్రాంతంలో ఒకో రకం.. ఆ పిల్ల ఆకాయలు, పెద్ద ఆవకాయలు, అన్నిటి గురించి ఈ రోజు నుంచి చెప్పుకుందాం. ముందు మీరు పుల్లటి మామిడి కాయలని తెచ్చి పెట్టుకోండి చాలు. రోజుకో వెరైటీ పచ్చడి పెట్టేయచ్చు. ఈ రోజు పుల్లగా వుండే తొక్కుడు పచ్చడి నేర్చుకుందాం. చాలా సింపుల్ గా చేయోచ్చు. రుచి మాత్రం అదిరిపోయేలా వుంటుంది. ఈ పచ్చడి పెట్టేటప్పుడు ముక్కలని చిన్న చిన్నగా తరుగుకోవాలి.  కొన్ని ప్రాంతాలలో ముక్కలు తరగకుండా, మామిడిని కోరి ఎండలో పెట్టి పచ్చడి చేస్తారు. దాని రుచి వేరేగా వుంటుంది. మీరు రెండు రకాలు ట్రై చేయండి. చేసే ప్రొసీజర్ అంతా ఒక్కటే. ముక్కలు తరగటం, లేదా కోరటం, అదే తేడా..

 

కావలసిన పదార్థాలు:

మామిడి కాయలు   -- 4
పొడి కారం              -- 1 కప్పు
ఉప్పు                    -- పావు కప్పు
ఎండు మిరపకాయలు -- 3
ఆవాలు                 -- 1 చెంచా
ఇంగువ                 --1 చెంచా

 

తయారీ విధానం:

ముందుగా మామిడి కాయలు తొక్కలు తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. వాటిని ఒక పూట ఎండబెట్టాలి. అలా ఎండిన ముక్కలలో ఉప్పు, కారం కలపాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువతో పోపు వేసుకోవాలి, ఆ పోపుని మామిడి మిశ్రమం లో వేసి కలపాలి.  అంతే నోరూరించె మామిడి తొక్కుడు పచ్చడి రెడీ.

 

-శ్వేత వాసుకి