Mango Custard Delight
మాంగో కస్తర్డ్ డిలైట్
మామిడిపళ్ళ సీసన్లో రకరకాల వెరైటీలు చేసుకోకపోతే ఎలా. చూస్తేనే నోరూరిపోయే మామిడి రసంతో కస్తర్డ్ కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టి బాదం, పిస్తాతో గార్నిష్ చేసుకుని తింటే భలే ఉంటుంది. ఒక కప్పు మాంగో కస్తర్డ్ డిలైట్ తిన్నాకా రెండో కప్పు తినకుండా ఉండలేం.
కావాల్సిన పదార్థాలు:
మామిడి రసం - 2 కప్పులు
పాలు - 1 కప్పు
కస్తర్డ్ పౌడర్ - 2 చెంచాలు
పంచదార పొడి - 1/4 కప్పు
తాజా క్రీం - 1/2 కప్పు
బాదం, పిస్తా - గార్నిష్ కోసం
తయారి విధానం:
కొన్ని పాలు తీసుకుని అందులో కస్తర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలిపి ఉంచుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో క్రీం, కాస్త పంచదార పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడొక పాన్ తీసుకుని మిగిలిన పాలు పోసి మరిగించి అందులో పంచదార వేసి కరిగాకా కస్తర్డ్ మిశ్రమాని వేసి కదుపుతూ ఉండాలి. అందులోనే మాంగో ప్యూరిని వేసి అంతా దగ్గర పడ్డాకా స్టవ్ ఆపి దానిని చల్లారనివ్వాలి. దాని మీద క్రీం వేసి బాదం పిస్తాలతో అలంకరించుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లబడ్డాకా తిని ఆస్వాదించటమే.
- కళ్యాణి