Coconut Kalakand
కొబ్బరి కలాకండ్
పిల్లలు ఇష్టంగా తినే స్వీట్.. అలాగే త్వరగా చేయగలిగే స్వీట్ ఇది. ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళతో కబుర్లు చెబుతూనే వేడివేడిగా చేసిపెట్టేయచ్చు.
కావలసిన పదార్థాలు:
కొబ్బరి తురుము - ఒక కప్పు
పాలు - రెండు కప్పులు
పంచదార పొడి - ఒక కప్పు
కండెన్స్డ్ మిల్క్ - చిన్న కప్పు
నెయ్యి - రెండు చెంచాలు
తయారుచేసే విధానం:
ముందుగా పాలని మందపాటి గిన్నెలో పోసి, కొంచం చిక్కబడేవరకు సన్నని మంట మీద ఉంచాలి. ఆ తర్వాత కొబ్బరి తురుమును నేతిలో కొంచం రంగు మారే దాకా వేయించి మరుగుతున్న పాలలో వేయాలి. ఇప్పుడు అడుగు అంటకుండా కలుపుతూ వుండాలి. ఆ మిశ్రమం చిక్కబడుతుండగా పంచదార పొడి వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు మిశ్రమం మళ్ళీ కొంచం పలచబడుతుంది. అది తిరిగి గట్టిపడేవరకు కలిపి... దించే ముందు కండెన్స్డ్ మిల్క్ వేసి, ఓ పది నిముషాలు సన్నని మంటమీద వుంచి దించాలి. మరీ గట్టిగా కాకుండా కలాకండ్‌లా కొంచం మెత్తగా వుంటుంది ఇది. నోట్లో వేసుకోగానే మీకు తెలియకుండానే గొంతులోకి జారిపోయేంత టేస్ట్‌గా వుంటుంది.
-రమ